నేను గానీ మ్యావ్ గానీ అన్నానంటే..!
ఏంటలా చూస్తున్నారు? స్మార్ట్‌ఫోన్‌లో మీటర్ రీడింగ్ ఎలా పెరుగుతోందో కనిపిస్తోంది కదా.. ఇదంతా నా కూతల మహిమే! నా కూతలకు మెచ్చి గిన్నిస్ బుక్ వారు కూడా రికార్డు కట్టబెట్టేశారు. కూతల్లో ఏముంటుంది? అన్ని పిల్లులూ మ్యావ్‌మనే కదా అంటాయి అనుకుంటున్నారా? నా మ్యావ్ సౌండ్ వింటే మీ గూబలు గుయ్యిమంటాయి! మామూలు పిల్లులు 25 డెసిబుల్స్‌లోనే అరుస్తాయి. నేను అరిస్తే 67.8 డెసిబుల్స్ శబ్దంతో మీ చెవులు మోగిపోతాయి.
గతంలో ఓ పిల్లి 67.68 డెసిబుల్స్‌తో అరిచి రికార్డును కొట్టేసింది. నేను దాని రికార్డును బద్దలుకొట్టేశాను. అన్నట్టూ.. పరిచయం చేసుకోలేదు కదూ.. నా పేరు మెర్లిన్. వయసు 13 ఏళ్లు. ఇంగ్లాండ్‌లోని డేవన్‌షైర్‌కు చెందిన ట్రేసీ వెస్ట్‌వుడ్ నా యజమానురాలు. అయితే, టూనా ఫుడ్ బాగా లాగించేయడం వల్లే నాకిలా అరిచే శక్తి వచ్చిందని, అదే రికార్డు తెప్పించిందనీ కొందరు చెబుతున్నారు.