
విజయనగరం రూరల్: కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్‌గజపతిరాజు సోమవారం విజయనగరంలో ఒక మహిళను మెడవంచి కొట్టారు. మహిళా దినోత్సవం నాడు విజయనగరంలో మహిళకు ఘోర అవమానం జరిగింది. విజయనగరంలోని 14వ వార్డులో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొంతమంది టీడీపీ మహిళా కార్యకర్తలు హారతి ఇచ్చారు. ఆయన వద్దని వారించారు. ఈ సమయంలో నేత మీద గౌరవంతో హేమలత అనే మహిళ పూలు చల్లడంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు.
ఒక్కసారిగా వెనుదిరిగి వెళ్లిన ఆయన విచక్షణ లేకుండా ఆమె మెడవంచి కొట్టారు. దీంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. హేమలత అవమానభారంతో వెళ్లిపోయారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున టీడీపీ నేత చర్యతో మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సాయంత్రానికి టీడీపీ నేతలు.. తనపై అశోక్‌గజపతిరాజు చేయి చేసుకోలేదని బాధితురాలితో విలేకరుల ఎదుట చెప్పించడం విశేషం.
కాగా గతకొన్నిరోజులుగా టీడీపీ సీనియర్ నేతలు వీరంగం సృష్టిస్తున్నారు. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే , సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఓ ఫోటోగ్రాఫర్‌పై చేయిచేసుకున్న విషయం తెలిసిందే. హిందూపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాలయ్య .. తన అనుమతి లేకుండా ఫోటోలు తీయడంతో సదరు ఫోటోగ్రాఫర్ చెంపమీద కొట్టాడు. ఇదిలా ఉండగా ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సైతం సహనం కోల్పోయి శ్రుతి మించి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ సంఘటనలన్నీ వారం రోజుల సమయంలోనే వెలుగులోకి రావడం గమనార్హం.