M.G.Gopal
-
ఆరుగురు జిల్లా రిజిస్ట్రార్లకు పోస్టింగ్‌లు
ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ శాఖ సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల శాఖలో ఆరుగురు జిల్లా రిజిస్ట్రార్లకు ఎట్టకేలకు పోస్టింగ్‌లు లభించాయి. ఇందులో ముగ్గురిని మార్కెట్ వాల్యూ అండ్ ఆడిట్ డీఆర్లు గానూ, మరో ముగ్గురిని సాధారణ జిల్లా రిజిస్ట్రార్లుగానూ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రెవెన్యూశాఖ(రిజిస్ట్రేషన్లు) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.జి.గోపాల్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. వాస్తవానికి ఈ శాఖలో అర్హులైన ఆరుగురు గ్రేడ్–1 సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతులు కల్పిస్తూ డిపార్ట్మెంటల్ ప్రమోషన్స్ కమిటీ (డీపీసీ) గత ఆగస్టులోనే ప్రభుత్వానికి సిఫార్సులు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లా రిజిస్ట్రార్ పోస్టులు ఖాళీ గా ఉన్నప్పటికీ, గత 5 నెలలుగా ప్రభుత్వం పోస్టింగులను ఇవ్వకపో వడం పట్ల సబ్ రిజిస్ట్రార్ల సంఘాలు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పోస్టింగ్‌లు ఇవ్వడం పట్ల జిల్లా రిజిస్ట్రార్లు, తాజా పోస్టింగ్‌లతో కిందిస్థాయి సిబ్బంది పదోన్నతులకు మార్గం సుగమమైందని పలువురు సబ్ రిజిస్ట్రార్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా రిజిస్ట్రార్లకు పోస్టింగ్‌లు ఇలా.. డీఆర్ పేరు పోస్టింగ్ దినేశ్ దత్తార్ హైదరాబాద్ జిల్లా కె.వి.రమేశ్‌రెడ్డి సంగారెడ్డి అండ్ మెదక్ జిల్లాలు వి.రమేశ్ నిజామాబాద్ జిల్లా ఎం.రవీందర్ రంగారెడ్డి(మార్కెట్‌వాల్యూ అండ్ ఆడిట్) డి.వి.ప్రసాద్ మేడ్చల్–మల్కాజిగిరి(మార్కెట్ వాల్యూ అండ్ ఆడిట్) ఎం.ఆర్.ఎన్ .ఆచార్యులు హైదరాబాద్(మార్కెట్ వాల్యూ అండ్ ఆడిట్) -
‘మెట్రో’ మార్పులపై ముందడుగు
అలైన్మెంట్ మార్పులపై అధ్యయనానికి ప్రభుత్వం ఆదేశం రాష్ట్ర బడ్జెట్లో రూ.860 కోట్లు కోరిన ‘ఎల్అండ్టీ’ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు అలైన్మెంట్ మార్పు విషయంలో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం మౌనం వీడింది. అసెంబ్లీ, సుల్తాన్ బజార్, పాతబస్తీ ప్రాంతాల్లో అలైన్మెంట్ మార్పుపై సమగ్ర అధ్యయనం జరిపి నివేదిక సమర్పించాలని నిర్మాణ సంస్థ ‘హెచ్ఎంఆర్-ఎల్అండ్టీ’కి లేఖ రాసింది. అలైన్మెంట్ మార్పులపై సాధ్యాసాధ్యాల పరిశీలన, నిర్మాణ వ్యయంలో పెరుగుదల, ప్రాజెక్టు నిర్మాణంతో నష్టపోయే ప్రైవేటు ఆస్తులకు పరిహారం చెల్లింపు తదితర అంశాలపై అధ్యయనం జరిపి నివేదించాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఇటీవల నిర్మాణ సంస్థకు రాసిన లేఖలో పేర్కొంది. పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.జి.గోపాల్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. అలైన్‌మెంట్‌పై ఇది తుది నిర్ణయం కాదని, ప్రతిపాదిత మార్పులపై అధ్యయనం కోసమే లేఖ రాశామన్నారు. మరోవైపు మెట్రో రైలు ప్రాజెక్టు అవసరాల కోసం 2015-16కు సంబంధించిన రాష్ట్ర బడ్జెట్లో రూ.860 కోట్లు కేటాయించాలని ఎల్అండ్టీ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయంతోపాటు ప్రైవేటు ఆస్తులకు నష్టపరిహారం చెల్లింపు తదితర అవసరాల కోసం రుణ సహాయంగా రూ.850 కోట్లను, మెట్రో ప్రాజెక్టు రెండో దశపై అధ్యయనం కోసం రూ.10 కోట్లను కేటాయించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తలపెట్టిన ‘సమగ్ర రవాణా వ్యవస్థ’(సీటీఎస్)-2021 కార్యక్రమం కింద మెట్రో ప్రాజెక్టును నగర శివారు ప్రాంతాలకు సైతం విస్తరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో అధ్యయనం కోసం నిధులు కావాలని కోరింది. ఎన్నో మలుపులు తిరిగి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఈ ప్రాజెక్టు అలైన్మెంట్ మార్పుపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత చర్చనీయాంశమైంది. అధికార పగ్గాలు చేపట్టిన తొలినాళ్లలోనే సీఎం కేసీఆర్ .. హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడాల పరిరక్షణ కోసం మెట్రో రైలు అలైన్‌మెంట్‌ను మార్చితీరుతామని ప్రకటించడంతో ప్రారంభమైన వివాదం ఎన్నో మలుపులు తిరిగింది. ప్రభుత్వం మార్పులు సూచించిన మూడు మార్గాల్లో నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ వెంటనే పనులను నిలిపేసి నెలలు గడిచినా ప్రభుత్వం ఈ అంశంపై నిర్మాణ సంస్థకు అధికారిక ఆదేశాలు జారీ చేయలేదు. అయితే, మెట్రో మార్పుపై సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు పునరుద్ఘాటిస్తూ వచ్చారు. ఈ అంశంపై పత్రికల్లో వరుసగా ప్రతికూల కథనాలు రావడం.. అధికారికంగా ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంపై ఆందోళనకు గురైన ‘ఎల్అండ్టీ’ యాజమాన్యం ఒకానొక దశలో ప్రాజెక్టు నుంచి వైదొలిగేందుకు సిద్ధమైంది. పనుల్లో వివిధ రకాల అవరోధాలను సాకుగా చూపి ప్రాజెక్టును స్వాధీనం(టేకోవర్) చేసుకోవాలని ప్రభుత్వానికి సూచిస్తూ లేఖ రాయడం..ఈ లేఖను కావాలని ఓ వర్గం మీడియాకు లీక్ చేయడంపై అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఎల్ఎండ్టీ సంస్థ ప్రతినిధులు సీఎం కేసీఆర్‌ను కలిసి వివరణ ఇచ్చుకోవడంతో ఈ వివాదం సద్దుమణిగింది. పాతబస్తీపై తొలగని పేచీ.. పాతబస్తీలో అలైన్మెంట్ మార్పుపై రాజకీయ పార్టీల మధ్య నెలకొన్న వివాదం ఇంకా పరిష్కారం కాలేదు. అసెంబ్లీ, సుల్తాన్‌బజార్, పాతబస్తీలలో ప్రాజెక్టు అలైన్‌మెంటు మార్పు అంశంపై గత డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ అఖిలపక్ష నేతలతో సమావేశమై అభిప్రాయాలు స్వీకరించారు. అసెంబ్లీ, సుల్తాన్‌బజార్ ప్రాంతాల్లో మార్పులపై అన్ని పార్టీల మధ్య ఏకభిప్రాయం కుదిరినా పాతబస్తీలో అలైన్మెంట్ మార్పుపై ఎంఐఎం పట్టుదల చూపగా, బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశంపై మెజారిటీ ప్రజల కోరిక మేరకు నిర్ణయం తీసుకుంటామని ఈ సమావేశంలో కేసీఆర్ హామీ ఇచ్చారు. తప్పకుండా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తామన్నారు. ఆ తర్వాత ఈ వివాదం రాజకీయ పార్టీల మధ్య అలాగే వుండిపోయినా.. ప్రభుత్వం మాత్రం మార్పు దిశగా అడుగులు వేసింది. -
శ్రీవారి అనుగ్రహంతో వచ్చా.. ఆజ్ఞతో వెళ్తా
- ‘సాక్షి’తో టీటీడీ ఈవో ఎంజీ గోపాల్ వెల్లడి సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘శ్రీవారి అనుగ్రహంతో వచ్చా.. ఆజ్ఞతో వెళ్తా’నని టీటీ డీ ఈవో ఎంజీ గోపాల్ స్పష్టీకరించారు. టీటీడీ ఈవో పోస్టు పొందేందుకు తానెవరి సహాయం కోరలేదని.. కొనసాగేం దుకూ ఎవరి సహాకరం అడగలేదని స్పష్టీకరించారు. గురువారం తిరుపతిలో తన క్యాంప్ ఆఫీసులో ఈవో ఎంజీ గోపాల్ ‘సాక్షి’తో మాట్లాడారు. నిజాయితీతో నిబద్ధతతో పనిచేసే తనను శ్రీవేంకటేశ్వరస్వామే టీటీడీ ఈవో పదవి ఇచ్చేలా చేశారని చెప్పారు. శ్రీవారి అనుగ్రహంతో టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి భక్తులకు స్వామివారిని మరింత దగ్గర చేసేందుకు ప్రయత్నించానన్నారు. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 4 వరకూ నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తాను ఆంధ్రప్రదేశ్‌లో జన్మించినా.. తెలంగాణలో పెరిగానన్నారు. ఐఏఎస్‌ల విభజనలో కేంద్ర ప్రభుత్వం తనను తెలంగాణకు కేటాయించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తాను వ్యహరిస్తానని స్పష్టీకరించారు. టీటీడీ ఈవోగా కొనసాగేందుకు తానెవరి సహాయం కోరలేదన్నారు. శ్రీవారి ఆజ్ఞతో పనిచేస్తానని స్పష్టీకరించారు. -
ఆఖరి పోరాటం
బ్రహ్మోత్సవాల వరకు ఉంచండి : ఎంజీ గోపాల్ ఏపీ కేడర్‌కే కేటాయించండి : సిద్ధార్థ్‌జైన్ చంద్రబాబుకు ఐఏఎస్‌ల వినతి చేతులెత్తేసిన ముఖ్యమంత్రి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎంజీ.గోపాల్, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ఆఖరి పోరాటానికి సిద్ధమయ్యారు. ఐఏఎస్‌ల విభజనలో ఎంజీ.గోపాల్, సిద్ధార్థ్ జైన్‌ను ప్రత్యూష్ కమిటీ తెలంగాణకు కేటాయించింది. ఈ నేపథ్యంలో తనను బ్రహ్మోత్సవాలు ముగిసేవరకు టీటీడీ ఈవోగా కొనసాగించాలని ఎంజీ.గోపాల్.. తనను ఆంధ్ర కేడర్‌కే కేటాయించేలా చేసి, జిల్లా కలెక్టర్‌గా కొనసాగించాలని సిద్ధార్థ్‌జైన్ సీఎం చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: అఖిల భారత సర్వీసు అధికారుల విభజనకు కేంద్రం ప్రత్యూష్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా భద్రాచలానికి చెందిన ఎంజీ.గోపాల్ 1983 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. స్థానికతను ప్రాతిపదికగా తీసుకున్న ప్రత్యూష్ కమిటీ ఎంజీ.గోపాల్‌ను తెలంగాణకు కేటాయించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సిద్ధార్థ్‌జైన్ 2001 ఐఏఎస్ బ్యాచ్ అధికారి. సరిగ్గా 43 రోజుల కిత్రం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. సిద్ధార్థ్‌జైన్‌ను ప్రత్యూష్ కమిటీ తెలంగాణకు కేటాయించింది. ఐఏఎస్‌ల విభజనపై ఈనెల 29 వరకు కమిటీ అభ్యంతరాలను స్వీకరిస్తుంది. సెప్టెంబరు 2న తుది జాబితాను ప్రకటించనుంది. నాలుగు రోజుల క్రితమే ఐఏఎస్‌ల విభజన ప్రతిపాదనలు బయటకు పొక్కడంతో ఎంజీ.గోపాల్, సిద్ధార్థ్‌జైన్ అప్రమత్తమయ్యారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 26న ప్రారంభమై అక్టోబరు 4వ తేదీ ముగుస్తాయి. బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు టీటీడీ ఈవోగా కొనసాగించాలని ఎంజీ.గోపాల్ సీఎం చంద్రబాబును కోరారు. కానీ ఐఏఎస్‌ల విభజన పూర్తయిన నేపథ్యంలో తానేమీ చేయలేనని సీఎం చేతులెత్తేయడంతో ఎంజీ.గోపాల్ డీలాపడ్డారు. తెలంగాణకు కేటాయించిన నేపథ్యంలో తనకు స్థానభ్రంశం తప్పదనే నిర్ణయానికి వచ్చారు. ప్రత్యూష్ కమిటీ ఈనెల 29 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్న నేపథ్యంలో తనను ఆంధ్రకే కేటాయించాలని సిద్ధార్థ్‌జైన్ ఇప్పటికే తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. తనను ఆంధ్రకే కేటాయించేలా చూడాలని సీఎం చంద్రబాబును ఆయన కోరినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. కానీ సిద్ధార్థ్‌జైన్ అభ్యంతరాన్ని ప్రత్యూష్ కమిటీ పరిగణనలోకి తీసుకునే అవకాశాలు తక్కువ అని అధికారవర్గాలు వెల్లడించాయి. సీఎం కార్యాలయం అధికారులను ఆంధ్ర కేడర్‌కు కేటాయించేలా ప్రత్యూష్ కమిటీపై ఒత్తిడి తెచ్చిన చంద్రబాబు అప్పట్లోనే సిద్ధార్థ్‌జైన్ అంశాన్ని కూడా తెరపైకి తెచ్చారు. కానీ సిద్ధార్థ్‌జైన్‌ను ఆంధ్రకు కేటాయించడానికి ప్రత్యూష్ కమిటీ అంగీకరించలేదన్నది ఐఏ ఎస్‌ల విభజనతో తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సీఎం చంద్రబాబు ఒత్తిడి.. సిద్దార్థ్‌జైన్ ప్రతిపాదనను ప్రత్యూష్ కమిటీ తోసిపుచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయనే అభిప్రాయం అధికారవర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది. ఏదిఏమైనా సెప్టెంబరు మొదటి వారంలో టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్‌కు స్థానభ్రంశం తప్పదని అధికారవర్గాలు స్పష్టీకరిస్తున్నాయి. -
మరింత నాణ్యతతో శ్రీవారి లడ్డూ
శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో నాణ్యత మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ కార్యనిర్వహణ అధికారి ఎం.జి.గోపాల్ గురువారం తిరుమలలో వెల్లడించారు. లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి నాణ్యతను మరింత పెంచుతామన్నారు. బాలాజీ డైరీ నుంచి నెయ్యి కొనుగోలు చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టీటీడీ టెండర్ విధానంలో దశలవారిగా పారదర్శకతను అమలు చేస్తామన్నారు. అందుకోసం ఆ విధానంలో మార్పులు చేర్పులు చేపట్టేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్లు ఎం.జి.గోపాల్ వివరించారు. -
కాలుజారి కిందపడ్డ టీటీడీ ఈవో గోపాలన్ సతీమణి
తిరుపతి : తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం సేవ సందర్భంగా టీటీడీ ఈవో గోపాల్ సతీమణి జానకి గాయపడ్డారు. మంగళవారం తిరుమంజనం సేవలో ఈవో గోపాల్ దంపతులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జానకి అనుకోకుండా కాలుజారి కిందపడటంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు అమ్మవారు రథంపై తిరువీధుల్లో ఊరేగనున్నారు.