Migraine headaches
-
గర్బవతులకు మైగ్రేన్ వస్తే..
నాకు మైగ్రేన్ ఉంది. తరచుగా వస్తుంటుంది. ఎన్ని మందులు వాడినా పూర్తిగా తగ్గలేదు. ఇప్పుడు నాకు మూడో నెల. ఎలాంటి మందులు వేసుకోవాలి? ఈ టైమ్‌లో మైగ్రేన్ బాధించకుండా ఏం చేయాలి? – టి. స్రవంతి, నాగ్‌పూర్ మైగ్రేన్ సర్వసాధారణమైన తలనొప్పి. మైగ్రేన్ నొప్పి మొదలవడానికి ముందు కొంతమందికి వాంతులు, వికారం, తల తిప్పినట్టవడం వంటివి ఉంటాయి. మీకు అలాంటి లక్షణాలు ఉంటాయా? ఉండవా? మీ మైగ్రేన్ లక్షణాలు ఎలా ఉంటాయి అన్నది ముందు మీరు మీ గైనకాలజిస్ట్‌తో చర్చించండి. దాదాపుగా సగం మందిలో ప్రెగ్నెన్సీలో సమయంలో మైగ్రేన్ తగ్గుతుంది. మందుల అవసరం కూడా తగ్గుతుంది. కానీ ఆల్రెడీ మైగ్రేన్ ఉన్న కొందరిలో హై బీపీ, Pre eclampsia చాన్సెస్ పెరుగుతాయి. ప్రెగ్నెన్సీలో తగినంత విశ్రాంతి, లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవడం, టైమ్‌కి తినడం, యోగా, ధ్యానం లాంటివాటితో తలనొప్పిని తగ్గించుకోవచ్చు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో ఎప్పుడైనా తలనొప్పి మరీ ఎక్కువగా ఉంటే పారసిటమాల్ మాత్రను వేసుకోవచ్చు. రిలాక్సేషన్ టెక్నిక్స్ అయిన మైండ్‌ఫుల్‌నెస్ లాంటివీ తలనొప్పి తగ్గేందుకు దోహదపడతాయి. ప్రెగ్నెన్సీ తొలినాళ్లలో క్రమం తప్పకుండా మెడిటేషన్ చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. ముందుగా.. మీకు దేనివల్ల మైగ్రేన్ పెరుగుతుందో చెక్ చేసుకోండి. ఆ ట్రిగర్ని మేనేజ్ చేస్తే ఎపిసోడ్స్ తగ్గుతాయి. కంటి నిండా నిద్ర చాలా అవసరం. ఎండలో తిరగటం, చీజ్, చాకోలేట్స్ మొదలైనవి కొందరిలో మైగ్రేన్‌ను ట్రిగర్ చేస్తాయి. మైగ్రేన్ ఎక్కువసార్లు వస్తూంటే ఒకసారి న్యూరాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోవాలి. సురక్షితమైన మందుబిళ్లలను అదీ తక్కువ మోతాదులో అదీ తక్కువసార్లు మాత్రమే తీసుకోమని సజెస్ట్ చేస్తారు. కొన్ని మందులు గర్భంలోని శిశువు ఎదుగుదల మీద ప్రభావం చూపిస్తాయి. అందుకే స్పెషలైజ్డ్ కేర్ టీమ్ పర్యవేక్షణలో ఉండాలి. ప్రెగ్నెన్సీ సమయంలో Ergotamine, Ibuprofen లాంటివి అస్సలు ప్రిస్క్రైబ్ చేయరు. తెలియకుండా మందులు వాడకూడదు. హైరిస్క్ కేర్ టీమ్‌ని సంప్రదించాలి. కొన్ని మందుల వల్ల బిడ్డకు పుట్టుకతో లోపాలు ఏర్పడవచ్చు. కొంతమంది ప్రెగ్నెన్సీ కంటే ముందే అధిక మోతాదులో కొన్ని మందులను తీసుకుంటూ ఉండి ఉంటే గర్భం నిర్ధారణ అయిన తర్వాత వాటిని మారుస్తారు. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: పంపాతీరంలో హనుమంతునిచే త్రిశూలరోముడి హతం.. మునులకు ప్రశాంతత) -
ఎంతకీ తలనొప్పి తగ్గడం లేదా?
కొందరిలో తీవ్రమైన తలనొప్పి నెలల తరబడి కనిపిస్తుంది. మందులు వాడితే తగ్గుతుంది తాత్కాలికంగా.. ఆ తర్వాత మళ్లీ వేధిస్తుంటుంది. అసలు ఆ తలనొప్పి కి కారణాలేమిటో తెలుసుకుంటే చికిత్స చేయడం సులభం అవుతుంది. కంటిచూపు సమస్యలు, చెవి, దంతాల సమస్యలు లేనప్పుడు, మెదడు లో కంతులు, ఇతర వికారాల వంటి జబ్బుల గురించి ఆయా పరీక్షల ద్వారా నిర్ధారించుకోవాలి. ఒకవేళ అలాంటివి లేకపోతే కేవలం క్రియాపరమైన మార్పులే తలనొప్పికి కార ణాలవుతాయి. ఉదాహరణకు మైగ్రేన్, మానసిక ఒత్తిడి, అధిక రక్తపోటు మొదలైనవి. నిద్రమామూలుగా పట్టి, మళ్లీ నిద్రలేవగానే వస్తుంటే అది మానసిక ఉద్వేగం, ఆందోళనలవంటి వత్తిడులుగా భావించవచ్చు. బీపీ, షుగర్ వంటి వ్యాధులుంటే ముందు వాటిని నియంత్రణలో పెట్టుకోవాలి. మానసిక ఒత్తిడిలో లక్షణంగా కూడా తలనొప్పి రావచ్చు. వత్తిడికి కారణాలు: ఆర్థిక సంబంధిత, ఉద్యోగపరమైన, కుటుంబపరమైన, సామాజికపరమైన, అత్యాశతో కూడిన వాంఛలకు సంబంధించిన అంశాలుంటాయి. అప్పుడప్పుడు కొన్ని మందుల వల్ల కూడా వత్తిడి అధికమవుతుంది. వీటిని విశ్లేషించి, సహేతుకంగా దూరం చేసుకోవాలి. రోజూ విరేచనం సాఫీగా అయ్యేట్టు చూసుకోవాలి. పులుపు, ఉప్పు, కారం తక్కువగా ఉండే, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. తాజాఫలాలు, గ్రీన్ సలాడ్స్, మొలకెత్తిన దినుసులు తీసుకోవాలి. రోజూ రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనెతో తలకు మృదువుగా మర్దనా చేయాలి. నిపుణుల పర్యవేక్షణలో శరీరానికంతటికీ మసాజ్, ధారాచికిత్స తీసుకోవడం. తేలికపాటి వ్యాయామం, ప్రాణాయామం, ధ్యానం. శ్రావ్యమైన సంగీతం, పాటలు వినడం. లేనిపోని ఆలోచనలకు దూరంగా ఉండడం... ద్వారా తలనొప్పిని దూరం చేసుకోవచ్చు. -
అమ్మో...తల పగిలిపోతోంది !
సాక్షి, గుంటూరు : గుంటూరు అరండల్‌పేటకు చెందిన బీటెక్ విద్యార్థిని రమ్య కొద్దిరోజులుగా తలనొప్పి వల్ల కాలేజీకి వెళ్లలేక ఇంట్లోనే ఉండి పోతోంది. తల్లిదండ్రులు ఆమెను వైద్యుల వద్దకు తీసుకెళ్లి పరీక్షలు చేయించగా మైగ్రేన్ తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. స్మార్ట్ ఫోన్లో అర్ధరాత్రి వరకు ఆన్లైన్ చాటింగ్‌లు చేస్తూ నిద్ర సక్రమంగా పోకపోవడం వల్ల వ్యాధికి గురైనట్లు నిర్ధారణ చేశారు. విజయవాడ చిట్టినగర్‌కు చెందిన కావేరి ఇంట్లో పనులు ఏమీ చేయకుండా తలనొప్పి వల్ల మంచానికే పరిమితమవుతూ ఉండటంతో కుటుంబ సభ్యులు వైద్యుల వద్దకు తీసుకెళ్లగా..మైగ్రేన్ అని నిర్ధారణ చేశారు. వ్యసనాలకు బానిసైన భర్త ఇంట్లోకి నెలవారీ సరుకులు తేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉండటంతో ఆమెలో విపరీతమైన ఆలోచనలు పెరిగిపోయి మైగ్రేన్ తలనొప్పి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఆధునిక జీవనశైలి వల్ల నేడు అధిక సంఖ్యలో యువత మైగ్రేన్ బారిన పడుతున్నారని, ప్రతి రోజూ ఒక్కో వైద్యుడి వద్దకు ఐదుగురు తలనొప్పి బాధితులు వస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. తలనొప్పి, మైగ్రేన్ వారోత్సవాల సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. యువతలోనే అధిక శాతం ఆధునిక జీవన శైలిలో యువతే ఎక్కువగా మైగ్రేన్ బారిన పడుతున్నారని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. కాలేజీ పిల్లలు, 30ఏళ్లలోపు ఉద్యోగాలు చేస్తున్న వారు అధికంగా మానసిక ఒత్తిడికి గురవుతూ మైగ్రేన్ బారిన పడుతున్నారు. ఉద్యోగాలు, చదువులో పోటీతత్వం ఏర్పడి ర్యాంకులు సాధించేందుకు ఒత్తిడికి గురవ్వడం వల్ల తలనొప్పి వస్తోంది. నిద్రలేమి, విచ్చలవిడిగా కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు వినియోగిస్తూ కంటికి సరిపడా నిద్ర లేకుండా ఉండటం వల్ల మైగ్రేన్ బారిన పడుతున్నారు.న్యూరాలజిస్టులు జిల్లాలో 20 మంది ఉండగా ఒక్కో వైద్యుడి వద్దకు ఐదుగురు బాధితులు తలనొప్పితో చికిత్స కోసం వస్తున్నారు. ప్రతి ఏడుగురిలో ఒకరు మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మైగ్రేన్ తలనొప్పికి కారణాలు మైగ్రేన్ ( పార్శ్వపు) తలనొప్పి వచ్చిన వారికి ప్రత్యక్ష నరకం కనిపిస్తుంది. ఇది చాలా వరకు తలకు ఒక పక్క మాత్రమే వస్తుంది. తలలో రక్తనాళాలు ఒత్తిడికి గురై వాయడం వల్ల వస్తుంది. కొన్నిసార్లు తలలో రెండు వైపులా ఈ నొప్పి వస్తుంది. తలలో కొట్టుకుంటున్నట్లుగా, నొప్పి వస్తూ పోతూ ఉన్నట్లుగా, తగ్గుతూ ... తీవ్రమవుతూ ఉన్నట్లుగా ఉంటుంది. కొందరికి వాంతులు అవుతాయి. మానసిక ఆందోళన, ఒత్తిడికి గురవ్వడం, అనవసరపు ఆలోచనలు, జరిగిపోయిన విషయాలను తరచుగా ఆలోచించడం వల్ల తలనొప్పి వస్తుంది. ఎండలో ఎక్కువగా తిరిగినా, ప్రయాణాలు ఎక్కువ చేసినా, భోజనం చేయడం ఆలస్యమైనా, అసలు భోజనం చేయకపోయినా, నిద్ర తక్కువైనా , ఎక్కువైనా తలనొప్పి రావొచ్చు. స్త్రీలలో హోర్మోన్ల సమస్యలు ఏర్పడినప్పుడు, రుతుక్రమం ముందు గానీ, తర్వాత గానీ వచ్చే అవకాశం ఉంది. గర్భధారణ సమయంలో, స్త్రీలలో రుతుచక్రం ఆగిపోయినప్పుడు సమస్య తీవ్రతరమవుతుంది. పార్శ్వనొప్పి జన్యుపరమైన సమస్య. వంశంలో ఒకరికి ఉంటే వేరొకరికి వచ్చే అవకాశం ఉంది. మగవాళ్ల కంటే స్త్రీలలో బాధితులు ఎక్కువ. లక్షణాలు పార్శ్వనొప్పి వచ్చిన మొదటి దశలో చిరాకు, మానసిక ఆందోళన, డిప్రెషన్, ఆలోచనల్లో మార్పు రావడం, వాసన, వెలుతురు పడకపోవటం, మెడనొప్పి ఉంటాయి. రెండో దశలో చూపు మందగించడం, జిగ్‌జాగ్ లైన్స్ కనిపించడం, తలలో సూదులు గుచ్చిన భావన కలుగుతుంది. మాటలు తడబడటం, కాళ్లలో నీరసం ఉంటాయి. మూడో దశలో తలనొప్పి రెండు గంటల నుంచి మూడు రోజులపాటు ఉండొచ్చు. వాంతులు ఉంటాయి. నొప్పి ఒక వైపు ఉంటుంది. కాంతిని చూసినా, శబ్దాలు విన్నా చికాకు పుడుతుంది. నాలుగో దశలో తలనొప్పి తగ్గిన తర్వాత కొద్ది రోజుల వరకు తల భారంగా అనిపిస్తుంది. ఒళ్లంతా నీరసంగా, నిరాసక్తంగా అనిపిస్తుంది. వ్యాధి నిర్ధారణ రక్త పరీక్షలు, బీపీ, ఈఈజీ, సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా వ్యాధి నిర్ధారణ చేస్తారు. మైగ్రేన్‌ను నియంత్రణలో పెట్టడం ద్వారా కొన్నాళ్లకు అదే తగ్గిపోతుంది. కానీ కొంత కాలం తర్వాత తిరిగి రావచ్చు. నెలకు రెండుసార్లు కంటే ఎక్కువగా తలనొప్పి వస్తున్నా, ఒక్కసారే వచ్చి ఎక్కువసేపు ఉంటున్నా ప్రత్యేక మందులు తీసుకోవాలి. జాగ్రత్తలు పాటించాలి మానసిక ఒత్తిడికి గురికాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అతిగా ఆలోచనలు చేయవద్దు. తలనొప్పి వచ్చినప్పుడు ప్రశాంత వాతావరణంలో, కాంతిలేని చోట, నిశ్శబ్దంగా ఉన్న చోట నిదురించాలి. ధ్యానం, యోగా, ప్రాణాయామం చేయాలి. తలనొప్పి వస్తుంటే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఎలాంటి తలనొప్పో నిర్ధారణ చేయించుకుని మందులు వాడాలి. – డాక్టర్ చక్కా శివరామకృష్ణ, న్యూరాలజిస్ట్, గుంటూరు -
శస్త్రచికిత్స లేకుండానే మైగ్రేన్ కు చెక్
వాషింగ్టన్ : మైగ్రేన్ తలనొప్పితో బాధపడే చిన్నారులకు ఎలాంటి శస్త్రచికిత్స లేకుండానే దాన్ని తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ నూతన పద్ధతి చాలా సురక్షితమైందని, ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని తాజా అధ్యయనంలో తేలింది. స్పెనోపాలటైన్ గాంగ్లియన్ గా పిలిచే ఈ పద్ధతిలో ఎటువంటి సూదుల అవసరం ఉండదని, సూదులకు బదులుగా చిన్నపాటి గొట్టాన్ని నాసికా రంధ్రాలకు జతచేసి చికిత్సను అందిస్తారు. ముక్కు వెనక భాగంలో ఉండే నరాలు మైగ్రేన్ నొప్పిని తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయని చెప్పారు. 12 ఏళ్లు దాటిన యువకులు, పెద్దల్లో 12 శాతం మంది మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నారని ఈ అధ్యయనం చెబుతోంది. యుక్తవయసులో ఉన్న వారి మైగ్రేన్ వల్ల రోజువారీ కార్యకలాపాలైన ఆటలు ఆడటం, పాఠశాలకు వెళ్లలేకపోవడం, సంగీతాన్ని ఆస్వాదించలేకపోవడం వంటివి జరుగుతున్నాయని తెలిపారు. -
మెనోపాజ్‌కు ముందు ఇదో ‘తలనొప్పి’!
సాధారణంగా టీనేజ్ దాటి వయసు పెరుగుతుంటే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంటుంది. కానీ మెనోపాజ్‌కు చేరువైన కొద్దీ మైగ్రేన్ తలనొప్పి పెరుగుతుంటుందని ఇటీవలి కొన్ని అధ్యయనాల్లో తేలింది. గత కొన్నేళ్లుగా తమకు మైగ్రేన్ తలనొప్పి పెరుగుతోందని మహిళల నుంచి డాక్టర్లకు ఎక్కువగా కంప్లెయింట్స్ వస్తున్నాయి. అయితే మెనోపాజ్‌కు చేరువవుతున్న కొద్దీ తలనొప్పి పెరగడంతో పాటు నెలలో పది రోజుల వరకూ తలపోటు ఉంటోందట. గతంలో కంటే ఈ తరహా కేసులు దాదాపు 60 శాతం పెరిగాయని ‘హెడేక్ : ద జర్నల్ ఆఫ్ హెడ్ అండ్ ఫేస్ పెయిన్స్’ అనే జర్నల్‌లో ప్రచురితమైంది. రుతుస్రావం ఆగడానికి ముందుగా ఉండే ‘పెరీమెనోపాజ్’ సమయంలో ఈ తలనొప్పులు మరింత ఎక్కువవుతున్నాయని ఈ అధ్యయనం పేర్కొంది. -
మైగ్రేన్ తలనొప్పి.. అశ్రద్ధ చేయొద్దు..
తరచుగా తలనొప్పి వస్తే అశ్రద్ధ చేయకూడదు. రక్తపోటు, మెదడులో కణితులు, రక్త ప్రసరణలో మార్పులు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి వల్ల తల నొప్పి వచ్చే అవకాశం ఉంది. మైగ్రేన్ స్త్రీలలో అధికంగా కనిపిస్తుంది. నొప్పి చాలా వరకు తలకు ఓ పక్క భాగంలో ఉంటుంది. మైగ్రేన్ రావడానికి కారణం... తలోని రక్తనాళాలు ఒత్తిడికి లోనై వాయడం. పార్శ్వపు తలనొప్పికి కారణాలు: పార్శ్వపు తలనొప్పి ముఖ్యకారణం మానసిక ఆందోళన, మానసిక ఒత్తిడి. కొంత మందికి బయటకు వెళ్లినప్పుడు, సూర్యరశ్మి ద్వారా తలనొప్పి వస్తుంది. అధికంగా ప్రయాణాలు చేయడం. స్త్రీలలో హార్మోన్ల సమస్యలు ఏర్పడినప్పుడు, రుతుచక్రం ముందుగా గానీ, తరువాత గానీ వచ్చే అవకాశం ఉంటుంది. గర్భధారణ సమయం, రుతుచక్రం ఆగిపోయినప్పుడు ఈ సమస్య తీవ్రంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ లాంటి కొన్ని రకాల మందులు వాడటం వల్ల ఎక్కువగా వస్తుంది. మైగ్రేన్ దశలు - లక్షణాలు: చాలా వరకు మైగ్రేన్ దానంతటదే తగ్గిపోతుంది. సాధారణంగా 24 గంటల నుంచి 72 గంటలు కూడా పట్టవచ్చు. ఒకవేళ నొప్పి 72 గంటలు ఉంటే స్టేటస్ మైగ్రేన్ అంటారు. మైగ్రేన్ నొప్పి 4 దశలలో సాగుతుంది. పోడ్రోమ్ ఫేజ్: ఇది నొప్పికి ముందు 2 గంటల నుంచి 2 రోజుల ముందు వరకు జరిగే ప్రక్రియల సమూహం. ఈ దశలో చిరాకు, మానసిక ఆందోళన, డిప్రేషన్, ఆలోచనలో మార్పులు రావడం, వాసన, వెలుతురు పడకపోవడం, మెడనొప్పి ఉంటాయి. ఆరాఫేజ్: ఈ దశ నొప్పి మొదలయ్యే కొద్ది నిమిషాల ముందు ఉంటుంది. చూపు కాస్త మందగించినట్లుండటం, జిగ్‌జాగ్ లైన్స రావడం, తలలో సూదులతో గుచ్చినట్లు ఉండడం, మాటలు తడబడడం, కాళ్లలో నీరసం ఉంటాయి. నొప్పి దశ: ఈ నొప్పి దశ 2 గంటల నుంచి 3 రోజుల వరకు ఉండవచ్చు. ఈ దశలో వాంతులు ఉంటాయి. పోస్ట్‌డ్రోమ్ ఫేజ్: నొప్పి తగ్గిన తరువాత కొద్ది రోజుల వరకు తల భారంగా ఉండటం, నీరసంగా ఉండటం, శ్రద్ధ లేకుండా ఉండటం జరుగుతుంది. వ్యాధి నిర్ధారణ: రక్త పరీక్షలు - సీబీపీ, ఈఎస్ఆర్ రక్తపోటును గమనించడం ఈఈజీ పరీక్ష సీటీ స్కాన్ (మెదడు) ఎంఆర్ఐ మెదడు పరీక్షలు ఉపకరిస్తాయి మైగ్రేన్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మానసిక ఆందోళనలు తగ్గించుకోవాలి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. దీనికోసం యోగా, ప్రాణాయామం చేయాలి. ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. తలకు నూనెతో మసాజ్ చేసుకోవాలి. తలలోని నరాలు రిలాక్సవుతాయి. తలనొప్పి వచ్చినప్పుడు ప్రశాంత వాతావరణంలో, లైటు తీసేసి, నిశ్శబ్దంగా ఉన్నచోట పడుకోబెట్టాలి. హోమియో వైద్యం: మైగ్రేన్ తలనొప్పికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. ఘాటైన వాసనలు పీల్చినప్పుడు తలనొప్పి వస్తే బెల్లడోనా, లైకోపోడియం, ఇగ్నీషియా ఇవ్వాలి. తరుచూ అధికంగా తలనొప్పి వస్తుంటే నేట్రంమూర్, సాంగ్యునేరియా, చైనా, సెపియా ఇవ్వాలి. గర్భవతుల్లో తలనొప్పి వస్తే బెల్లడోనా, నక్స్‌వామికా, సెపియా ఇవ్వాలి. ఎక్కువగా చదవడం వల్ల నొప్పి వస్తే ఇగ్నీషియా, సెపియా, కాక్యులస్, కాలికార్భ ఇవ్వాలి. స్కూల్‌కు వెళ్ళే ఆడపిల్లల్లో వస్తే కాల్కేరియా ఫాస్, నేట్రంమూర్, పల్సటిల్లా ఇవ్వాలి. ఈ మందులు అవగాహనకు మాత్రమే. మందులను నిష్ణాతులైన హోమియో వైద్యుని సంప్రదించి మాత్రమే తీసుకోవాలి. డాక్టర్ మురళీ అంకిరెడ్డి, ఎం.డి హోమియో, స్టార్ హోమియోపతి సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, నేరేడ్మెట్, వైజాగ్, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, హన్మకొండ మరియు కర్ణాటక అంతటా... ఫోన్: 7416 102 102, www.starhomeo.com