MGB Mall
-
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న కారు
నెల్లూరు(మినీబైపాస్) : ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా, మరొకరు స్వల్పంగా గాయపడిన ఘటన ఎంజీబీ మాల్లో చోటు చేసుకుంది. వివరాలు.. బారకాస్ సెంటర్లో నివాసం ఉంటున్న రక్షిత్ తన కుమార్తెలు డోయల్(4), రేవా(3)తో ఎంజీబీ మాల్‌కు వచ్చారు. ఈ క్రమంలో మెయిన్ గేట్‌కు చేరుకునేసరికి వెనుక నుంచి తమిళనాడు రిజిస్ట్రేషన్ గల స్విఫ్ట్ కారు మితిమీరిన వేగంతో వస్తూ ఢీకొంది. దీంతో చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన వారిని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కారు వేగానికి నిలిపి ఉన్న పలు వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబీకులు ఆస్పత్రికి భారీగా చేరుకున్నారు. కారులో ఐదుగురు ఉన్నారని, డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి పరారయ్యాడని, అతను మద్యం సేవించి ఉన్నాడని బాలికల తండ్రి తెలిపాడు. కాగా మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లి ఫొటోలు తీస్తుండగా, కారులోని ఓ మహిళ దుర్భషలాడి దాడికి యత్నించారు. -
ఎంజీబీ మాల్ వద్ద కారు బీభత్సం
-
నేడు ‘ఇండిపెండెన్స్ రైడ్’
నెల్లూరు(బృందావనం): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు బైకర్ హుడ్ ఆధ్వర్యంలో సోమవారం ఇండిపెండెన్స్ రైడ్ నిర్వహిస్తున్నట్లు ఎంజీబీ ఫెలిసిటీ మాల్ జాయింట్ డైరెక్టర్ ఎంజీ గోపాలకృష్ణ తెలిపారు. నగరంలోని ఎంజీబీ ఫెలిసిటీమాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మట్లాడారు. యువతకు బైక్ రైడింగ్, ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు హార్లీ డేవిడ్సన్, ట్రైంప్, బెన్నిలీ, తదితర ప్రఖ్యాత కంపెనీలకు చెందిన మోటారుసైకిళ్లతో రైడ్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. బైకర్హుడ్ సభ్యుడు ఎంజీ రాఘవ మాట్లాడుతు ఎంజీబీ మాల్ నుంచి సోమవారం ఉదయం 9.30గంటలకు 11 మోటారుసైకిళ్లతో రైడ్ ప్రారంభమవుతుందని తెలిపారు. గాంధీబొమ్మ, ఆత్మకూరు బస్టాండ్, మినీబైపాస్‌రోడ్డు, వేదాయపాళెం మీదుగా ఎంబీజీ మాల్‌కు చేరుకుంటుందన్నారు. ఈ సమావేశంలో బైకర్హుడ్ సభ్యులు కస్తూరితిలక్, శివకుమార్,మాల్ జనరల్ మేనేజర్ రవికిరణ్, తదితరులు పాల్గొన్నారు. -
అలరించిన ప్లాష్‌మాబ్
నెల్లూరు(అర్బన్): బ్రెస్ట్ క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన(ప్లాష్‌మాబ్) ఆకట్టుకుంది. తొలిసారిగా శనివారం నెల్లూరులోని ఎంబీజీ మాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అందరూ ఆసక్తిగా తిలకించారు. అందరినీ ఆకర్షించేలా పింక్ టీషర్టులు ధరించిన యువతులు నృత్యాలు చేస్తూ అవగాహన కల్పించారు. నారాయణ మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలల సహకారంతో భార్గవ హెల్త్‌ప్లస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వ్యాధిపై అవగాహన ఏర్పరచుకోవడం ద్వారా తగు వైద్యం పొంది బ్రెస్ట్ క్యాన్సర్‌ను పూర్తిగా నివారించవచ్చని రెడ్‌క్రాస్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అధికారి డాక్టర్ లక్ష్మి పేర్కొన్నారు. తన సోదరి ఇదే వ్యాధితో బాధపడుతూ మృతిచెందిందని, మరొకరు అలాంటి బాధ పడకూడదనే ఉద్దేశంతో కొన్నేళ్లుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని భార్గవ హెల్త్‌ప్లస్ సీఈఓ ఎ.చంద్రశేఖరరెడ్డి చెప్పారు. కార్యక్రమంలో నారాయణ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరామ్‌సతీష్, కిమ్స్(బొల్లినేని) ఈడీ గిరినాయుడు, ఎంజీ బ్రదర్స్ ఎండీ గంగాధర్, డీజిఎం రవికుమార్, శాఖవరపు వేణుగోపాల్,దేవరకొండ శ్రీనివాసులు, భాస్కర్‌నాయుడు, మహావీర్‌జైన్ పాల్గొన్నారు. -
30న ఫ్లాష్‌మాబ్
నెల్లూరు(అర్బన్): బ్రెస్ట్ కేన్సర్‌పై అవగాహన కల్పించేందుకు గానూ ఈ నెల 30వ తేదీన ఎంజీబీ మాల్లో ఫ్లాష్ మాబ్‌ను నిర్వహించనున్నట్లు భార్గవ్ హెల్త్‌ప్లస్ అధినేత చంద్రశేఖర్‌రెడ్డి, నారాయణ ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ వినయ్‌కుమార్ తెలిపారు. ఫ్లాష్ మాబ్‌కు సంబంధించిన పోస్టర్లను నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. అక్టోబర్‌లో పింక్ రిబ్బన్ వాక్‌ను నిర్వహించనున్నామని చెప్పారు. 25 వేల మందితో నిర్వహించేందుకు భార్గవ్ హెల్త్ ప్లస్ ప్రణాళికను సిద్ధం చేస్తోందని చెప్పారు. ఎంజీబీ మాల్ డీజీఎం రవికిరణ్, నీరూస్ ఫ్రాంచైజ్ యజమాని నిఖిల్‌రెడ్డి, ఈవీఎస్ నాయుడు, భాస్కర్‌నాయుడు, కళాశాల ప్రిన్సిపల్ జగదీశ్వరరెడ్డి పాల్గొన్నారు.