‘మెట్రో’ మార్పులపై ముందడుగు | 'Metro' step changes | Sakshi
Sakshi News home page

‘మెట్రో’ మార్పులపై ముందడుగు

Published Sun, Jan 25 2015 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 8:12 PM

‘మెట్రో’ మార్పులపై ముందడుగు

‘మెట్రో’ మార్పులపై ముందడుగు

  • అలైన్‌మెంట్ మార్పులపై అధ్యయనానికి ప్రభుత్వం ఆదేశం  
  • రాష్ట్ర బడ్జెట్‌లో రూ.860 కోట్లు కోరిన ‘ఎల్‌అండ్‌టీ’
  • సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు అలైన్‌మెంట్ మార్పు విషయంలో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం మౌనం వీడింది. అసెంబ్లీ, సుల్తాన్ బజార్, పాతబస్తీ ప్రాంతాల్లో అలైన్‌మెంట్ మార్పుపై సమగ్ర అధ్యయనం జరిపి నివేదిక సమర్పించాలని నిర్మాణ సంస్థ ‘హెచ్‌ఎంఆర్-ఎల్‌అండ్‌టీ’కి లేఖ రాసింది. అలైన్‌మెంట్ మార్పులపై సాధ్యాసాధ్యాల పరిశీలన, నిర్మాణ వ్యయంలో పెరుగుదల, ప్రాజెక్టు నిర్మాణంతో నష్టపోయే ప్రైవేటు ఆస్తులకు పరిహారం చెల్లింపు తదితర అంశాలపై అధ్యయనం జరిపి నివేదించాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఇటీవల నిర్మాణ సంస్థకు రాసిన లేఖలో పేర్కొంది.

    పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.జి.గోపాల్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. అలైన్‌మెంట్‌పై ఇది తుది నిర్ణయం కాదని, ప్రతిపాదిత మార్పులపై అధ్యయనం కోసమే లేఖ రాశామన్నారు. మరోవైపు మెట్రో రైలు ప్రాజెక్టు అవసరాల కోసం  2015-16కు సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌లో రూ.860 కోట్లు కేటాయించాలని ఎల్‌అండ్‌టీ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

    ప్రాజెక్టు నిర్మాణ వ్యయంతోపాటు ప్రైవేటు ఆస్తులకు నష్టపరిహారం చెల్లింపు తదితర అవసరాల కోసం రుణ సహాయంగా రూ.850 కోట్లను, మెట్రో ప్రాజెక్టు రెండో దశపై అధ్యయనం కోసం రూ.10 కోట్లను కేటాయించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తలపెట్టిన ‘సమగ్ర రవాణా వ్యవస్థ’(సీటీఎస్)-2021 కార్యక్రమం కింద మెట్రో ప్రాజెక్టును నగర శివారు ప్రాంతాలకు సైతం విస్తరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో అధ్యయనం కోసం నిధులు కావాలని కోరింది.
     
    ఎన్నో మలుపులు తిరిగి..

    తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఈ ప్రాజెక్టు అలైన్‌మెంట్ మార్పుపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత చర్చనీయాంశమైంది. అధికార పగ్గాలు చేపట్టిన తొలినాళ్లలోనే సీఎం కేసీఆర్ .. హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడాల పరిరక్షణ కోసం మెట్రో రైలు అలైన్‌మెంట్‌ను మార్చితీరుతామని ప్రకటించడంతో ప్రారంభమైన వివాదం ఎన్నో మలుపులు తిరిగింది. ప్రభుత్వం మార్పులు సూచించిన మూడు మార్గాల్లో నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ వెంటనే పనులను నిలిపేసి నెలలు గడిచినా ప్రభుత్వం ఈ అంశంపై నిర్మాణ సంస్థకు అధికారిక ఆదేశాలు జారీ చేయలేదు. అయితే, మెట్రో మార్పుపై సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు పునరుద్ఘాటిస్తూ వచ్చారు.

    ఈ అంశంపై పత్రికల్లో వరుసగా ప్రతికూల కథనాలు రావడం.. అధికారికంగా ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంపై ఆందోళనకు గురైన ‘ఎల్‌అండ్‌టీ’ యాజమాన్యం ఒకానొక దశలో ప్రాజెక్టు నుంచి వైదొలిగేందుకు సిద్ధమైంది. పనుల్లో వివిధ రకాల అవరోధాలను సాకుగా చూపి ప్రాజెక్టును స్వాధీనం(టేకోవర్) చేసుకోవాలని ప్రభుత్వానికి సూచిస్తూ లేఖ రాయడం..ఈ లేఖను కావాలని ఓ వర్గం మీడియాకు లీక్ చేయడంపై అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఎల్‌ఎండ్‌టీ సంస్థ ప్రతినిధులు సీఎం కేసీఆర్‌ను కలిసి వివరణ ఇచ్చుకోవడంతో ఈ వివాదం సద్దుమణిగింది.

    పాతబస్తీపై తొలగని పేచీ..

    పాతబస్తీలో అలైన్‌మెంట్ మార్పుపై రాజకీయ పార్టీల మధ్య నెలకొన్న వివాదం ఇంకా పరిష్కారం కాలేదు. అసెంబ్లీ, సుల్తాన్‌బజార్, పాతబస్తీలలో ప్రాజెక్టు అలైన్‌మెంటు మార్పు అంశంపై గత డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ అఖిలపక్ష నేతలతో సమావేశమై అభిప్రాయాలు స్వీకరించారు. అసెంబ్లీ, సుల్తాన్‌బజార్ ప్రాంతాల్లో మార్పులపై అన్ని పార్టీల మధ్య ఏకభిప్రాయం కుదిరినా పాతబస్తీలో అలైన్‌మెంట్ మార్పుపై ఎంఐఎం పట్టుదల చూపగా, బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశంపై మెజారిటీ ప్రజల కోరిక మేరకు నిర్ణయం తీసుకుంటామని ఈ సమావేశంలో కేసీఆర్ హామీ ఇచ్చారు. తప్పకుండా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తామన్నారు. ఆ తర్వాత ఈ వివాదం రాజకీయ పార్టీల మధ్య అలాగే వుండిపోయినా.. ప్రభుత్వం మాత్రం మార్పు దిశగా అడుగులు వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement