28న ఢిల్లీ ఐఐటీలో జుకెర్‌బర్గ్ టౌన్‌హాల్ మీట్
న్యూఢిల్లీ: ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్‌బర్గ్ ఈ నెల 28న ఢిల్లీ ఐఐటీలో నిర్వహించే టౌన్‌హాల్ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్న భారతీయులతో అనుసంధానం కావడానికి ఈ సదస్సులో పాల్గొననున్నట్టు జుకెర్‌బర్గ్ చెప్పారు. భారత్‌లో 13 కోట్ల మంది ఫేస్బుక్ వినియోగదారులు ఉన్నారని, అత్యంత చురుకైన ఫేస్బుక్ సమూహాల్లో భారత్ ఒకటని, ఈ సమూహంలోని ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని అనుకుంటున్నానని తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.
తన తదుపరి టౌన్‌హాల్ ప్రశ్నోత్తరాలను అక్టోబర్ 28న ఢిల్లీలో నిర్వహిస్తున్నానని, ఎవరైనా తనను ప్రశ్నలు అడగాలనుకుంటే.. కామెంట్స్ దగ్గర అడగవచ్చని.. ఒక ప్రశ్నకు ఓట్ చేయాలనుకుంటే లైక్ చేయొచ్చని.. ఫేస్బుక్ వ్యాప్తంగా వచ్చే ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇస్తానని, ఐఐటీలో అడిగే వారికి నేరుగా సమాధానం ఇస్తానని తెలిపారు.గత నెలలో ఆల్టోలో ప్రధానితో కలసి జుకెర్‌బర్గ్ పశ్నోత్తరాలను నిర్వహించారు.