గాయం మాయం
హాలీవుడ్ సినిమా ఎక్స్‌మెన్ చూశారా మీరు?
అందులోని వొల్వరీన్ పాత్ర గుర్తుందా?
హ్యూగ్ జాక్‌మ్యాన్ చేసిన ఈ పాత్రకో ప్రత్యేక లక్షణముంది.
ఎంతటి గాయమైనా సరే... క్షణాల్లో మానిపోతుంది.
మధుమేహం బారిన పడితే ఏమవుతుంది?
రక్తంలో చక్కెర మోతాదులు పెరిగిపోతాయి.
కాలేయం తగుమోతాదులో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తే
అంతా సర్దుకుంటుంది. ఇంకోలా చెప్పాలంటే...
మందులు మింగే పనిలేకుండా... వ్యాధి నయమవుతుందన్నమాట!
ఈ రెండు అంశాలకూ మధ్య సంబంధం ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా? చాలానే ఉంది. వోల్వరీన్ పాత్ర మాదిరిగా మన శరీరాలకూ తనంతట తానే వ్యాధులను నయం చేసుకోగల సామర్థ్యం అబ్బితే ఎలా ఉంటుందో చెప్పేందుకే పై ప్రస్తావన. అదెలా సాధ్యమనుకోవద్దు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతుతో అక్కడి మిలటరీ పరిశోధన సంస్థ డార్పా ఇప్పటికే ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టేసింది. అన్నీ సవ్యంగా సాగితే... కొన్నేళ్లలోనే కొన్ని రకాల వ్యాధులకు శరీరమే చికిత్స చేసుకునే పరిస్థితి వచ్చేసినా ఆశ్చర్యపోనక్కరలేదు.
మానవశరీరం ఎంత సంక్లిష్టమైందో మనకు తెలియంది కాదు.. కానీ శాస్త్ర విజ్ఞానం పుణ్యమా అని మనకు మన శరీరం ఎలా పనిచేస్తుందన్న విషయంపై కొంత అవగాహన ఉంది. దీని ప్రకారం... మన నాడీ వ్యవస్థ అవయవాల స్థితిగతులపై నిత్యం ఓ కన్నేసి ఉంటుంది. ఏదైనా గాయమైనా, లేదా ఇన్ఫెక్షన్ సోకినా ఆయా అవయవాల స్పందనలను నియంత్రించేందుకూ నాడీ వ్యవస్థ తోడ్పడుతుంది. ఈ నియంత్రణ వ్యవస్థలో తేడాలొచ్చినప్పుడు ఇదే నాడీ వ్యవస్థ నొప్పి, వాపు, పూత, రోగ నిరోధక వ్యవస్థ వైఫల్యాలకు సంబంధించిన సంకేతాలూ పంపుతుంది. ఈ ప్రాథమిక పరిజ్ఞానం ఆధారంగా డార్పా తన సరికొత్త ప్రాజెక్ట్ ‘ఎలక్ట్రిక్స్’ ద్వారా శరీరమే ఆటోమెటిక్‌గా వ్యాధులను నయం చేసుకునే వ్యవస్థను రూపొందిస్తోంది.
సూక్ష్మ రోబోలు కీలకం...
ఎలక్ట్రిక్స్ ప్రాజెక్ట్‌లో శరీరంలోకి ఎక్కించే అతిసూక్ష్మమైన రోబోల్లాంటి పరికరాలు కీలకమవుతాయి. చిన్న ఉదాహరణతో ఈ విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు పేస్‌మేకర్ గురించి వినే ఉంటారు. గుండెకు సూక్ష్మస్థాయిలో ఎలక్ట్రిక్ షాక్‌లు ఇస్తూ అది సాధారణ రీతిలో కొట్టుకునేలా చేస్తుంది ఈ పరికరం. పేస్‌మేకర్ మాదిరిగా ఇతర అవయవాలను ప్రేరేపించేందుకూ చిన్నచిన్న రోబోల్లాంటి పరికరాలను అభివృద్ధి చేయడం ఎలక్ట్రిక్స్ ప్రాజెక్ట్ లక్ష్యం. అంటే... మధుమేహం కారణంగా ఎవరికైనా రక్తంలోని చక్కెర మోతాదులు పెరిగిపోతే... ఈ చిన్ని రోబోలు కాలేయానికి షాక్‌లాంటిది ఇచ్చి... అధికమోతాదులో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసేలా చేస్తాయన్నమాట!
అన్ని రకాల వ్యాధులకూ పనికొస్తుందా?
ఊహూ. ప్రస్తుతానికైతే ఎలక్ట్రిక్స్ ప్రాజెక్ట్‌ను కొన్ని వ్యాధులకే పరిమితం చేశారు. కీళ్లనొప్పులతోపాటు కొన్ని రకాల ఇన్ఫ్లమేటరీ వ్యాధులు, డిప్రెషన్ లాంటి మానసిక వ్యాధులకు, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్, మూర్ఛ వంటి నాడీసంబంధ వ్యాధులకూ ఎలక్ట్రిక్స్ ద్వారా పరిష్కారాలు కనుక్కునేందుకు డార్పా ప్రయత్నిస్తోంది. కొన్ని రకాల ఇన్ఫ్లమేటరీ వ్యాధుల చికిత్స కోసం ఇప్పటికే కొన్ని పరికరాలు అందుబాటులో ఉన్నప్పటికీ అవి సైజులో చాలా పెద్దవి. శరీరంలోపలికి వాటిని చొప్పించేందుకు శస్త్రచికిత్స అవసరమవుతుంది కూడా.
ఎలక్ట్రిక్స్‌లో ఇలాంటి ఇబ్బందులేవీ ఉండవు. ఇంజెక్షన్ ద్వారానే పరికరాలను శరీరంలోకి పంపించవచ్చు. ఎలక్ట్రిక్స్ ద్వారా సైనికులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, వెన్నుపూస సంబంధిత గాయాలను సమర్థంగా మాన్పే వీలు ఏర్పడుతుందని డార్పా అంచనా వేస్తోంది. మొత్తమ్మీద చూస్తే... డార్పా ఎలక్ట్రిక్స్ టెక్నాలజీ వ్యాధి నిర్ధారణ మొదలుకొని చికిత్స వరకూ అన్ని వైద్య రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందనడంలో సందేహం లేదు.