ప్రకాష్ రాజ్‌కు ఎదురైన అనుభవమే....
మొన్న నటుడు ప్రకాష్ రాజ్ ఎదుర్కొన్న అనుభవమే... తాజాగా మరో మహిళకు ఎదురైంది. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే విషయంలో మనుషులు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్న సంఘటనలు తరచు చోటుచేసుకుంటున్నాయి. సాయం చేయాలని అర్ధిస్తున్నా పట్టించుకోకుండా వినోదం చూస్తున్నట్లు సెల్ఫోన్లలో ఆ సంఘటను బంధించటంలో కొందరు పోటీలు పడ్డారు. రోడ్డుమీద ఏం జరిగినా సాయం చేయడం మానేసి వీడియోలు తీసి ఫేస్బుక్లోను, యూట్యూబ్‌లోను పెట్టడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో పదే పదే చోటుచేసుకుంటున్నాయి.
తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో పట్టపగలు.. నడిరోడ్డుమీద తన భర్తపై దాడి చేస్తున్న ఇద్దరు యువకులను ఓ మహిళ ధైర్యంగా ఎదుర్కొంది. దంపతుల బైకును కారుతో ఢీకొట్టిన యువకులు, ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించటంతో పాటు ఆమె భర్తపై దాడికి దిగారు. తమకు సాయం చేయాలంటూ ఆ మహిళ అక్కడున్న వారిని ప్రాధేయపడినా ఎవరూ ముందుకు రాలేదు. పైగా చోద్యం చూస్తూ. ఈ సంఘటనను తమ సెల్ఫోన్లలో చిత్రీకరించటంలో నిమగ్నమైపోయారు.
దాంతో భర్తను రక్షించుకునేందుకు ఆ మహిళే రంగంలోకి దిగింది. అపరకాళిలా విరుచుకుపడి ...దాడికి దిగిన యువకులకు దేహశుద్ధి చేసింది. ఈ ఘటనను చూసిన ఓ హోం గార్డు తీరిగ్గా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వీడియో తీసినవాళ్లు దాన్ని సోషల్ మీడియాలో కూడా షేర్ చేయడంతో.. ఆ వీడియోను చూసిన పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. రోడ్డుమీద సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేకపోయినా... సామాజిక వెబ్సైట్లలో ఆమెకు పెద్ద ఎత్తున సానుభూతితో పాటు అభినందలు తెలపటం విశేషం.
సరిగ్గా ప్రకాష్‌రాజ్‌కు కూడా ఇలాంటి అనుభవమే ఇంతకుముందు ఎదురైంది. దాని గురించి ఆయన ట్విట్టర్లో కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రమాదం జరిగిన సమయంలో ప్రమాదం కన్నా ఘటనా స్థలంలో జరిగిన సంఘటనలు మరింత బాధించాయి. ప్రమాదాన్ని పట్టించుకోకుండా కొందరు యువకులు తమ సెల్ఫోన్లతో ఫొటోలు తీసుకోవడంలో బిజీగా కనిపించారు. ఆ పరిస్థితి చూసి సిగ్గుతో తలవంచుకున్నాను. నా ప్రాణం మీద భయం కన్నా మానవత్వం లేకుండా ప్రవర్తించే అలాంటి మనుషులను చూసి భయమేసింది’ అంటూ ట్వీట్ చేశారు.