నోట్ల రద్దు ప్రభావం..
'మధ్యాహ్న' భారం !
ఏజెన్సీలకు అందని బిల్లులు
నాలుగు నెలలుగా బకాయి
నిత్యావసర సరుకుల కొనుగోలుకు అగచాట్లు
అప్పు కోరితే ధరల పెంపు
దిక్కుతోచని స్థితిలో నిర్వాహకులు
ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం చెల్లించే డబ్బు
– 1–5వ తరగతి వరకు రూ. 5.13
– 6–10 తరగతి వరకు రూ. 7.18
– మధ్యాహ్న భోజనం అమలవుతున్న పాఠశాలలు : 3,783
– రోజూ భోజనం తింటున్న విద్యార్థులు : 3,43,557
– బిల్లుల పెండింగ్ మొత్తం రూ. 17.53 కోట్లు
ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్స్‌ను తగ్గించాలనే ప్రధాన ఉద్ధేశంతో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తున్నారు. పథకం నిర్వహణకు ప్రభుత్వం నుంచి నిధుల మంజూరులో జాప్యం ఏర్పడినా నిర్వాహకులే సర్దుబాటు చేసేవారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో డబ్బు లభించే పరిస్థితిలేదు. దుకాణాల్లో అప్పు అడిగితే సరుకుల ధరలను పెంచేస్తున్నారని వారు వాపోతున్నారు. కిలోపై రూ. 15–25 ఎక్కువగా చెబుతున్నారని. గత్యంతరం లేక సరులకు తెచ్చుకొంటున్నామని వారు చెబుతున్నారు. జిల్లాలో 2,663 ప్రాథమిక, 595 ప్రాథమికోన్నత, 525 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 3,43,557 మంది విద్యార్థులు పాఠశాలల్లో భోంచేస్తున్నారు.
నిధులున్నా ఇవ్వలేదు..
9,10 తరగతులకు సంబంధించి డిసెంబర్ దాకా నిధులు అందుబాటులో ఉన్నాయని, అయితే రెండు నెలలుగా విడుదల చేయడం లేదని తెలిసింది. నాలుగు నెలలకు సంబంధించి మొత్తం జిల్లాలోని ఏజెన్సీలకు రూ. 17.53 కోట్లు బకాయిలు ఇవ్వాల్సి ఉంది.
దీంతోపాటు కార్మికులకు కూడా వేతనాలు చెల్లించాల్సి ఉంది.
అందని బిల్లులు... : నాగమణి, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
జిల్లాలో సెప్టెంబర్ నుంచి మధ్యాహ్న భోజన బిల్లులు ఇవ్వలేదు. కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద నోట్లు రద్దువల్ల అప్పులు పుట్టడం లేదు. కిరాణకొట్లలో అప్పు తీసుకోవడం వల్ల అధికరేట్లు వేస్తున్నారు. కార్మికుల వేతనాలు కూడా మంజూరు చేయలేదు. ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదు.
నిధులు మంజూరు కాలేదు.. : శామ్యూల్, డీఈఓ
మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి వచ్చిన నిధులన్నీ ఇచ్చేశాం. మూడో విడత బడ్జెట్ ఇంకా మంజూరు కాలేదు. బిల్లులు పెండింగ్ ఉండడంతో ఏజెన్సీలు ఇబ్బందులు పడుతున్న సంగతి వాస్తవమే. ప్రభుత్వం మంజూరు చేయగానే వారివారి ఖాతాల్లో జమా చేసేలా చర్యలు తీసుకుంటాం.