ముమ్మరంగా వాటర్‌షెడ్ పనులు
కంగ్టి, న్యూస్‌లైన్: భూగర్భ జలవనరులను సమృద్ధి పరి చేందుకు చేపడుతున్న మెగా వాటర్‌షెడ్ పథకం పనులు మండలంలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తుర్కవడ్‌గాం శివారులో నీటి కుంటల నిర్మాణం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మండలంలోనే అతి పెద్ద తుర్కవడ్‌గాం గ్రామ పంచాయతీ పరిధిలో రాజారాం తండా, సాధుతండా, చింతామణి తండాలు ఉన్నాయి. ఇక్కడ సాగుకు పనికి రాని భూములే ఎక్కువ. బొడిగె రాళ్లు, పరుపు బండ రాళ్ల భూములే అధికం. నీటి వనరులు చాలా తక్కువ. ఇక్కడి రైతులు కేవలం వర్షాధారం కింద ఖరీఫ్ పంటలు మాత్రమే పండిస్తారు. అందుకే ఈ ప్రాంత గిరిజనులు ప్రతి ఏటా అక్టోబర్, నవంబర్ నెలల్లో ఇతర ప్రాంతాలకు వలస వెళుతుంటారు. వీరి భూములను అభివృద్ధి పరిచేందుకు మండలంలో ‘మెగా వాటర్ షెడ్ తుర్కవడ్‌గాం’ పథకం పేరిట పనులు చేపడుతున్నారు.
నీటి కుంటలు, ర్యాక్ ఫీల్డ్ డ్యాం నిర్మాణాలను చేపడుతున్నారు.తుర్కవడ్గాంలోని 870 హెక్టార్ల భూములను మెగా వాటర్‌షెడ్ కింద గుర్తించారు. ఈ మేరకు రూ.1.04 కోట్లు నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటి వరకు 25 శాతం పనులు పూర్తయినట్లు సమాచారం. ఇప్పటికే 34 నీటి కుంటల నిర్మాణం పనులను యంత్రాల ద్వారా పూర్తి చేశారు. మరో 14 నీటి కుంటల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. ఒక్కో నీటి కుంటకు రూ.30 నుంచి రూ.50వేల వర కు వెచ్చిస్తున్నారు. ఇవే కాకుండా ఈ ప్రాంతంలో ర్యాక్ఫీల్డ్ డ్యాంలు(రాతి కట్టడాలు) కూడా చేపట్టారు. కుంటల అభివృద్ధి వల్ల తమ ప్రదేశాల్లో భూగర్భ జల వనరులు పెరుగుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.