మహబూబ్‌నగర్ జిల్లాలో మెగా స్టీల్ ప్లాంటు
- రూ. 3 వేల కోట్ల పెట్టుబడితో ముందుకొచ్చిన జైరాజ్ ఇస్పాత్
- మహబూబ్‌నగర్ జిల్లా ధరూరు మండలం చింతరేవులలో 250 ఎకరాల్లో స్థాపనకు ప్రతిపాదన
- 10 లక్షల టన్నుల వార్షిక ఉత్పాదక సామర్థ్యంతో రెండు దశల్లో ఏర్పాటు
- 1,200 మందికి ప్రత్యక్షంగా, 4,700 మందికి పరోక్షంగా ఉపాధి
- మంత్రి కేటీఆర్‌తో సంస్థ ప్రతినిధి సమావేశం... పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదన గురించి వెల్లడి
- వెంటనే అనుమతులివ్వాలని పరిశ్రమల శాఖకు మంత్రి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ ఉక్కు కర్మాగారం ఏర్పాటు కానుంది. మహబూబ్‌నగర్ జిల్లా ధరూరు మండలంలో రూ. 3 వేల కోట్ల పెట్టుబడితో మెగా స్టీల్ ప్లాంటు ఏర్పాటుకు బళ్లారికి చెందిన జైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్ ముందుకొచ్చింది. రెండు దశల్లో ప్లాంటు నిర్మాణం పూర్తి చేస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. 10 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో నెలకొల్పాలనుకుంటున్న స్టీల్ ప్లాంటు స్థాపనలో సహకరించాలని కోరుతూ సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సిద్ధార్థ జైన్ బుధవారం రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కె. తారక రామారావును కలిశారు. ప్రతిపాదిత ప్లాంటు ప్రత్యేకతలను ఆయనకు వివరించారు. వివిధ రాష్ట్రాల పారిశ్రామిక విధానాలను పరిశీలించాక తెలంగాణలో పరిశ్రమ స్థాపనకు నిర్ణయించినట్లు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, వేగవంతమైన నిర్ణయాలపై పారిశ్రామికవర్గాల్లో సానుకూల స్పందన ఉందని తెలిపారు. ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన కేటీఆర్...ప్లాంటు ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. ప్లాంటు ఏర్పాటుకు సత్వర అనుమతులు జారీ చేయాలని పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్‌ను, కంపెనీ ప్రతినిధులకు క్షేత్రస్థాయిలో సహకరించాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ శ్రీదేవిని ఆదేశించారు. ఈ ప్లాంటు ద్వారా 1,200 మందికి ప్రత్యక్షంగా, 3 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని పరిశ్రమలశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కర్ణాటక నుంచి ఇనుప ఖనిజం...
ఫ్యాక్టరీ స్థాపనకు అవసరమైన 250 ఎకరాలను ధరూరు మండలం చింతరేవులో జైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్ ఇప్పటికే సేకరించింది. దేశంలోని దిగ్గజ కంపెనీలు తయారు చేసే ఉక్కుకన్నా ఉన్నత ప్రమాణాలు కలిగిన స్టీల్‌ను తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తామని సంస్థ పేర్కొంటోంది. స్టీలు ప్లాంటుకు అవసరమైన ఇనుప ఖనిజం రాష్ట్రంలో అందుబాటులో లేకపోవడంతో కర్ణాటకలోని బళ్లారి నుంచి ముడి ఇనుప ఖనిజాన్ని దిగుమతి చేసుకునే యోచనలో సంస్థ ఉన్నట్లు సమాచారం. ప్రతిపాదిత ప్లాంటు ప్రాంతం కర్ణాటకకు అత్యంత సమీపంలో ఉండటం, జూరాల ప్రాజెక్టు సమీపంలో ఉండటం, రైలు మార్గంతో సులభంగా అనుసంధానమయ్యే అవకాశం ఉండటంతో మెగా స్టీలు ప్లాంటు స్థాపనకు చింతరేవులను సంస్థ ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఫ్యాక్టరీ ఉత్పత్తి సామర్థ్యానికి అనుగుణంగా ముడి ఖనిజం ఎంత మేర అవసరం అవుతుందనే వివరాలపై త్వరలో స్పష్టత వస్తుందని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ‘సాక్షి’కి తెలిపారు.
రాష్ట్రంలోనే తొలి స్టీలు ప్లాంటు...
రాష్ట్ర పునర్విభజన చట్టం-2014 ప్రకారం ఖమ్మం జిల్లా బయ్యారంలో మూడు మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంగల సమీకృత ఉక్కు కర్మాగారాన్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) నెలకొల్పాల్సి ఉంది. తొలి దశలో రూ. వెయ్యి కోట్ల వ్యయంతో బెనిఫికేషన్, పెల్లెట్ ప్లాంటు, రెండో దశలో ఉక్కు తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తామని సెయిల్ ప్రకటించింది.
అయితే 200 మిలియన్ టన్నుల ముడి ఇనుప ఖనిజం నిక్షేపాలు ఉంటేనే కర్మాగారం ఏర్పాటు సాధ్యమవుతుందని సెయిల్ పేర్కొనడంతో ఐదు జిల్లాల పరిధిలో ముడి ఇనుప ఖనిజం లభ్యతపై జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ఆధ్వర్యంలో వివిధ సంస్థల ద్వారా సంయుక్త సర్వే జరుగుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రెండు బ్లాకులకు సంబంధించిన సమగ్ర నివేదిక ఇచ్చేందుకు జీఎస్ఐ సన్నాహాలు చేస్తోంది. అయితే సెయిల్ ప్రతిపాదనలు పట్టాలెక్కడంపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్ రాష్ట్రంలోనే తొలి మెగా స్టీలు ప్లాంటు స్థాపనకు ముందుకు రావడం విశేషం.