వివరం : అందాకా వెళ్లడమే పురస్కారం
ఆస్కార్ రావడం గొప్ప అనుకునేవాళ్లు, ఆస్కార్ రావడం గొప్పా అనేవాళ్లు... హాలీవుడ్లో పక్కపక్క ఇళ్లల్లో ఉంటారని అంటారు. ఆస్కార్ గొప్పతనమదే! ఆస్కార్ వచ్చినా, రాకున్నా గొప్పే. అసూయను సైతం సుగుణంగా మార్చింది ఆస్కార్. సినిమాను గౌరవించినట్లే, వ్యక్తిగత అభిప్రాయాలను, ఆగ్రహాలను గౌరవించింది ఆస్కార్. అంతేకాదు, నిబంధనలకు విరుద్ధమైన సూచనలనూ స్వీకరించింది. 1936లో హాల్మర్కు ‘బెస్ట్ సినిమాటోగ్రఫీ’ అవార్డు అలా వచ్చిందే.
నామినేషన్లలో ఆయన పేరు లేదు. కానీ, ‘మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్’ చిత్రంలో సినిమాటోగ్రఫీ అత్యుత్తమంగా ఉందని అకాడెమీ సభ్యులు బ్యాలెట్లో హాల్మర్ పేరు రాసి మరీ ఓటేశారు. వారి తీర్పునకు సమ్మతి లభించింది! ప్రతిభను ఎవరూ అడ్డుకోలేరు. ఎవరెంత పట్టి ఉంచినా, పట్టనట్లు ఉండిపోయినా... ఏదో ఒకరోజు తిన్నగా అది వేదిక మీదికి వచ్చేస్తుంది. ఆ వేదిక ఆస్కార్ అయితే ఇక చెప్పాల్సిందేముందీ! అందుకే ఆస్కార్‌తో ముడివడిన కొందరు హాలీవుడ్ తారల భావోద్వేగాలను ఈవారం మీకు అందిస్తున్నాం.
మేమ్... నిద్ర లేచారా?
బ్రిటన్ నటి హెలెన్ మిరెన్కు ఉదయాన్నే 5.30 కి తన ఏజెంటు నుంచి ఫోన్ వచ్చింది. ‘‘గుడ్మాణింగ్ మేమ్. ఉత్తమ సహాయ నటిగా మీరు ఆస్కార్‌కి నామినేట్ అయ్యారు’’.ఇటువైపు ఉలుకు లేదు. పలుకు లేదు.
1994లో ‘ద మ్యాడ్నెస్ ఆఫ్ కింగ్ జార్జి’ చిత్రంలో హెలెన్ నటించిన క్వీన్ చార్లెట్ పాత్ర అది. ‘‘మేమ్... నిద్ర లేచారా?’’ మళ్లీ అడిగాడు ఏజెంట్.
‘‘లేచానయ్యా. విన్నాలే. ఆస్కార్ వస్తే మంచిదే. జనానికి ఒకట్రెండ్రోజులు గుర్తుంటాం. కానీ ఈ గిన్నెల బాధ ఎప్పటికీ తప్పదు కదా. లేవాలి, తోమాలి’’. ఇదీ హెలెన్ సమాధానం!
సీసాలు పగలగొట్టాడు!
దర్శకుడు స్పైక్ లీ తీవ్రమైన అసహనంతో ఉన్నాడు. 1990లో ‘డ్రైవింగ్ మిస్ డైసీ’ 9 ఆస్కార్లకు నామినేట్ అయింది. తన సొంత చిత్రం ‘డు ద రైట్ థింగ్’ మాత్రం ఒక్క కేటగిరీలోనూ నామినేట్ అవలేదు. పైగా అది ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం విభాగాలలో షికాగో ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు పొందిన చిత్రం. లీ కి బాగా కోపం వచ్చింది. 24 గంటల తర్వాత గానీ మామూలు మనిషి కాలేకపోయాడు. ‘‘మీ కోపం ఎలా తగ్గిపోయింది?’’ విలేఖరి ప్రశ్న.
‘‘రోజంతా పెద్దగా బండ బూతులు తిట్టుకున్నా. సీసాలు పగలగొట్టా. అప్పుడుగానీ మనసు శాంతించలేదు’’.
అది నేను కాదు బ్రో...
‘టైటానిక్’ (1997) కి 11 ఆస్కార్ అవార్డులు వచ్చాయి. అయితే ఆ చిత్ర కథానాయకుడు లియోనార్డో డి కాప్రియో ఆస్కార్ వేడుకలను ఎగ్గొట్టి వేరే ఎక్కడో తాగి తూలుతున్నాడు. విషయం తెలుసుకోడానికి చిత్ర దర్శకుడు జేమ్స్ కామెరాన్ అతడికి ఫోన్ చేస్తే అటువైపు నుంచి వచ్చిన సమాధానం : ‘‘మీరు వెదుకుతున్న వ్యక్తిని నేను కాదు బ్రో’’.
రేపు ఉదయం మనకు
ఆస్కార్ వేడుకలకు ముహూర్తం దగ్గరపడింది. ఇవాళ సాయంత్రం (మనకు రేపు ఉదయం) హాలివుడ్లోని డాల్బీ థియేటర్ నుంచి విజేతల ప్రకటన వెలువడుతుంది. గత ఏడాది జనవరి 1 నుంచి, డిసెంబర్ 31 వరకు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన చలన చిత్రాలలో 24 కేటగిరీల నుంచి స్వీకరించిన నామినేషన్లలో అత్యుత్తమమైనవిగా ఎంపికైన వాటికి ఆస్కార్ అవార్డును ప్రకటిస్తారు. ఈసారి ఉత్తమ చిత్రం కేటగిరీలో ‘గ్రావిటీ’ , ‘12 ఇయర్స్ ఎ స్లేవ్’ గట్టి పోటీ ఇస్తున్నాయి.
అకాడెమీ ఉత్సవాలు (ఆస్కార్ ఉత్సవాలు) తొలిసారి 1929 మే 16న గురువారం హాలివుడ్లోని రూజ్వెల్ట్ హోటల్లో జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్నవి 86వ ఆస్కార్ వేడుకలు. ఈ వేడుకలను ప్రఖ్యాత కమెడియన్, టెలివిజన్ హోస్ట్ ఎలెన్ డిజెనెరస్ నిర్వహించనున్నారు.
అండ్ ద విన్నర్ ఈజ్....
‘మర్డర్ ఇంక్ (1960) చిత్రంతో ఆస్కార్‌కు నామినేట్ అయిన పీటర్ ఫాక్, తనకా విషయం తెలిసే సమయానికి గ్రీన్విచ్ గ్రామంలో వారానికి 10-15 డాలర్ల వేతనం వచ్చే ఉద్యోగం ఏదో చేస్తూ ఉన్నాడు. అవార్డులు ప్రకటించే రోజు ఓ పాత ఫోక్స్‌వేగన్ కారులో వేదిక దగ్గరకు చేరుకున్నాడు. తర్వాత ఏం జరిగిందో ఆయన మాటల్లోనే వినాలి.
‘‘ఒక్కో కేటగిరీలో విజేతలెవరో ప్రకటిస్తున్నారు. కొంతసేపటి నా కేటగిరీ వచ్చింది. ఊపిరి బిగబట్టి వింటున్నాను. ‘అండ్ ద విన్నర్ ఈజ్... పీటర్...’’ అనగానే ఒక్క గెంతుతో పైకి లేస్తుండగా... ‘ఉస్తినోవ్’ అని వినిపించి కూలబడిపోయాను. నా పక్కన కూర్చుని ఉన్న నా ప్రచార కార్యదర్శిపై విరుచుకుపడ్డాను.
రోజంతా ఆకాశం వైపు చూస్తూ...
1993లో ‘హోవార్డ్స్ ఎండ్’ చిత్రంతో ఎమ్మా థాంప్సన్ ఉత్తమ నటిగా ఆస్కార్ గెలుచుకున్నారు. అవార్డు అందుకున్న రెండో రోజు ఎమ్మా ఏం చేశారో తెలుసా? తన ఆనందాన్ని తల్లితో పంచుకున్నారు. ఎలాగంటే, తల్లీకూతుళ్లిద్దరూ పూల మధ్యలో రోజంతా వెల్లకిలా పడుకుని ఆకాశం వైపు చూస్తుండిపోయారు. ఆ రోజును తలుచుకుంటూ ‘‘ఇద్దరం పక్కపక్కనే గుండెల మీద క్రాస్‌గా చేతులు వేసుకుని చనిపోయినట్లుగా పడుకున్నాం’’ అని నవ్వుతూ చెబుతుంటారు ఎమ్మా.
అతడితో కలిసి నిద్రిస్తున్నాను
షిర్లీ మెక్లైన్కు మనసు విప్పి బాహాటంగా మాట్లాడ్డం అలవాటు. 1984లో ఓ సాయంత్రం బ్రాడ్వే థియేటర్ వేదిక మీద మాట్లాడుతూ ‘‘నా జీవితంలోకి కొత్తగా ప్రవేశంచిన ఒక వ్యక్తి గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. 35 ఏళ్లుగా నేను అతడిని గుట్టుగా ఆరాధిస్తున్నాను. అతడు అన్నిటా అధికుడు. నీతిలో, నిజాయితీలో, సృజనాత్మకతలో! ముఖ్యంగా ఇప్పుడు నేను రోజూ అతడితో నిద్రిస్తున్నాను’’ అని చెప్పారు షిర్లీ. ఆ వెంటనే పియానో వెనుక దాచి ఉంచిన ఆస్కార్ ప్రతిమను చేతిలోకి తీసుకుని గాలిలో ఊపుతూ అతనే ఇతను అని ప్రేక్షకులకు చూపించారు. అంతకు ముందే న్యూయార్క్‌లోని తన అపార్ట్మెంట్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో, ‘‘ఆస్కార్ ప్రతిమను మీరు ఎక్కడ భద్రపరిచారు?’’ అన్న ప్రశ్నకు ‘‘అది నా పడక గదిలో ఉంటుంది’’ అని షిర్లీ చెప్పిన దానిని బట్టి రోజూ ఆవిడ ఆస్కార్‌తో పవళిస్తానని చెప్పిన సంగతి నిజమేననుకోవాలి.
ఆస్కార్ ఖర్చులు
ఆస్కార్‌కు ఒక సినిమా నామినేట్ అవడానికి చిత్ర రచయిత లేదా చిత్ర దర్శకుడికి అయ్యే ఖర్చు 2,00,000 డాలర్లు.
ఆస్కార్‌ను గెలిచేందుకు ఒక ఏడాదిలో హాలీవుడ్ చిత్ర పరిశ్రమ పెట్టే మొత్తం ఖర్చు 150 మిలియన్ డాలర్లు.
ఆస్కార్ వేడుకల వ్యాఖ్యాతకు ఇచ్చే పారితోషికం 15,000 నుంచి 25,000 డాలర్లు.
ఆస్కార్ వేడుకలకు హాజరయ్యే నటీమణుల ముస్తాబుకు అయ్యే ఖర్చు 5,000 నుంచి 11,000 డాలర్లు.
ఒక ఆస్కార్ గౌను కుట్టడానికి అయ్యే ఖర్చు 4,000 నుంచి 6,000 డాలర్లు. (ఈ ఖర్చును ఆస్కార్ స్డుడియోవారే భరిస్తారు).
ఆస్కార్ వేడుకలలో గాయనీమణులకు ఇచ్చే పారితోషికం 14,000 డాలర్లకు పైగానే.
ఆస్కార్ వేదిక వరకు పరిచే రెడ్ కార్పెట్ తయారీ ఖర్చు 25,000 డాలర్లు (చదరపు అడుగుకు 1.50 డాలర్లు)
ఆస్కార్ అకాడమీ సభ్యులకు సినిమాలు వేసి చూపించడానికి అయ్యే ఖర్చు 2,50,000 డాలర్లకు పైగానే.
ఆస్కార్‌కు నామినేట్ అయినవారి భోజనాల ఖర్చు 2,50,000 డాలర్లు.
ఆస్కార్ ట్రోఫీ తయారీకి అయ్యే ఖర్చు ఒక్కింటికి 400 డాలర్లు.
ఆస్కార్‌కు నామినేట్ అయిన చిత్రాలను లాస్ఏంజిల్స్, న్యూయార్క్, లండన్లలో ప్రదర్శిస్తారు.
ఆస్కార్‌కు నామినేట్ అయిన వారికి ‘ఆస్కార్ నామినీ’ అని రాసి ఉన్న స్వెటర్‌ను అందిస్తారు.
మరికొన్ని ఆస్కార్ విశేషాలు
ఆస్కార్లు మొదలైన తొలి ఏడాది (1929) బెస్ట్ ఆర్టిస్టిక్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్, బెస్ట్ టైటిల్ రైటింగ్ (మూకీ సినిమాలకు), బెస్ట్ కామెడీ డెరైక్షన్ విభాగాలకు కూడా అవార్డు ప్రదానం చేశారు. తర్వాతి ఏడాది నుంచి ఈ విభాగాలను తొలగించారు.
అతి చిన్న వయసు ఆస్కార్ విజేత టాటమ్ ఓ నీల్. పదేళ్ల వయసులో ఈ అమ్మాయి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు గెలుచుకుంది. చిత్రం : పేపర్ మూన్ (1973). అతి చిన్న వయసులో ఆస్కార్ నామినేషన్ పొందింది మాత్రం జస్టిన్ హెన్రీ. 1979 నాటి ఓట్చఝ్ఛట గట ఓట్చఝ్ఛట చిత్రంతో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా ఇతడు నామినేట్ అయ్యాడు. అప్పటికి అతడి వయసు 8 ఏళ్లు.
ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డు పొందిన సినిమాల నిడివి సుదీర్ఘంగా ఉంటుంది. వాటిల్లో మరీ మూడున్నర గంటల పాటు సాగే సినిమాలు: Gone with the wind, Law-rence of Arabia, BenHur.
తొలి ఆస్కార్ ఉత్తమ నటుడు ఎమిల్ జేనింగ్స్ ఆస్కార్ వేడుకలకు (1927-28 అవార్డులు) హాజరు కాకుండానే ట్రోఫీని అందుకున్నారు! అత్యవసరంగా ఆయన తన జన్మస్థలం జర్మనీకి వెళ్లవలసిరావడంతో అవార్డు ప్రదానోత్సవానికి ముందే నిర్వాహకులు ట్రోఫీని అందజేశారు.
మరణానంతరం కూడా కొంతమంది సినీ కళాకారులు ఆస్కార్‌కు నామినేట్ అయ్యారు. అలా ఆస్కార్ చరిత్రలో తొలిసారిగా నామినేట్ అయ్యి, అవార్డు పొందిన వ్యక్తి సిడ్నీ హోవార్డ్. ‘గాన్ విత్ ద విండ్’ (1939) స్క్రీన్ రైటర్ ఆయన.
ఆస్కార్ అవార్డును తిరస్కరించిన తొలి వ్యక్తి డూడ్లీ నికోల్స్. ‘ది ఇన్ఫార్మర్’ (1935) చిత్రంలో ఆయన స్క్రీన్‌ప్లేకు అవార్డు వచ్చింది. అకాడెమీకి, రైటర్స్ గిల్డ్‌కు మధ్య ఉన్న వివాదాల కారణంగా అవార్డు తీసుకోడానికి నిరాకరించారు నికోల్స్.
మేరీ పిక్‌ఫోర్డ్... ఆస్కార్ అవార్డుల వ్యవస్థాపక సభ్యురాలు. ఆమె మొదటి భర్త డగ్లాస్ ఫెయిర్‌బ్యాంక్స్ ఆ అకాడమీకి తొలి అధ్యక్షుడు. అయినప్పటికీ 1960 ఆస్కార్ ఓటింగులో మేరీ పాల్గొనలేదు! ‘‘ఓటింగుకు నేను అర్హురాలిని కాదు. ఎందుకంటే నేను సినిమాలను చూడ్డం ఎప్పుడో మానేశాను’’ అని అన్నారావిడ!
మేరీ ఎలిజబెత్ మేస్ట్రాంటినో అనే ఆవిడకు ఆస్కార్ అవార్డు రాలేదు కానీ, ఆస్కార్‌కు సంబంధించిన రికార్డును తనకు తెలియకుండానే ఆమె సాధించారు. ఆస్కార్‌కు నామినేట్ అయిన వందలాది నటులు, నటీమణులలో అందరికన్నా పొడవైన పేరు తనదేనని మేస్ట్రాంటినోకు ఆ తర్వాత ఎవరో చెప్పి సంతోషపరిచారు.
బటర్ ఫ్లైయ్స్ ఆర్ ఫ్రీ చిత్రంలో మిస్ట్రెస్ బేకర్ పాత్రను పోషించిన ఎలీన్ హెకార్ట్కి 1972లో ఆస్కార్ అవార్డు వచ్చింది. మర్నాడు ఆమె ఎప్పటిలా తనకు రావలసిన చెక్కు కోసం స్థానిక నిరుద్యోగ కార్యాలయానికి వెళ్లారు. ఇక చూడండి. ఆఫీస్ ఆఫీసంతా లేచి నిలబడి చప్పట్లతో ఎలీన్కు స్వాగతం పలికారు!
1942లో ఆస్కార్ భోజనశాల ఆహ్వానితులలో చైనా రాయబారి డాక్టర్ హు ష్యీ కూడా ఉన్నారు. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సిసెల్ డిమిలే డాక్టర్ హు ష్యీని ఉద్దేశించి మాట్లాడుతూ పొరపాటున ‘‘గౌరవనీయులైన జపాన్ రాయబారి’’ అని, వెంటనే నాలుక కరుచుకున్నారు. అప్పటికే హాలంతా గంభీరమైన నిశ్శబ్ధం అలుముకుంది. జపాన్ దురాక్రమణదారులతో చైనా పోరాడుతున్న రోజులవి!
‘షేక్స్పియర్ ఇన్ లవ్’ చిత్రానికి 1999లో ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డును అందుకుంటూ గ్వినెత్ పాల్ట్రో ఆనందభరితమై ఉద్వేగంతో కంటతడి ప్రసంగం చేశారు. ఆ రోజును జ్ఞప్తికి తెచ్చుకుంటూ ‘‘అలా ఎందుకయిందో తెలియదు. ఆ క్షణంలో నన్ను చూస్తూ కోట్లాది మంది ప్రజలు చూస్తుంటే కుదురుగా నిలబడలేకపోయాను. జ్వరం వచ్చినట్లయింది’’ అన్నారు.
ఆస్కార్ నటి సుసాన్ సారాండాన్ ఆమె సహజీవన ప్రియుడు టిమ్ రాబిన్స్, వారి పిల్లలు ఈవా (13), జాక్ (9), మైల్స్ (6) మిలీనియం వేడుకలను ఎక్కడ జరుపుకున్నారనుకున్నారో తెలుసా? వారి బాత్రూమ్లో. అక్కడ ఉన్న షోకేస్‌లో ఆస్కార్ సహా వారికి వచ్చిన అవార్డులన్నీ కొలువుతీరి ఉంటాయి.
1943లో గ్రీర్ గార్సన్కు మిస్ట్రెస్ మినివర్ చిత్రం ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డు తెచ్చిపెట్టింది. అవార్డు అందుకున్నాక స్వీకార ప్రసంగం (యాక్సెప్టెన్స్ స్పీచ్) చెయ్యాలి కదా. అర్ధరాత్రి మొదలైన గార్సన్ ప్రసంగం ఏకధాటిగా ఐదున్నర గంటల పాటు కొనసాగింది! ఆస్కార్ చరిత్రలో అంత సుదీర్ఘమైన ప్రసంగం ఇప్పటి వరకు లేదు.
హాలీవుడ్ మెలోడ్రామా ‘ద బ్యాడ్ అండ్ ద బ్యూటిఫుల్’ చిత్రంలో అనేక సంబంధాలు కలిగి ఉన్న మహిళగా తను వేసిన పాత్రకు 1953లో ఉత్తమ సహాయక నటిగా ఆస్కార్ అవార్డు పొందిన గ్లోరియా గ్రాహమ్ ఒకే ఒక మాటలో తన స్వీకార ప్రసంగాన్ని ముగించారు. ఆ మాట: ‘థ్యాంక్యూ’. ఆస్కార్ చరిత్రలో ఇంతకన్నా చిన్న ప్రసంగం లేదు.