ఉల్లి..పేలింది
పెరుగుతున్న ధర
వ్యాపారుల దోపిడీ వినియోగదారులు విలవిల
సమీక్షలతో సరిపెడుతున్న సర్కార్
నిర్లక్ష్యం నీడలో మార్కెటింగ్ శాఖ
సిటీబ్యూరో: ఉల్లి ధర మళ్లీ పేలుతోంది. సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకుంది. నగర మార్కెట్లో రోజుకో రకంగా ధర పలుకుతూ గృహిణులకు వణుకు పుట్టిస్తోంది. ధరలను కిందకు దించాల్సిన యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. ఆంధ్రాలో ఉల్లి కొరత కారణంగా కర్నూలు నుంచి హైదరాబాద్‌కు సరుకు సరఫరా నిలిపేశారు. కర్ణాటక, మహారాష్ట్రల్లో కూడా ఉల్లికి మంచి డిమాండ్ ఉంటోంది. అక్కడి వ్యాపారులు స్వల్పంగానే సరఫరా చేస్తుండటంతో నగరంలో కొరత ఎదురైంది. ధరలు నియంత్రించాల్సిన మార్కెటింగ్ శాఖ పైపై చర్యలతో కాలం వెళ్లబుచ్చుతోంది. అధికారులను అప్రమత్తం చేసి పరుగెత్తించాల్సిన సర్కార్ సమీక్షలతో సరిపెడుతోంది. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు ఇష్టారీతిన ధరలు నిర్ణయిస్తూ దోపిడీకి పాల్పడుతుండటంతో వినియోగదారులు విలవిల్లాడుతున్నారు. కొందరు బడా వ్యాపారులుఉల్లిని గోదాముల్లో దాచేసి... కృత్రిమ కొరతను సృష్టిస్తూ ధరలు పెంచేస్తున్నారన్న ఆరోపణలు హోరెత్తుతున్నాయి. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్ ధరలకు... రిటైల్ ధరలకు ఏమాత్రం పొంతన లేదు. రిటైల్ వ్యాపారులు రెట్టింపు ధరలు వసూలు చేస్తూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు.
డిమాండ్...సరఫరాల మధ్య
మలక్‌పేటలోని మహబూబ్ మాన్షన్ హోల్‌సేల్ మార్కెట్‌కు సోమవారం 50 కిలోల వంతున ఉండే 31వేల బ్యాగ్‌ల ఉల్లి దిగుమతైంది. మంగళవారం 21 వేలు, బుధవారం 18 వేల బ్యాగ్‌లు మాత్రమే వచ్చాయి. రెండు రోజుల వ్యవధిలోనే 12 వేల బ్యాగ్‌లు అంటే... 6 వేల క్వింటాళ్ల కొరత కనిపిస్తోంది. డిమాండ్-సరఫరాల మధ్య అంతరం ప్రభావం దరలపై పడుతోంది. హోల్‌సేల్ మార్కెట్లో బుధవారం గ్రేడ్-1 రకం ఉల్లి క్వింటాల్ కనీస మద్దతు ధర రూ.2800, గ్రేడ్-2 రకం రూ. 1600 పలికింది. ఈ ప్రకారం చూస్తే గ్రేడ్-1 ఉల్లి కేజీ రూ.28, గ్రేడ్-2 ఉల్లి కిలో ధర రూ.16గా హోల్‌సేల్ మార్కెట్లో అధికారికంగా నిర్ణయమైంది. ఇదే సరుకు రవాణా, హమాలీ, డ్యా మేజీ, లాభం వంటివి కలిపి రిటైల్ వ్యాపారులు కిలో రూ.40-45 చొప్పున వసూలు చేస్తున్నారు.
దోపిడీ ఇలా...
కిరాణా వ్యాపారులు, మాల్స్‌లో బెస్ట్ క్వాలిటీ పేరుతో గ్రేడ్-1 ఉల్లిని కేజీ రూ.40-45కు విక్రయిస్తున్నారు. కొందరు గ్రేడ్-2 ఉల్లినే చాటుగా గ్రేడింగ్ చేసి కేజీ రూ.40-45 వంతున అమ్ముతూ సొమ్ము చేసుకొంటున్నారు. వాస్తవానికి గ్రేడ్-1 రకం ఉల్లి స్వల్పంగానే మార్కెట్‌కు వస్తోంది. దీన్ని పెద్దపెద్ద హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల వారు నేరుగా కొని తీసుకెళుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో విక్రయించేదంతా గ్రేడ్-2 రక మే. తామేమీ తక్కువ కాదన్నట్టు రైతుబజార్లలోనూ కేజీ రూ.32 వంతున విక్రయిస్తున్నారు. నిజానికి హోల్‌సేల్ మార్కెట్ ధరకు రూ.3 అదనంగా వేసి రైతుబజార్లలో విక్రయిస్తారు. గ్రేడ్-2 ఉల్లి హోల్‌సేల్ మార్కెట్లో కనీస మద్దతు ధర క్వింటాలు రూ.1600 పలుకగా, రైతుబజార్లలో మాత్రం కేజీ రూ.30కు అమ్ముతుండటం గమనార్హం. ప్రజల నుంచి తీవ్రమైన నిరసన వ్యక్తమైనప్పుడు హడావుడి చేసి... తాత్కాలిక చర్యలతో సరిపెట్టేస్తుండటం మార్కెటింగ్ శాఖకు పరిపాటిగా మారిం ది. నగరంలో ఉల్లిని పెద్దమొత్తంలో నిల్వ చేసి ధరలు పెరిగిన సందర్భాల్లో మార్కెట్లోకి విడుదల చేయడం ద్వారా నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. మార్కెటింగ్ శాఖ అధికారులు ఇంతవరకు ఈ దిశగా చర్యలు తీసుకొన్న దాఖలాలు లేవు. రానున్న రోజుల్లో ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరచి అక్రమ నిల్వలపై అధికారులు దాడులు నిర్వహించి... చర్యలు తీసుకుంటే ఉల్లి ధరలకు కళ్లెం పడే అవకాశం ఉంది.