Merlin
-
తినడానికి తిండిలేక,చెన్నై రోడ్లపై భిక్షాటన..ఇన్‌స్టా వీడియోతో పాపులారిటీ
కూటికోసం కోటివిద్యలు అంటారు. ఈ విద్యే... ఎవరూ చూసేవారు లేక అనాథలా మారి, పదిమంది దగ్గర యాచిస్తూ కడుపు నింపుకొంటోన్న మెర్లిన్‌కు భోజన, వసతి సదుపాయాలు కల్పించి ఆదుకుంటోంది. ఎంతోమందికి మెర్లిన్ నేర్పిన విద్యాబుద్ధులే 81 ఏళ్ల వయసులో నిస్సహాయస్థితిలో ఉన్న ఆమెని ఆదుకుంటూ... అండగా నిలబడ్డాయి. బర్మాకు చెందిన మెర్లిన్ భారతీయ వ్యక్తిని పెళ్లిచేసుకుని చెన్నైలో స్థిరపడిపోయింది. ఇంగ్లీష్, లెక్కలు, తమిళం బోధిస్తూ, భర్తతో సంతోషంగా ఉండేది. సంవత్సరాలు గడిచే కొద్దీ తనవారిని ఒక్కొక్కరిగా పోగొట్టుకుంటూ ఒంటరిదైపోయింది. తినడానికి తిండిలేక, ఉండడానికి చోటులేక ఫుట్‌పాతే అన్నీ అయ్యి బతుకుతోంది. చెన్నై రోడ్లమీద తిరుగుతూ భిక్షమెత్తుకుని పొట్టనింపుకుంటోంది. దుస్తులు కొనివ్వండి బాబూ... ఒకరోజు ‘ఏబ్రోకాలేజ్కిడ్’అనే ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా సోషల్ సర్వీస్ చేస్తోన్న మొహమ్మద్ ఆషిక్ కంటపడింది మెర్లిన్. ఆమెను చూడగానే ఆమె మొదటినుంచి యాచకవృత్తిలో ఉన్న ఆమె కాదని గ్రహించాడు ఆషిక్. వెంటనే ‘‘ఎక్కడినుంచి వచ్చావు అమ్మా? నీకు ఎవరూ లేరా? వయసులో ఉన్నప్పుడు ఏం చేసేదానివి...’’ వంటి ప్రశ్నలు వేస్తూ మెర్లిన్ గురించిన వివరాలు తెలుసుకున్నాడు ఆషిక్. ‘‘భిక్షం అడిగి కడుపు నింపుకుంటున్నాను. కొన్ని రోజులు ఆహారం దొరుకుతుంది. మరికొన్ని రోజులు ఏమీ దొరకదు... నీళ్లు తాగి పడుకుంటాను. దేవుడు ఎంతవరకు ఇస్తే అంతే బాబు’’ అని మెర్లిన్ చెప్పింది. ‘‘నీకు ఏం కావాలమ్మా?’’ అని ఆషిక్ అడిగినప్పుడు...‘‘నా దుస్తులు చిరిగిపోయాయి. వీలయితే అవి కొనివ్వు బాబు... అది చాలు’’ అంది. యాచించ కూడదనీ... మెర్లిన్ పరిస్థితి చూసి చలించిపోయిన ఆషిక్ మెర్లిన్‌కు చీర కొనిచ్చాడు. తరువాత...‘‘అమ్మ నువ్వు ఇంగ్లీష్ క్లాసులు చెప్పు. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తాను. ఒక్కో వీడియోకు డబ్బులు ఇస్తాను అని చెప్పాడు’’. మెర్లిన్ ఇంగ్లీష్ క్లాసులు చెప్పడానికి ఒప్పుకోవడంతో ఆమె చెప్పే పాఠాలు వీడియోలు తీసి ‘ఇంగ్లీష్ విత్ మెర్లిన్’ పేరుమీద ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ చేసి పోస్టు చేస్తున్నాడు. ఒక్కో వీడియోకు డబ్బులు ఇస్తూ మెర్లిన్ ఎవరి దగ్గరా చేయి చాచకుండా... తన కష్టార్జితంతో బతికేలా ఏర్పాట్లుచేశాడు ఆషిక్. తన విద్యార్థులసాయంతో... ఆషిక్ పోస్టు చేసిన మెర్లిన్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. వాటిని చూసిన వారిలో కొంతమంది మెర్లిన్ దగ్గర చదువుకున్న విద్యార్థులు ఉన్నారు. తమ టీచర్ పరిస్థితి ఇంత దారుణంగా ఉందా అని బాధపడుతూ మెర్లిన్‌ను వెతుక్కుంటూ వచ్చారు. దగ్గర కూర్చుని, ఫలానా వాళ్లమని పరిచయం చేసుకుని, అప్పడు ఇలా చేశాం, అలా చేశాం, మీరు ఇలా ఉండేవారంటూ మాట్లాడి ఆమెలో ఉత్సాహం నింపారు. కొంతమంది ఆమెతో వీడియో కాల్ చేసి మాట్లాడారు. అంతా కలిసి మెర్లిన్‌కు కష్టం కలగకుండా ఉండేందుకు, నలుగురి మధ్యలో ఉండేలా వృద్ధాశ్రమంలో చేర్చారు. అక్కడ ఆమెకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మెర్లిన్ ఎనభై ఏళ్ల వయసులో ఇంగ్లీష్ క్లాసులు చెబుతూ ఐదు లక్షలకు పైగా ఫాలోవర్స్‌తో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. మనం చేసే మంచి ఎప్పటికైనా ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుందనడానికి మెర్లిన్ జీవితమే ఉదాహరణగా నిలుస్తోంది. View this post on Instagram A post shared by Merlin (@englishwithmerlin) View this post on Instagram A post shared by Merlin (@englishwithmerlin) -
మెర్లిన్..: మెరుపై మెరిసెన్
‘కాల్ చాట్‌జీపీటీ వేరెవర్ యూ ఆర్’ అంటూ రంగంలోకి దిగిన చాట్‌జీపీటీ యాప్ ‘మెర్లిన్’ మెరుపు వేగంతో విజయం సాధించింది. ‘పవర్ ఆఫ్ చాట్‌జీపీటీ’ని యూజర్‌కు దగ్గర చేసి, టైమ్ సేవ్ చేసే ‘మెర్లిన్’ సృష్టికర్తలు ప్రత్యూష్ రాయ్, సిద్ధార్థ సక్సెనా, సిరిసేందు సర్కార్లు మూకుమ్మడిగా చెప్పే మాట... ‘కొత్తగా ఆలోచించడం అనేది విజయానికి తొలి మెట్టు’ గ్లోబల్ కన్సల్టెన్సీ ‘బీసీజీ’లో పనిచేస్తున్న సమయంలో ఎన్నో విలువైన అనుభవాలను మూటగట్టుకున్నాడు ప్రత్యూష్రాయ్. ఆ అనుభవాలను విశ్లేషించుకునే క్రమంలో తనకు కొత్తగా ఏదైనా చేయాలనిపించేది. ఐఐటీ–కాన్పూర్‌లో సివిల్ ఇంజనీరింగ్ చేసిన ప్రత్యూష్ రాయ్ తన ఇద్దరు స్నేహితులు సిద్ధార్థ సక్సెనా, సిరిసేందు సర్కార్లతో మాట్లాడాడు. ‘కొత్తగా అనిపించే అర్థవంతమైన పని ఏదైనా చేద్దాం’ అనుకున్నారు వాళ్లు. అలా వారి మేధోమథనం నుంచి పుట్టిన అంకురమే...మెర్లిన్. చాట్‌జీపీటీ యాప్ ‘మెర్లిన్’ మెరుపు వేగంతో విజయం సాధించింది. ప్రారంభమైన ఆరునెలల్లోనే ఈ యాప్‌ను వందలాది మంది ఇన్స్టాల్ చేసుకున్నారు. టెక్ కంపెనీ ‘ఫోయర్’లో విలీనం అయిన తరువాత యూఎస్, తూర్పు ఆసియా, యూరప్‌లలో ‘మెర్లిన్’కు మంచి మార్కెట్ ఏర్పడింది. ‘ఎలాంటి అయోమయాలకు, సంక్లిష్టతలకు తావు లేకుండా బ్రౌజర్లో భాగమయ్యే సింపుల్ ప్రాడక్ట్ ఇది. యూట్యూబ్, జీమెయిల్, ట్విట్టర్, లింక్డ్ఇన్... మొదలైన వాటికి సంబంధించి క్లిష్టమైన సమస్యల పరిష్కారం విషయంలో డైలీ యాక్టివ్ యూజర్లకు ఉపయోగపడుతుంది. మార్కెటర్స్, రిక్రూటర్స్‌కు ఒక వాక్యం ట్వీట్ నుంచి ఎన్నో పదాల ఇమెయిల్ వరకు ఎన్నో పనుల్లో టైమ్ వృథా కాకుండా చూస్తుంది. ఇది సింపుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్. బటన్‌ను ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు చాట్‌జీపీటీ మనల్ని వెదుక్కుంటూ వస్తుంది’ అని ‘మెర్లిన్’ గురించి చెబుతున్నాడు ప్రత్యూష్ రాయ్. యూట్యూబ్‌కు సంబంధించి ‘మెర్లిన్’ను ‘యూట్యూబ్ సమ్మరైజర్’గా ఉపయోగించకుంటున్నారు యూజర్లు. ఒక యూట్యూబ్ వీడియోను పూర్తిగా చూడనవసరం లేకుండానే దానిలోని ముఖ్యమైన సెగ్మెంట్ల గురించి ‘మెర్లిన్’ చెబుతుంది. పర్సనలైజ్డ్ ప్రాంప్ట్స్ విషయంలోనూ ‘మెర్లిన్’ ఉపయోగపడుతుంది. మన రైటింగ్ స్టైల్‌ను కాప్చర్ చేస్తుంది. ‘నిజానికి మా దృష్టి డెవలపర్స్‌పై ఉండేది. అయితే మా ప్రాడక్ట్‌ను యూజర్లు ఆసక్తికరమైన పద్ధతుల్లో ఉపయోగించుకుంటున్నారు’ అంటున్నాడు ప్రత్యూష్ రాయ్. నేర్చుకున్న పాఠాలు ఎప్పుడూ వృథా పోవు. ‘బీసీజీ’లో రాయ్ అనుభవంతో నేర్చుకున్న ఎన్నో పాఠాలు ‘మెర్లిన్’ ప్రయాణంలో ఉపయోగపడ్డాయి. రాయ్ మాటల్లో చెప్పాలంటే ఆ అనుభవ పాఠాలు తన ప్రపంచాన్నే మార్చేసి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాయి. ‘మెర్లిన్ సక్సెస్‌కు కారణం దానిపై యూజర్లకు గురి కుదరడమే’ అంటున్నాడు ‘ఫోయర్–మెర్లిన్’ ఫస్ట్ ఇన్వెస్టర్, బెటర్ క్యాపిటల్ సీయివో వైభవ్. ‘హమ్మయ్య...సక్సెస్ అయ్యాం’ అని సేద తీరడం లేదు ‘ఫోయర్–మెర్లిన్’ బృందం. ఇప్పుడు వారి దృష్టి సిబ్బందిని పెంచుకోవడం, మెర్లిన్లోకి రకరకాల సబ్ ఫీచర్స్‌ని తీసుకురావడంపై ఉంది. ‘మెర్లిన్’ అనేది ఒక రకమైన డేగ. దానిలోని సునిశితమై దృష్టిని తమ ‘మెర్లిన్’లోకి తీసుకురావాలనుకుంటోంది, ఫినిష్ ఎనీ టాస్క్ అని ధైర్యం ఇవ్వాలనుకుంటోంది బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఫోయర్–మెర్లిన్ బృందం. ‘హమ్మయ్య... సక్సెస్ అయ్యాం’ అని సేద తీరడం లేదు ‘ఫోయర్–మెర్లిన్’ బృందం. ఇప్పుడు వారి దృష్టి సిబ్బందిని పెంచుకోవడం, మెర్లిన్లోకి రకరకాల సబ్ ఫీచర్స్‌ని తీసుకురావడంపై ఉంది. -
నేను గానీ మ్యావ్ గానీ అన్నానంటే..!
ఏంటలా చూస్తున్నారు? స్మార్ట్‌ఫోన్‌లో మీటర్ రీడింగ్ ఎలా పెరుగుతోందో కనిపిస్తోంది కదా.. ఇదంతా నా కూతల మహిమే! నా కూతలకు మెచ్చి గిన్నిస్ బుక్ వారు కూడా రికార్డు కట్టబెట్టేశారు. కూతల్లో ఏముంటుంది? అన్ని పిల్లులూ మ్యావ్మనే కదా అంటాయి అనుకుంటున్నారా? నా మ్యావ్ సౌండ్ వింటే మీ గూబలు గుయ్యిమంటాయి! మామూలు పిల్లులు 25 డెసిబుల్స్‌లోనే అరుస్తాయి. నేను అరిస్తే 67.8 డెసిబుల్స్ శబ్దంతో మీ చెవులు మోగిపోతాయి. గతంలో ఓ పిల్లి 67.68 డెసిబుల్స్‌తో అరిచి రికార్డును కొట్టేసింది. నేను దాని రికార్డును బద్దలుకొట్టేశాను. అన్నట్టూ.. పరిచయం చేసుకోలేదు కదూ.. నా పేరు మెర్లిన్. వయసు 13 ఏళ్లు. ఇంగ్లాండ్‌లోని డేవన్షైర్కు చెందిన ట్రేసీ వెస్ట్‌వుడ్ నా యజమానురాలు. అయితే, టూనా ఫుడ్ బాగా లాగించేయడం వల్లే నాకిలా అరిచే శక్తి వచ్చిందని, అదే రికార్డు తెప్పించిందనీ కొందరు చెబుతున్నారు.