ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, గుంటూరు : గుంటూరు అరండల్‌పేటకు చెందిన బీటెక్ విద్యార్థిని రమ్య కొద్దిరోజులుగా తలనొప్పి వల్ల కాలేజీకి వెళ్లలేక ఇంట్లోనే ఉండి పోతోంది. తల్లిదండ్రులు ఆమెను వైద్యుల వద్దకు తీసుకెళ్లి పరీక్షలు చేయించగా మైగ్రేన్ తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. స్మార్ట్ ఫోన్‌లో అర్ధరాత్రి వరకు ఆన్‌లైన్ చాటింగ్‌లు చేస్తూ నిద్ర సక్రమంగా పోకపోవడం వల్ల వ్యాధికి గురైనట్లు నిర్ధారణ చేశారు. విజయవాడ చిట్టినగర్‌కు చెందిన కావేరి ఇంట్లో పనులు ఏమీ చేయకుండా తలనొప్పి వల్ల మంచానికే పరిమితమవుతూ ఉండటంతో కుటుంబ సభ్యులు వైద్యుల వద్దకు తీసుకెళ్లగా..మైగ్రేన్ అని నిర్ధారణ చేశారు. వ్యసనాలకు బానిసైన భర్త ఇంట్లోకి నెలవారీ సరుకులు తేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉండటంతో ఆమెలో విపరీతమైన ఆలోచనలు పెరిగిపోయి మైగ్రేన్ తలనొప్పి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఆధునిక జీవనశైలి వల్ల నేడు అధిక సంఖ్యలో యువత మైగ్రేన్ బారిన పడుతున్నారని, ప్రతి రోజూ ఒక్కో వైద్యుడి వద్దకు ఐదుగురు తలనొప్పి బాధితులు వస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. తలనొప్పి, మైగ్రేన్ వారోత్సవాల సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం.
యువతలోనే అధిక శాతం
ఆధునిక జీవన శైలిలో యువతే ఎక్కువగా మైగ్రేన్ బారిన పడుతున్నారని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. కాలేజీ పిల్లలు, 30ఏళ్లలోపు ఉద్యోగాలు చేస్తున్న వారు అధికంగా మానసిక ఒత్తిడికి గురవుతూ మైగ్రేన్ బారిన పడుతున్నారు. ఉద్యోగాలు, చదువులో పోటీతత్వం ఏర్పడి ర్యాంకులు సాధించేందుకు ఒత్తిడికి గురవ్వడం వల్ల తలనొప్పి వస్తోంది. నిద్రలేమి, విచ్చలవిడిగా కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు వినియోగిస్తూ కంటికి సరిపడా నిద్ర లేకుండా ఉండటం వల్ల మైగ్రేన్ బారిన పడుతున్నారు.న్యూరాలజిస్టులు జిల్లాలో 20 మంది ఉండగా ఒక్కో వైద్యుడి వద్దకు ఐదుగురు బాధితులు తలనొప్పితో చికిత్స కోసం వస్తున్నారు. ప్రతి ఏడుగురిలో ఒకరు మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
మైగ్రేన్ తలనొప్పికి కారణాలు
మైగ్రేన్ ( పార్శ్వపు) తలనొప్పి వచ్చిన వారికి ప్రత్యక్ష నరకం కనిపిస్తుంది. ఇది చాలా వరకు తలకు ఒక పక్క మాత్రమే వస్తుంది. తలలో రక్తనాళాలు ఒత్తిడికి గురై వాయడం వల్ల వస్తుంది. కొన్నిసార్లు తలలో రెండు వైపులా ఈ నొప్పి వస్తుంది. తలలో కొట్టుకుంటున్నట్లుగా, నొప్పి వస్తూ పోతూ ఉన్నట్లుగా, తగ్గుతూ ... తీవ్రమవుతూ ఉన్నట్లుగా ఉంటుంది. కొందరికి వాంతులు అవుతాయి. మానసిక ఆందోళన, ఒత్తిడికి గురవ్వడం, అనవసరపు ఆలోచనలు, జరిగిపోయిన విషయాలను తరచుగా ఆలోచించడం వల్ల తలనొప్పి వస్తుంది. ఎండలో ఎక్కువగా తిరిగినా, ప్రయాణాలు ఎక్కువ చేసినా, భోజనం చేయడం ఆలస్యమైనా, అసలు భోజనం చేయకపోయినా, నిద్ర తక్కువైనా , ఎక్కువైనా తలనొప్పి రావొచ్చు. స్త్రీలలో హోర్మోన్ల సమస్యలు ఏర్పడినప్పుడు, రుతుక్రమం ముందు గానీ, తర్వాత గానీ వచ్చే అవకాశం ఉంది. గర్భధారణ సమయంలో, స్త్రీలలో రుతుచక్రం ఆగిపోయినప్పుడు సమస్య తీవ్రతరమవుతుంది. పార్శ్వనొప్పి జన్యుపరమైన సమస్య. వంశంలో ఒకరికి ఉంటే వేరొకరికి వచ్చే అవకాశం ఉంది. మగవాళ్ల కంటే స్త్రీలలో బాధితులు ఎక్కువ.
లక్షణాలు
పార్శ్వనొప్పి వచ్చిన మొదటి దశలో చిరాకు, మానసిక ఆందోళన, డిప్రెషన్, ఆలోచనల్లో మార్పు రావడం, వాసన, వెలుతురు పడకపోవటం, మెడనొప్పి ఉంటాయి. రెండో దశలో చూపు మందగించడం, జిగ్‌జాగ్ లైన్స్ కనిపించడం, తలలో సూదులు గుచ్చిన భావన కలుగుతుంది. మాటలు తడబడటం, కాళ్లలో నీరసం ఉంటాయి. మూడో దశలో తలనొప్పి రెండు గంటల నుంచి మూడు రోజులపాటు ఉండొచ్చు. వాంతులు ఉంటాయి. నొప్పి ఒక వైపు ఉంటుంది. కాంతిని చూసినా, శబ్దాలు విన్నా చికాకు పుడుతుంది. నాలుగో దశలో తలనొప్పి తగ్గిన తర్వాత కొద్ది రోజుల వరకు తల భారంగా అనిపిస్తుంది. ఒళ్లంతా నీరసంగా, నిరాసక్తంగా అనిపిస్తుంది.
వ్యాధి నిర్ధారణ
రక్త పరీక్షలు, బీపీ, ఈఈజీ, సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ స్కానింగ్ ద్వారా వ్యాధి నిర్ధారణ చేస్తారు. మైగ్రేన్‌ను నియంత్రణలో పెట్టడం ద్వారా కొన్నాళ్లకు అదే తగ్గిపోతుంది. కానీ కొంత కాలం తర్వాత తిరిగి రావచ్చు. నెలకు రెండుసార్లు కంటే ఎక్కువగా తలనొప్పి వస్తున్నా, ఒక్కసారే వచ్చి ఎక్కువసేపు ఉంటున్నా ప్రత్యేక మందులు తీసుకోవాలి.
జాగ్రత్తలు పాటించాలి
మానసిక ఒత్తిడికి గురికాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అతిగా ఆలోచనలు చేయవద్దు. తలనొప్పి వచ్చినప్పుడు ప్రశాంత వాతావరణంలో, కాంతిలేని చోట, నిశ్శబ్దంగా ఉన్న చోట నిదురించాలి. ధ్యానం, యోగా, ప్రాణాయామం చేయాలి. తలనొప్పి వస్తుంటే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఎలాంటి తలనొప్పో నిర్ధారణ చేయించుకుని మందులు వాడాలి.
– డాక్టర్ చక్కా శివరామకృష్ణ, న్యూరాలజిస్ట్, గుంటూరు
Comments
Please login to add a commentAdd a comment