‘విధి’ క్రీడలో ఓ సౌజన్యమూర్తి!
నిజాం హయాంలో ఆత్మసాక్షిగా విధినిర్వహణ చేసిన అరుదైన వ్యక్తుల్లో మెహదీ అలీ ఒకరు. అలీగఢ్‌లో విద్యాభ్యాసం చేసిన మెహదీ అలీ 24వ ఏట 1941లో హైదరాబాద్ స్టేట్ సివిల్ సర్వీసెస్‌లో చేరారు. 1948లో ఖమ్మం జిల్లాలోని మధిరలో డిప్యూటీ కలెక్టర్‌గా నియుక్తులయ్యారు. రజాకార్ల ఆగడాలకు హద్దుల్లేని రోజులు. ప్రభుత్వ వ్యవహారాల్లోనూ ప్రభావం చూపుతున్నారు. రైలులో ఒక మార్వాడీ బృందాన్ని పట్టుకున్నారు. పచ్చళ్ల జాడీల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారని అభియోగం మోపారు.
తనిఖీల్లో బంగారం లేదని తెలిసినా, డిప్యూటీ కలెక్టర్ హోదాలో వారిని విడిచి పెట్టమన్నా పోలీసులు రజాకార్ల ఒత్తిడి మేరకు 12 గంటల పాటు వ్యాపారులను హింసించారు. మెహదీ అలీ బాస్ వరంగల్ కమిషనర్‌గా పనిచేస్తున్న అరబ్ వ్యక్తి హబీబ్ మొహమ్మద్. మంచివాడే! రజాకార్ల ప్రభావం పెరిగేకొద్దీ కరడు తేలాడు, హిందువుల రక్తాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తా అనేంతగా! బాస్ అతి ధోరణి నచ్చకపోయినా కింది స్థాయి ఉద్యోగిగా మెహదీ అలీ ఏం చేయగలడు? భయవిహ్వలమైన హిందూ మతస్తులు నైజాం స్టేట్ చుట్టూ ఉన్న ఇతర ప్రాంతాలకు వెళ్లడం మొదలుపెట్టారు.
అరబ్‌ల దోపిడీ!
తాలూకాల్లో జిల్లాల్లో నిజాం కోశాగారాలను అరబ్‌లు కాపలా కాసేవారు. ఖజానాపై కన్నేసేందుకు ఎవ్వరూ సాహసించనంత నిబద్ధతతో పనిచేసేవారు. పరిస్థితులు విషమిస్తున్న కొద్దీ అరబ్ కాపలాదారులు తామే చట్టంగా వ్యవహరించారు. మధిరకు ఐదు కిలోమీటర్ల దూరంలోని దిందుకూరు అనేగ్రామంపై ఒకరోజు అరబ్ కాపలాదారులు దాడి చేశారు. లూటీ.. దోపిడీ.. బలాత్కారాలు.. మహిళల మంగళసూత్రాలు సైతం తెంచుకుపోయారు. మహిళలు మౌనప్రదర్శన చేసి, దుండగులపై చర్యతీసుకోవాలని మెహదీ అలీని డిమాండ్ చేశారు. పోలీసు స్టేషన్ మెహదీ ఇంటి ఎదురుగానే ఉంది. ఆగడాలు చేసిన అరబ్లపై చర్యతీసుకోవాలని ఆ సమయంలో తన పక్కనే ఉన్న సంబంధిత పోలీసు అధికారి హబీబుల్లాతో అన్నాడు.
ఊ కొట్టిన అధికారి, పోలీసులు మిన్నకుండి పోయారు. రజాకార్లు లూటీ చేసిన సొమ్ముతో రైల్వేస్టేషన్లో విహారం చేస్తూ రైలొచ్చాక తాపీగా వెళ్లిపోయారు. క్షోభించిన మెహదీ అలీ పై అధికారికి ఫిర్యాదు చేశారు. డిప్యూటీ కలెక్టర్ తన సోదర విశ్వాసులతో సవ్యంగా లేని నేపథ్యంలో అతడిని బదిలీ చేయాలని కమిషనర్ ప్రభుత్వానికి లేఖ రాశాడు. పద్ధతులు మార్చుకోకపోతే ‘విపరీత’ పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, ‘అసహజ లైంగిక కృత్యాల కేంద్రా’నికి బదిలీ కావాల్సి ఉంటుందనే అంతరార్థంతో ఖాసిం రజ్వీ.. మెహదీ అలీకి లేఖ రాశాడు. మెహదీ అలీకి బదిలీ అయ్యింది కూడా! అదే సమయంలో ‘పోలీస్ చర్య’ జరగడం, హైదరాబాద్ స్టేట్ స్వతంత్ర భారతంలో భాగమైంది. ‘విపరీత పరిణామాల’ను ఎదుర్కొనే ప్రమాదం మెహదీ అలీకి తప్పిపోయింది!
ప్రమోషన్లకు ఫుల్స్టాప్!
తనతో సహా ఎనిమిది మంది అధికారులకు కలెక్టర్‌గా పదోన్నతి రావాల్సిన లిస్ట్‌లో మెహదీ అలీ పేరు లేదు! పదోన్నతులందరూ హిందువులే! నిజాం ధోరణి నచ్చని ఏడుగురు మీర్జాలలో ఒకరైన ముల్లా బాసిత్ అలీ ద్వారా తనకు జరిగిన అన్యాయాన్ని ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూను కలసి స్వయంగా వివరించారు. నెహ్రూ వెంటనే నమ్మలేదు. ఉత్తర్వుల కాపీ చూసి చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్ బాక్లేకు వెంటనే ఫోన్ చేశారు. సంభాషణా సారాంశం ఏమిటి? ‘గతంలో హిందువులకు జరిగిన అన్యాయాన్ని సరిచేయాలని ప్రయత్నించాం, సర్’ అని బాక్లే సమాధానం! ‘నిదానంగా వెళ్లండి, ప్రభుత్వం వివక్ష చూపిస్తోందనే భావనను కలిగించకండి’ అని నెహ్రూ హితవు పలకడంతో ఎనిమిది మందిలో ముగ్గురు ముస్లింలు కలెక్టర్లుగా నియుక్తులయ్యారు అందులో మెహదీ అలీ ఒకరు!
ఎదుగూ బొదుగూ లేని స్థితి!
కలెక్టరయ్యారు కాని, అక్కడ మెహదీ అలీ పదోన్నతులు ఆగిపోయాయి. తోటి వారంతా పదోన్నతులు పొందుతున్నారు. తనకు రావడం లేదు? కారణం! ప్రతిపాదనలపై ఉన్నతాధికారులు ‘ఇతని విధేయతలు పలు రకాలు’ అని రాసేవారు! రాజ్య పాలకుడైన నిజాం సైతం రజాకార్లకు జడిసిన వాతావరణంలో న్యాయం వైపు ధర్మం వైపు ఉన్న మెహదీ అలీ పట్ల స్వతంత్ర భారత ప్రభుత్వంలో ఎంతటి అమానుష ధోరణి? పోలీస్ చర్య తర్వాత వేలాది ముస్లింలు పాకిస్థాన్ వెళ్లారు. తనలా వెళ్లలేదు. క్షుభితుడైన మెహదీ అలీ మౌనంగా ఉన్నాడు. ‘విధి’విలాసంగా భావించారు! పదేళ్ల కిందట పరమపదించారు. అంతకు కొన్నేళ్ల క్రితం ఎనభయ్యో వడిలో ఉన్న మెహదీ అలీని కలుసుకున్నాను. ప్రశాంతంగా ఉన్నారు. గతంలో తాను అనుభవించిన క్లేశానికి సంబంధించిన ఆచూకీ ఎక్కడా కనపడలేదు. మత్సరాలను తొలగించుకోలేని మనుషులను క్షమించే దయాసాగరుని నవ్వు!