కరీంనగర్లో కేసీఆర్ ఏరియల్ సర్వే
కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం కరీంనగర్లో ఏరియల్ సర్వే చేపట్టారు. ఎల్లంపల్లి, మిడ్‌మానేరు ప్రాజెక్టులను ఆయన పరిశీలించనున్నారు. మరోవైపు కేసీఆర్ వెంట చీఫ్ సెక్రటరీ, మంత్రి హరీష్ రావు, ఎంపీలు వినోద్, సుమన్, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ తదితరులు ఉన్నారు. గండిపడ్డ మిడ్ మానేర్‌ను పరిశీలించిన అనంతరం సీఎం... అధికారులతో సమీక్షించనున్నారు. కాగా ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు హెలికాప్టర్లో వెళ్లాలని నిర్ణయించుకున్న ముఖ్యమంత్రికి వాతావరణం సరిగ్గా లేదని సూచించడంతో.. రోడ్డు మార్గంలో చేరుకున్నారు.
మరోవైపు జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరదలు పోటెత్తుతున్నాయి. మానేరు, మోయతుమ్మద వాగులతో పాటు ఎల్లమ్మవాగు, మూలవాగు, బిక్కవాగు ఉప్పొంగాయి. సిరిసిల్ల డివిజన్లో అధిక వర్షాలు కురవడంతోపాటు ఎగువ నుంచి ప్రవాహం పెరుగుతూ మానేరుకు వరద పోటెత్తింది. దీంతో మిడ్ మానేరు ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తివేసి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.