Michael Jordan
-
వాళ్లతో పోలిస్తే ఐపీఎల్లో క్రికెటర్లు సంపాదించేదెంత.. ఆడుకోనివ్వండి..!
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 ఫైనల్లో టీమిండియా ఓటమికి ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) కారణమంటూ వస్తున్న విమర్శల నేపథ్యంలో విండీస్ దిగ్గజ క్రికెటర్ క్లైవ్ లాయిడ్ స్పందించాడు. ఈ విషయంలో లాయిడ్ ఐపీఎల్ ఆడే క్రికెటర్లకు మద్దతుగా నిలిచాడు. అంతర్జాతీయ వేదికపై క్రికెటర్లు విఫలం కావడాన్ని ఐపీఎల్‌తో ముడిపెట్టడం సమంజసంకాదని అన్నాడు. ఆటగాళ్లకు దేశం కంటే డబ్బే ముఖ్యమని అనే వాళ్లు అర్దంపర్దం లేని వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికాడు. ఆటగాళ్లు దాదాపు 10 నెలల పాటు దేశం తరఫున ఆడుతున్నారు.. అలాంటప్పుడు రెండు నెలల పాటు ఐపీఎల్ ఆడి నాలుగు డబ్బులు వెనకేసుకుంటే తప్పేంటని ప్రశ్నించాడు. మైఖేల్ జోర్డన్ లాంటి బాస్కెట్‌బాల్ ప్లేయర్లు.. రొనాల్డో, మెస్సీ లాంటి ఫుట్‌బాలర్లు మిలియన్ల కొద్ది డబ్బు సంపాదిస్తున్నప్పుడు, క్రికెటర్లు ఐపీఎల్ ఆడి డబ్బు సంపాదిస్తే తప్పేంటి అని ప్రశ్నించాడు. ప్రపంచవ్యాప్తంగా అందరు ఆటగాళ్లు పాల్గొనేలా ఐపీఎల్‌కు ప్రత్యేక విండోను ఏర్పాటు చేయాలని సూచించాడు. కాగా, క్లైయివ్ లాయిడ్ తొలి రెండు వన్డే ప్రపంచకప్‌లలో వెస్టిండీస్‌ను విజేతగా నిలిపిన కెప్టెన్ అన్న విషయం తెలిసిందే. -
వరల్డ్ ఫాస్టెస్ట్ కారు కొన్న దిగ్గజ ఆటగాడు: రూ. 29 కోట్లు
న్యూఢిల్లీ: బాస్కెట్ బాల్ దిగ్గజం, మాజీ ఎన్బీఏ స్టార్ మైఖేల్ జోర్డాన్ తన ఆసక్తికి తగ్గట్టుగానే మరో ఫాస్టెస్ట్ కారును సొంతం చేసుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, కన్వర్టిబుల్ కార్ హెన్నెస్సీ వెనమ్ F5 రోడస్టర్ను కొనుగోలు చేశాడు దీని ఏకంగా రూ. 29 కోట్ల రూపాయలు. బాస్కెట్‌బాల్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడైన జోర్డాన్ హైపర్, సూపర్, స్పోర్ట్స్ కార్ల కలెక్షన్‌కు పెట్టింది పేరు. అందులోనూ అల్ట్రా-ఫాస్ట్ కార్లంటే అంటే అతనికి పిచ్చి. గంటకు 400 కి.మీ దూసుకుపోయే బుగట్టి వేరాన్ గ్రాండ్ స్పోర్ట్ కారు ఇప్పటికే గ్యారేజీలో ఉంది. ఇంకా పోర్స్చే 911 టర్బో S 993, ఫెరారీ 512 TR , చేవ్రొలెట్ కొర్వెట్టి లాంటి లెజెండ్రీ కార్లు కూడా ఉన్నాయి. తాజాగా అమెరికన్ హెన్నెస్సీ వెనమ్ F5 రోడస్టర్ కారు కూడా చేరింది. ప్రపంచంలో కేవలం 30 మంది ఓనర్లలో మైఖేల్ జోర్డాన్ ఒకరు. (మంటల్లో మహీంద్రా ఎక్స్‌యూవీ700: వీడియో వైరల్, స్పందించిన కంపెనీ ) హెన్నెస్సీ పెర్ఫార్మెన్స్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో జోర్డాన్‌తో పోటోను కంపెనీ సీఈవో జాన్ హెన్నెస్సీ ట్వీట్ చేశారు. ప్రత్యేకమైన రోజు, స్పెషల్ ఫ్రెండ్ కోసం స్పెషల్ వెనమ్ ఎఫ్5ని అనే క్యాప్షన్‌తో ఈ ఫోటోను షేర్ చేయడం విశేషం.(యాపిల్ స్పెషల్ ఫీచర్‌తో స్మార్ట్ ట్రావెల్ మగ్, ధర వింటే..!) View this post on Instagram A post shared by Hennessey Performance (@hennesseyperformance) అద్భుతమైన ఈ కారు 6.6-లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజిన్న్, 1,842 హార్స్పవర్, 1193 గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. కేవలం 2.6 సెకన్లలో 0 - 100 kmph వేగంతో గరిష్ట వేగంతో గంటకు 498 కి.మీ.ని అధిగమిస్తుందని అంచనా. నివేదిక ప్రకారం కేవలం 30 కార్లు మాత్రమే తయారైనాయి. ధర 3 మిలియన్ డాలర్లు. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన , అత్యంత శక్తివంతమైన కన్వర్టిబుల్ కారని కంపెనీ ప్రకటించింది.. -
Michael Jordan: బాస్ ఆఫ్ బాస్కెట్‌బాల్
ఆరు సార్లు ప్రతిష్ఠాత్మక నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడు... ఆరు ఫైనల్స్‌లో అత్యంత విలువైన ఆటగాడి అవార్డు... ఐదు సార్లు టోర్నీ మొత్తంలో అత్యంత విలువైన ఆటగాడు...14 సీజన్ల పాటు ఆల్‌స్టార్ జట్టులో చోటు...రెండు ఒలింపిక్ పతకాలు...కనీసం రెండంకెల పాయింట్లు స్కోరు చేసిన వరుస మ్యాచ్‌లు ఏకంగా 840... ఒక మ్యాచ్‌లో ఒంటిచేత్తో ఏకంగా 69 పాయింట్లు సాధించిన ఘనత... ఒకటేమిటి, ఇలా ఆ దిగ్గజం గొప్పతనం గురించి చెప్పుకుంటూ పోతే పుటలు సరిపోవు. లెక్కలేనన్ని రికార్డులను అతను తిరగరాశాడు. అతను కోర్టులో అడుగుపెడితే అభిమానులకు అతి పెద్ద పండుగ! ఆట మొదలుపెడితే అద్భుతాలు ఆవిష్కృతం కావడమే, లోకం ఊగిపోవడమే! క్రీడా చరిత్రలో ఒక ఆటపై ఒక వ్యక్తి ఇంతగా తనదైన ముద్ర వేయడం అరుదు. ఆ సూపర్ స్టార్ పేరే మైకేల్ జోర్డాన్. మరో మాటలకు తావు లేకుండా ఆల్‌టైమ్ గ్రేట్. ఒక తరం పాటు బాస్కెట్‌బాల్ అంటే జోర్డాన్; జోర్డాన్ అంటే బాస్కెట్‌బాల్! 1984లో ఎన్బీఏ జట్టు షికాగో బుల్స్ తొలి సారి జోర్డాన్‌ను తీసుకుంది. అప్పుడు వారికీ తెలీదు. తాము ఎలాంటి సంచలనాన్ని ఎంచుకున్నామో, మున్ముందు అతను చూపే అద్భుతాలు ఎలాంటివో వారూ ఊహించలేదు. సీనియర్లు మెల్లమెల్లగా తప్పుకుంటున్న దశలో జోర్డాన్ రాక బుల్స్ టీమ్‌ను శాశ్వత కీర్తిని తెచ్చిపెట్టింది. అతను పాయింట్ సాధించే క్రమంలో ఎగిరే తీరు, ’స్లామ్ డంక్స్’తో పాటు ‘ఫ్రీ త్రో లైన్’లో పాయింట్లు సాధించే తీరు ప్రపంచ క్రీడాభిమానులందరూ నివ్వెరపోయేలా చేశాయి. అందుకే జోర్డాన్ కోసం వారంతా పడిచచ్చిపోవడం మొదలైంది. బుల్స్‌తో చేరిన తర్వాత తొలి ఎన్బీఏ టైటిల్ సాధించేందుకు కొంత సమయం పట్టినా తన అద్భుత ఆటతో బుల్స్‌కు రెండుసార్లు త్రీ–పీట్ (హ్యాట్రిక్) టైటిల్స్‌ను అందించాడు. 1991–93 వరకు వరుసగా మూడేళ్లు షికాగో బుల్స్ పైచేయి సాధించిందంటే అందుకు జోర్డానే కారణం. అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన మూడేళ్ల తర్వాత తిరిగొచ్చిన జోర్డాన్... మరోసారి వరుసగా మూడేళ్లు బుల్స్ టైటిల్ సాధించడంలో మళ్లీ ప్రధాన పాత్ర పోషించడం విశేషం. ఎన్బీఏ లీగ్ చరిత్రలో తొలి బిలియనీర్ ప్లేయర్‌గా అతను గుర్తింపు పొందాడు. స్కూల్, కాలేజీల్లో సత్తా చాటి... జోర్డాన్ జీవితంలో పెద్దగా ఎత్తుపల్లాలేమీ లేవు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో అతని బాల్యం బాగానే సాగింది. ఆటల్లో ఎంతో ఆసక్తి కనబర్చిన అతను తన స్కూల్లో బాస్కెట్‌బాల్, బేస్‌బాల్, ఫుట్‌బాల్ ఆడాడు. బాస్కెట్‌బాల్ అతడిని ఎక్కువగా ఆకర్షించడంతో జట్టులో చోటు కోసం ప్రయత్నించాడు. ఆ సమయంలో జోర్డాన్ ఎత్తు 5 అడుగుల 11 అంగుళాలు. మామూలుగా అయితే ఇది మంచి ఎత్తు. కానీ స్కూల్ లెవల్ బాస్కెట్‌బాల్ ఆడేందుకు ఇది సరిపోదని, చాలా తక్కువ అంటూ అతడికి చోటు నిరాకరించారు! దాంతో అదే స్కూల్ జూనియర్ టీమ్ తరఫున అతను ఆడాడు. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ సత్తా చాటి పాయింట్ల వర్షం కురిపించాడు. తర్వాతి ఏడాది వచ్చేసరికి జోర్డాన్ ఎత్తు మరో 10 సెంటీమీటర్లు పెరిగింది. దాంతో పాటు శిక్షణలో కఠోరంగా శ్రమించాడు కూడా. ఫలితంగా తిరస్కరించిన జట్టులోనే చోటు లభించింది. తమ టీమ్‌ను వరుసగా గెలిపించడంతో పాటు అమెరికాలోని ప్రతిష్ఠాత్మక బాస్కెట్‌బాల్ స్కాలర్‌షిప్‌లన్నీ వచ్చి చేరాయి. ఆపై కాలేజీ టీమ్‌లో కూడా చెలరేగడంతో కాలేజీ బాస్కెట్‌బాల్ అమెరికన్ టీమ్‌లో కూడా అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. జాగ్రఫీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే సమయానికే బాస్కెట్‌బాల్‌లో జోర్డాన్ అందరి దృష్టిలో పడి భవిష్యత్ సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. నిజంగానే ఆ తర్వాత ఎదురు లేకుండా అతని ప్రస్థానం కొనసాగింది. తిరుగులేని ప్రదర్శనతో... షికాగో బుల్స్... ఎన్బీఏలో 1966నుంచి బరిలో ఉన్న జట్టు. 18 సీజన్ల పాటు ఆడినా ప్రదర్శన అంతంతమాత్రంగా ఉంది. కానీ 1984 డ్రాఫ్ట్ ఆ జట్టుకు ఒక్కసారిగా ఆకర్షణను తెచ్చింది. దానికి కారణం ఒకే ఒక్కడు మైకేల్ జోర్డాన్. జోర్డాన్ బరిలోకి దిగితే చాలు అభిమానులు ఊగిపోయారు. ఫలితంతో సంబంధం లేకుండా అతను ఉంటే చాలు, అతని ఆట చూస్తే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఆ ఏడాది బుల్స్ ఆడిన 82 మ్యాచ్‌లు అన్నింటిలో బరిలోకి దిగిన ఏకైక ఆటగాడైన జోర్డాన్ ప్రతీ గేమ్‌కు సగటున 28.2 పాయింట్లు సాధించిన శిఖరాన నిలిచాడు. అయితే ఇతర సహచరుల నుంచి తగినంత సహకారం లేక టీమ్ ప్రస్థానం పడుతూ లేస్తూ సాగింది. కానీ 1991లో ఎట్టకేలకు బుల్స్ ఎదురు చూసిన క్షణం వచ్చింది. ఫైనల్లో టాప్ టీమ్ లాస్ ఏంజెల్స్ లేకర్స్‌ను ఓడించి బుల్స్ తొలి సారి చాంపియన్‌గా నిలిచింది. 31.5 సగటు పాయింట్లతో టాప్ స్కోర్ సాధించిన జోర్డాన్ అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాత వరుసగా రెండేళ్లు ఇదే కొనసాగింది. ఫలితంగా మరో రెండు టైటిల్స్ జట్టు ఖాతాలో చేరాయి. అనూహ్యంగా దూరమై... 1993లో జోర్డాన్ తండ్రి అనూహ్యంగా హత్యకు గురయ్యాడు. తండ్రిని ఎంతో ప్రేమించిన జోర్డాన్ తనకు బాస్కెట్‌బాల్‌పై ఆసక్తి తగ్గిపోయిందంటూ హఠాత్తుగా రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించాడు. బాస్కెట్‌బాల్ ప్లేయర్‌గా అప్పటికే ఎంతో కీర్తిని పొందినా, చిన్నప్పుడు తన తండ్రి తనను బేస్‌బాల్ ఆటగాడిగా చూడాలని కోరుకున్నాడంటూ ఒక్కసారిగా బేస్‌బాల్ మైనర్ లీగ్‌లో కూడా అడుగు పెట్టాడు. అక్కడ రెండు సీజన్ల పాటు బ్యారన్స్, స్కార్పియన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే రెండేళ్ల తర్వాత తన టీమ్ బుల్స్ పరిస్థితి బాగా లేకపోవడంతో సీజన్ మధ్యలో ’ఐయామ్ బ్యాక్’ అంటూ రిటైర్మెంట్కు గుడ్‌బై చెప్పిన మళ్లీ కోర్టులోకి అడుగు పెట్టాడు. సుమారు 18 నెలల పాటు ఆట నుంచి దూరంగా ఉన్నా జోర్డాన్‌లో ఏమాత్రం పదును తగ్గలేదు. ఒంటి చేతుల్లో టీమ్‌ను ప్లే ఆఫ్ వరకు చేర్చగలిగాడు. అయితే తాను చేయాల్సింది ఇంకా ఉందని భావించిన జోర్డాన్ తర్వాతి సీజన్ కోసం సీరియస్‌గా కష్టపడ్డాడు. అందుకు తగ్గ ఫలితం కూడా జట్టుకు లభించింది. మరో సారి వరుసగా మూడేళ్ల పాటు (1996, 97, 98) బుల్స్ ఎన్బీఏ చాంపియన్‌గా నిలవడం విశేషం. రెండోసారి మళ్లీ రిటైర్మెంట్ ప్రకటించి, మూడేళ్ల తర్వాత జోర్డాన్ మళ్లీ వెనక్కి వచ్చాడు. ఈసారి జట్టు మారి రెండేళ్ల పాటు వాషింగ్టన్ విజార్డ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. జోర్డాన్ టీమ్ నుంచి తప్పుకున్న తర్వాత 1998నుంచి ఇప్పటి వరకు ఎన్బీఏలో షికాగో బుల్స్ మరో టైటిల్ గెలవలేకపోయిందంటే అతని ఘనత ఏమిటో అర్థమవుతుంది. 1984 లాస్ ఏంజెల్స్, 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లలో అమెరికాకు స్వర్ణ పతకాలు అందించి జాతీయ జట్టు తరఫున కూడా తన బాధ్యతను నెరవేర్చాడు. బాస్కెట్‌బాల్‌కు ప్రపంచవ్యాప్తంగా అమిత ప్రాచుర్యం కల్పించడంలో జోర్డాన్ కీలక పాత్ర పోషించాడు. అతని కారణంగానే 90వ దశలో ఎన్బీఏ లీగ్ వాణిజ్యపరంగా ఎంతో ఎత్తుకు ఎదిగింది. స్వయంగా జోర్డాన్ ఎండార్స్మెంట్ల ద్వారా మార్కెట్‌ను శాసించాడు. అతనితో ఒప్పందాల కోసం పెద్ద పెద్ద సంస్థలు ‘క్యూ’ కట్టి పోటీ పడ్డాయి. ప్రపంచ క్రీడా చరిత్రలో అత్యధికంగా మార్కెటింగ్ చేయబడిన ఆటగాడిగా అతను గుర్తింపు పొందారు. అన్నింటికి మించి ‘నైకీ’ సంస్థ అతని జంప్‌తో ప్రత్యేకంగా రూపొందించిన షూస్ విశ్వవ్యాప్తంగా సంచలనం సష్టించాయి. ‘ఎయిర్ జోర్డాన్’ పేరుతో రూపొందించిన ఈ కమర్షియల్‌తో అతని స్థాయి ఏమిటో తెలిసింది. పలు సినిమాలు, డాక్యుమెంటరీల్లో కూడా నటించిన జోర్డాన్ పలు పుస్తకాలు రచించాడు. అయితే ’ఫర్ ద లవ్ ఆఫ్ ద గేమ్’ పేరుతో వచ్చిన జోర్డాన్ ఆత్మకథలో అతని కెరీర్, జీవితంలో అన్ని కోణాలు కనిపిస్తాయి. -
ఆ ముగ్గురు దిగ్గజాలు క్రికెట్‌ను ఏలేవారేమో!
ఆస్ట్రేలియా విధ్వంసక ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ పరిమిత ఓవర్ల క్రికెట్లో సత్తా చాటుతున్నాడు. ముఖ్యంగా టి20ల్లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరైన స్టోయినిస్ ప్రస్తుతం ఐపీఎల్ 16వ సీజన్లో బిజీగా గడుపుతున్నాడు. ఐపీఎల్లో కేఎల్ రాహుల్ సారధ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా ఇవాళ ఎస్ఆర్హెచ్తో లక్నో సూపర్ జెయింట్స్ అమితుమీ తేల్చుకోనుంది. కాగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్న స్టోయినిస్ ఐపీఎల్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. క్రీడారంగానికి సంబంధించి నీకిష్టమైన ముగ్గురు రిటైర్డ్ ఆటగాళ్ల పేర్లు చెప్పమని అడిగారు. దీనికి స్టోయినిస్.. మాజీ బాస్కెట్‌బాల్ దిగ్గజం మైకెల జోర్డాన్, గోల్ఫ్ దిగ్గజం టైగర్‌వుడ్స్, బాక్సింగ్ దిగ్గజం మహమూద్ అలీ పేర్లను ఏంచుకున్నాడు. ఒకవేళ ఈ ముగ్గురు ఆయా రంగాల్లో కాకుండా క్రికెట్లో ఆడుంటే ఈ ఆటను కూడా ఏలేవారేమో అని పేర్కొన్నాడు. ఇక తాను, ఆస్టన్ అగర్ యూఎఫ్సీకి పెద్ద అభిమానులమని.. ఎప్పుడు మ్యాచ్‌లు జరిగినా తప్పుకుండా చూస్తామన్నాడు. యూఏఈ వేదికగా జరిగిన 2021 టి20 ప్రపంచకప్ సందర్భంగా గోల్ప్ ఆడడానికి పొవెళ్లాం. అక్కడ యూఎఫ్‌సీ ఛాంపియన్స్‌గా ఫోజు ఇవ్వడం ఇప్పటికి మరిచిపోలేదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం స్టోయినిస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇప్పటివరకు లక్నో సూపర్ జెయింట్స్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక దాంట్లో గెలిచి మరొక దాంట్లో ఓడింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో గెలిచిన లక్నో.. సీఎస్కే చేతిలో 12 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. The Christian Bale connection to his social-media post 🤔 3⃣ sportspersons he wished would have played cricket 👌 Who is on his speed dial 📱@MStoinis 𝙐𝙉𝙋𝙇𝙐𝙂𝙂𝙀𝘿 ahead of @LucknowIPL's home game against #SRH tonight 😎 - By @ameyatilak #TATAIPL | #LSGvSRH pic.twitter.com/6lLOpFbkb8 — IndianPremierLeague (@IPL) April 7, 2023 చదవండి: IPL 2023: 'టైమూ పాడూ లేదు.. చూసేవాళ్లకు చిరాకు తెప్పిస్తోంది' -
వేలంలో ఆ బూట్లకు రూ.4.6 కోట్లు
న్యూయార్క్: బాస్కెట్‌బాల్ దిగ్గజం మైకేల్ జోర్డాన్ వేసుకున్న బూట్లు వేలంలో రికార్డు ధర పలికాయి. 1985లో ఇటలీ వేదికగా జరిగిన ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో జోర్డాన్ వేసుకున్న ‘ఎయిర్ జోర్డాన్ వన్ హైస్ స్నీకర్స్’ షూస్‌కు 6 లక్షల 15 వేల అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 4.60 కోట్లు) లభించాయి. దాంతో గత మేలో ఇవే రకానికి చెందిన జోర్డాన్ బూట్లకు పలికిన 5 లక్షల 60 వేల అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 4.20 కోట్లు) ఆల్టై మ్ రికార్డును బద్దలు కొట్టినట్లు వేలం నిర్వహించిన క్రిస్టీ సంస్థ వెల్లడించింది. అయితే ఎవరు కొనుగోలు చేశారనే విషయాన్ని మాత్రం ఆ సంస్థ వెల్లడించడానికి ఇష్టపడలేదు. నేషనల్ బాస్కెట్‌బాల్ సంఘం (ఎన్బీఏ) టోర్నీలో మకుటం లేని మహారాజుగా నిలిచిన మైకేల్ జోర్డాన్... తనకే సాధ్యమైన ప్రత్యేక ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. చికాగో బుల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన జోర్డాన్... తన జట్టు జెర్సీ కలర్ అయిన నలుపు, ఎరుపు రంగులతో కూడిన బూట్లను వాడేవాడు. -
రూ. 755 కోట్లు విరాళం
చార్లెట్: ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన జాతి వివక్షపై పోరాటానికి అమెరికా బాస్కెట్‌బాల్ దిగ్గజం మైకేల్ జోర్డాన్ ముందుకొచ్చాడు. వర్ణ సమానత్వం, సామాజిక న్యాయం కోసం పోరాడుతోన్న సంస్థలకు జోర్డాన్ 10 కోట్ల డాలర్ల (రూ. 755 కోట్లు) విరాళం ప్రకటించాడు. ఇందులో 4 కోట్ల డాలర్లు (రూ. 302 కోట్లు) ‘నైకీ’ రూపొందించిన ‘జోర్డాన్ బ్రాండ్’ తరపున అందజేస్తారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. ‘వివక్ష లేకుండా జాతి సమానత్వం, సామాజిక న్యాయం, విద్యావకాశాలు అనే లక్ష్యాల్ని నెరవేర్చడం కోసం 10 సంవత్సరాలకు పైగా ధనాన్ని సమకూర్చుతాం. ‘నల్లజాతి వారి ప్రాణాలూ ప్రధానమే’. దేశంలో వేళ్లూనుకుపోయిన జాత్యాహంకారం నశించేవరకు, నల్లజాతీయుల జీవితాలను మెరుగుపరిచేందుకు వారిని రక్షించేందుకు మేం కట్టుబడి ఉంటాం’ అని 57 ఏళ్ల చికాగో బుల్స్ మాజీ బాస్కెట్‌బాల్ ప్లేయర్ జోర్డాన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం జాతీయ బాస్కెట్‌బాల్ సంఘం (ఎన్బీఏ) జట్టు చార్లెట్ హార్నెట్స్‌కు యజమాని అయిన జోర్డాన్... పోలీసుల దురాగతానికి ప్రాణాలు కోల్పోయిన జార్జి ఫ్లాయిడ్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. -
ఈ కర్కశంపై మాట్లాడరేంటి?
చార్లొట్ (అమెరికా): అమెరికాలో ఓ నల్లజాతీయుడిని శ్వేతజాతి పోలీస్ అత్యంత కర్కశంగా హత్య చేసిన ఘటనపై ఫార్ములావన్ (ఎఫ్1) ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ గళం విప్పాడు. జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడిపై పడగవిప్పిన జాతి వివక్షపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలోని నగరాల్లో నిరసనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ నల్లజాతి రేసర్ అయిన హామిల్టన్ స్పందిస్తూ ఈ దురాగతంపై స్పందించరా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు. ‘ఈ కర్కశ హత్యపై నా క్రీడ నుంచి ఎవరు మాట్లాడరేంటి. బహుశా శ్వేతజాతీయుల ఆధిపత్యం ఉన్న క్రీడ కాబట్టే పెదవి విప్పడం లేదనుకుంటా’ అని సోషల్ మీడియాలో తన ఆక్రోశాన్ని వెలిబుచ్చాడు. వెంటనే ఫార్ములావన్ క్రీడాలోకం స్పందించడం మొదలుపెట్టింది. వర్ణ వివక్ష హత్యపై నిరసించింది. రేసర్లతో పాటు మిగతా క్రీడలకు చెందిన స్టార్లు కూడా జరిగిన ఘోరంపై స్పందించారు. జార్జ్ ఫ్లాయిడ్‌కు న్యాయం జరగాల్సిందేనని సోషల్ మీడియా వేదికపై నినదించారు. బాధగా ఉంది... కోపమొస్తోంది: జోర్డాన్ ఆఫ్రికన్–అమెరికన్‌ను శ్వేతజాతి పోలీసు కర్కశంగా చంపడం తనను చాలా బాధించిందని అమెరికా బాస్కెట్‌బాల్ దిగ్గజం మైకేల్ జోర్డాన్ అన్నాడు. ‘ఆ ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. నిజంగా చెబుతున్నా... చాలా బాధగా ఉంది. అలాగే కోపంగా కూడా ఉంది. జాతి వివక్ష హత్యపై అందరూ కదం తొక్కుతున్నారు. తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. ఇప్పటికైనా జాత్యహంకారం తొలగిపోవాలి. హింస సద్దుమణగాలి’ అని ఎన్బీఏ సూపర్‌స్టార్ జోర్డాన్ అన్నాడు. -
జోర్డాన్ బూట్లు అ‘ధర’హో...
న్యూయార్క్: బాస్కెట్‌బాల్ దిగ్గజం మైకేల్ జోర్డాన్ వేసుకున్న బూట్లు వేలంలో రికార్డు ధర పలికాయి. ఎన్బీఏలో ఆడేందుకు జోర్డాన్ కోసమే ప్రత్యేకంగా నైకీ సంస్థ తయారు చేసిన ‘ఎయిర్ జోర్డాన్ స్నీకర్స్’ షూస్‌కు 5 లక్షల 60 వేల అమెరికా డాలర్లు (రూ.4 కోట్ల 25 లక్షలు) లభించాయి. ఇది ఆల్‌టైమ్ రికార్డు ధర అని వేలం నిర్వహించిన ‘సొ ద బై’ సంస్థ వెల్లడించింది. 1985లో తెలుపు, నలుపు, ఎరుపు రంగుల్లో నైకీ ఈ బూట్లను ప్రత్యేకంగా తయారు చేసింది. ఈ షూస్‌ను ఎన్బీఏ పోటీల్లో జోర్డాన్ ధరించాడు. గతంలో కూడా జోర్డాన్ బూట్లు వేలంలో అసాధారణ ధర పలికాయి. అప్పట్లో జోర్డాన్ కోసం తొలిసారిగా స్నీకర్స్ తరహా బూట్లను నైకీ రూపొందించింది. వాటిని గత ఏడాది వేలానికి పెట్టగా 4 లక్షల 37 వేల డాలర్లు (రూ. 3 కోట్ల 30 లక్షలు) లభించాయి. ఎన్బీఏలో చికాగో బుల్స్ తరఫున జోర్డాన్ మెరుపులపై ‘ది లాస్ట్ డాన్స్’ అనే డాక్యుమెంటరీ వచ్చింది. ఇది కూడా అతను ఆడే మ్యాచ్‌ల్లాగే బాగా పాపులర్ అయింది. -
‘ఆల్‌టైమ్ శ్రీమంతుడు’ జోర్డాన్
న్యూయార్క్: అత్యధిక ధనవంతమైన ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ క్రీడాకారుల జాబితాలో ఫుట్‌బాల్ ప్లేయరో, దిగ్గజ క్రికెటరో లేడు. ‘ఫోర్బ్స్’ మేగజైన్ విడుదల చేసిన శ్రీమంతులైన ఆటగాళ్లలో అమెరికా బాస్కెట్‌బాల్ లెజెండ్ మైకేల్ జోర్డాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. రిటైరైన ఈ 54 ఏళ్ల దిగ్గజం ఆర్జన మొత్తం రూ. 11, 881 కోట్లు (1.85 బిలియన్ డాలర్లు) కావడం విశేషం.. ఆ తర్వాత రెండు, మూడు స్థానాల్లో గోల్ఫర్లు టైగర్ వుడ్స్ (రూ. 10, 918 కోట్లు; 1.7 బిలియన్ డాలర్లు), అర్నాల్డ్ పాల్మర్ (రూ.8991 కోట్లు; 1.4 బిలియన్ డాలర్లు) ఉన్నారు. నాలుగో స్థానం కూడా గోల్ఫర్దే! జాక్ నిక్లాస్ రూ.7707 కోట్ల (1.2 బిలియన్ డాలర్లు) ఆదాయంతో ఉన్నాడు. ఫార్ములావన్ లెజెండ్ మైకేల్ షుమాకర్ (రూ. 6422 కోట్లు; ఒక బిలియన్ డాలర్లు) టాప్–5 జాబితాలో ఉన్నాడు. ఫుట్‌బాలర్లు డేవిడ్ బెక్‌హామ్, రొనాల్డో, లియోనల్ మెస్సీ, బాక్సర్లు మెవెదర్, పకియావో, టెన్నిస్ట్ గ్రేటెస్ట్ రోజర్ ఫెడరర్ టాప్–25 అథ్లెట్ శ్రీమంతుల్లో ఉన్నారు. -
యంగ్ పికాసో!
జార్జ్ పొచెస్తోవ్ పదకొండు నెలల వయసులో ఉన్నప్పుడు వాళ్ల నాన్న బ్రెయిన్ కాన్సర్‌తో చనిపోయాడు. చావు గురించి జార్జ్‌కు తెలిసే వయసేమీ కాదు అది. కానీ, ఆ చిట్టి కళ్లు తండ్రి కోసం వెదుకుతున్నట్లు తల్లి కనిపెట్టింది. పిల్లాడిని దారి మళ్లించడానికి అన్నట్లు అతని ముందు పెయింటింగ్ సామాగ్రి ముందు పెట్టేది. వాటితో తనకు తోచిన గీతలేవో గీసేవాడు జార్జ్. అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఉక్రెయిన్ దంపతులకు జన్మించిన జార్జ్ పదిహేడు సంవత్సరాల వయసులో కారు బొమ్మను అద్భుతంగా గీశాడు. వయసుతో పాటు అతనిలో చిత్రకళా ప్రతిభ పెరగడం ప్రారంభమైంది. బ్రైట్ కలర్ స్కీమ్‌లతో రకరకాల ప్రయోగాలు చేశాడు. గురువంటూ ఎవరూ లేకపోయినా చిత్రకళను తనకు తానే స్వయంగా నేర్చుకున్నాడు. జార్జ్ గీసిన చిత్రాలకు బ్రహ్మాండమైన మార్కెట్ ఉంది. త్రీ-డైమన్షల్ కాన్వాస్ మీద దృష్టి పెట్టినా, ఇ్రంపెషనిస్టిక్ ఆర్ట్ మీద దృష్టి పెట్టినా...తనదైన శైలిని ఎప్పుడు కోల్పోలేదు జార్జ్. హిల్లరీ క్లింటన్ నుంచి మైఖెల్ జోర్డన్(ప్రముఖ బాస్కెట్‌బాల్ ప్లేయర్) వరకు జార్జ్‌కు అభిమానులు ఉన్నారు. ఇంగ్లండ్, ఫ్రాన్స్, కొరియా, దక్షిణ అమెరికా, నెదర్లాండ్స్, రష్యా, ఉక్రేయిన్లలో ఎక్కువగా జార్జ్ చిత్రాలు ప్రదర్శితమవుతుంటాయి. జార్జ్‌పై ‘ఏ బ్రష్ విత్ డెస్టినీ’ అనే డాక్యుమెంటరీ రూపుదిద్దుకుంది. ఇది నాలుగు ఎమ్మీ అవార్డ్లు గెలుచుకుంది. చిత్రకళ మాత్రమే కాకుండా సామాజిక సేవా సంస్థలకు సహాయపడడం అంటే కూడా జార్జ్‌కు ఎంతో ఇష్టమైన పని. ఇరవెరైండు సంవత్సరాల జార్జ్ పొచెస్తోవ్ను మీడియా ముద్దుగా ‘యంగ్ పికాసో’ అని పిలుస్తుంది. నిజానికది భారీ పొగడ్తే కావచ్చు, కానీ చిత్రకళలో జార్జ్ మెరుపులు చూస్తుంటే ఆ మాత్రమైనా అనకుంటే ఎలా అనిపిస్తుంది! జార్జ్‌పై ‘ఏ బ్రష్ విత్ డెస్టినీ’ అనే డాక్యుమెంటరీ రూపుదిద్దుకుంది. ఇది నాలుగు ఎమ్మీ అవార్డ్లు గెలుచుకుంది. చిత్రకళ మాత్రమే కాకుండా సామాజిక సేవా సంస్థలకు సహాయపడడం అంటే కూడా జార్జ్‌కు ఎంతో ఇష్టమైన పని.