క్రిస్మస్ కానుకగా షియోమి బంపర్ ఆఫర్లు
క్రిస్మస్ కానుకగా షియోమి బంపర్ డిస్కౌంట్లు ప్రకటించింది. ''వెరీ మి క్రిస్మస్ సేల్'' కింద మి5 స్మార్ట్‌ఫోన్, కూపన్స్, యాక్ససరీస్ వంటి వాటిపై డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నట్టు షియోమి బుధవారం వెల్లడించింది. సోమవారం నుంచి బుధవారం వరకు ఈ డిస్కౌంట్లు వినియోగదారులకు అందుబాటులో ఉంచినట్టు కంపెనీ పేర్కొంది. అయితే ఈ సేల్ ఆఫర్ కేవలం తమ ఆన్స్టోర్ Mi.com/in ద్వారా కొనుగోలు చేసిన వాటికే వర్తించనుందని షియోమి తెలిపింది.
స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్‌తో లాంచ్ అయిన మొదటి ఫోన్ షియోమి మి5. క్రిస్మస్ సేల్ కింద ఈ ఫోన్ ధరపై రూ.3000 డిస్కౌంట్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఆఫర్లో ఈ ఫోన్ రూ.19,999కే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. రూ.24,999కు లాంచ్ అయిన ఈ ఫోన్ ధరను కంపెనీ రూ.22,999లకు తగ్గించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కంపెనీ ఆఫర్ చేస్తున్న డిస్కౌంట్‌పై రూ.19,999కే లభ్యమవుతోంది. అయితే ఇది కేవలం పరిమిత కాల వ్యవధిలోనే. అయితే కేవలం షియోమి మి5 స్మార్ట్‌ఫోన్‌పై కంపెనీ ధరను తగ్గించింది. ఇతర పాపులర్ రెడ్మి సిరీస్ స్మార్ట్ఫోన్లపై కంపెనీ ఎలాంటి ఆఫర్లను ప్రకటించలేదు.
మి5 స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్‌తో పాటు రూ.1,899 ధర కల్గిన 20,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంకుపై రూ.600 డిస్కౌంట్‌ను కంపెనీ అందిస్తోంది. అదేవిధంగా 10,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంకు ధరపై కూడా రూ.300 ఫ్లాట్ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ కింద రూ.1,799 ధర కల్గిన మి ఇన్-ఇయర్ ప్రొ హెడ్‌ఫోన్స్ ధర రూ.1,599కు దిగొచ్చింది. మి యూఎస్బీ ఫ్యాన్‌ను రూ.149కు( అసలు ధర రూ.249), మి ఎల్ఈడీ లైట్‌ను రూ.199(అసలు ధర రూ.249)కు అందుబాటులోకి తీసుకొస్తోంది.