military budget
-
మరింత శక్తివంతంగా చైనా సైన్యం
బీజింగ్: భారత్, తైవాన్లతో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా తన సైనిక శక్తిని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకుంది. అందులోభాగంగా రక్షణ బడ్జెట్‌ను వరసగా ఎనిమిదోసారి పెంచింది. దీంతో చైనా రక్షణ బడ్జెట్ గత ఏడాదితో పోలిస్తే 7.2 శాతం ఎగసి 1.55 ట్రిలియన్ యువాన్లకు చేరుకుంది. గత ఏడాది 1.45 ట్రిలియన్ యువాన్లు కేటాయించింది. డాలర్లలో చూస్తే గత కేటాయింపులు 230 బిలియన్ డాలర్లుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈసారి డాలర్‌తో యువాన్ మారకం విలువ తగ్గడంతో కేటాయింపులు గతంతో పోలిస్తే కాస్త తక్కువగా 225 బిలియన్ డాలర్లుగా నమోదవడం గమనార్హం. బడ్జెట్ వివరాలను ఆదివారం దేశ పార్లమెంట్(నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్–ఎన్సీపీ)లో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆ దేశ ప్రధాని లీ కెక్వియాంగ్ సరిహద్దులో సైన్యం విజయాలను గుర్తుచేశారు. ‘ సరిహద్దుల్లో ఆపరేషన్లు విజయవంతమయ్యాయి. సరిహద్దు రక్షణ, ప్రాదేశిక సముద్రజలాలపై హక్కుల పరిరక్షణ, కోవిడ్ సంక్షోభం వంటి వాటిని విజయవంతంగా ఎదుర్కొన్నాం’ అంటూ పరోక్షంగా తూర్పు లద్దాఖ్‌ను ప్రస్తావించారు. ‘ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ శతాబ్ది ఉత్సవాల నాటికి పెట్టుకున్న లక్ష్యాలను పూర్తిచేసేలా సైనిక చర్యలను చేపట్టాలి’ అని ఆర్మీనుద్దేశించి అన్నారు. దక్షిణ, తూర్పు సముద్ర జల్లాలపై పూర్తి హక్కులు తమకే దక్కుతాయని వాదిస్తూ పొరుగు దేశాలతో చైనా ఘర్షణలకు దిగడం తెల్సిందే. వియత్నాం, మలేసియా, ఫిలిప్పీన్స్, తైవాన్, జపాన్‌లతో చైనా తగవులకు దిగుతోంది. ఈ ఆర్థికసంవత్సరంలో భారత రక్షణ బడ్జెట్ కేటాయింపులు 72 బిలియన్ డాలర్లుకావడం గమనార్హం. -
ప్రపంచ మిలటరీ బడ్జెట్.. 2,00,000 కోట్ల పైనే
(ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి) ప్రపంచంలో స్వీయ రక్షణ కోసం వివిధ దేశాలు చేస్తున్న వ్యయం ఏటా పెరుగుతోంది. ఆధునిక యుగంలోనూ మిలటరీ వ్యయం గణనీయంగా పెరుగుతోంది. ప్రపంచ దేశాల రక్షణ బడ్జెట్ 2.1 లక్షల కోట్ల డాలర్లకు చేరిందని స్వీడన్ కేంద్రంగా పనిచేస్తున్న ‘స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ నివేదిక వెల్లడించింది. 1949 నుంచి వివిధ దేశాల మిలటరీ బడ్జెట్లను విశ్లేషిస్తూ ఈ సంస్థ ఏటా నివేదికలు వెలువరిస్తోంది. మిలటరీ వ్యయం అంటే కేవలం సైన్యాన్ని పోషించడం, మందుగుండు సామగ్రిని సమకూర్చుకోవడమే కాదు.. పరిశోధన–అభివృద్ధి వ్యయం కూడా భాగమే. ప్రపంచ మిలటరీ బడ్జెట్ గత ఏడేళ్లుగా పెరుగుతూ 2021–22 ఆర్థిక సంవత్సరానికి 2.1 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇందులో అమెరికా వాటా దాదాపు 38 శాతం. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఈ దేశం 80 వేల కోట్ల డాలర్లు ఖర్చుచేసింది. 29.3 వేల కోట్ల డాలర్లు వ్యయం చేసిన చైనా రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచ దేశాల మొత్తం మిలటరీ వ్యయంలో చైనా వాటా దాదాపు 14 శాతం. అలాగే, అమెరికా, చైనా దేశాల మిలటరీ వ్యయం.. మొత్తం ప్రపంచ దేశాల మిలటరీ వ్యయం కంటే కాస్త ఎక్కువే. చైనా రక్షణ బడ్జెట్ భారీగా పెంపు మిలటరీ బడ్జెన్‌ను గత దశాబ్ద కాలంలో గణనీయంగా పెంచుతున్న దేశం చైనా. 2012లో చేసిన వ్యయంతో పోలిస్తే 2021లో పెట్టిన ఖర్చు రెట్టింపు అయింది. గత 27 ఏళ్లుగా చైనా తన రక్షణ బడ్జెట్‌ను పెంచుకుంటూ పోతోంది. ► అమెరికా ఒక్క దేశం చేస్తున్న రక్షణ వ్యయాన్ని పరిశీలిస్తే.. టాప్–10 దేశాల జాబితాలోని మిగతా 9 దేశాల మొత్తం మిలటరీ వ్యయం కంటే ఈ దేశానిది ఎక్కువే. అలాగే.. ► సౌదీ అరేబియా తన మొత్తం జీడీపీలో 6.6 శాతం ఖర్చుచేస్తోంది. రష్యా 4.1 శాతం వ్యయం చేస్తోంది. ► ఇక 7.66 వేల కోట్ల డాలర్ల వ్యయంతో మన దేశం మూడో స్థానంలో నిలిచింది. ప్రపంచ మిలటరీ వ్యయంలో భారత్ మిలటరీ వ్యయం 3.6 శాతం. ► తర్వాత స్థానంలో ఉన్న యూకే 3.2 శాతం వాటాతో 6.84 వేల కోట్ల డాలర్ల వ్యయం చేసింది. ► 5వ స్థానం రష్యాది. ఈ దేశం 3.1 శాతం వాటాతో 6.59 వేల కోట్ల డాలర్లు సైన్యానికి ఖర్చుచేసింది. ► ఆరో స్థానంలో ఉన్న ఫ్రాన్స్ 2.7 శాతం వాటాతో 5.66 వేల కోట్ల డాలర్లు ఖర్చుపెట్టింది. ► ఏడో స్థానంలో ఉన్న జర్మనీ కూడా దాదాపు ఫ్రాన్స్‌తో సమానంగా ఖర్చు చేసింది. ► 8వ స్థానంలో ఉన్న సౌదీ అరేబియా వెచ్చించింది 5.56 వేల కోట్ల డాలర్లు (2.6 శాతం). ► 9వ స్థానంలో 5.4 వేల కోట్ల డాలర్ల (2.6 శాతం) వ్యయంతో జపాన్ ఉంది. ► ఇక పదో స్థానంలో ఉన్న దక్షిణ కొరియా 5.02 వేల కోట్ల డాలర్లు వ్యయం చేసి ప్రపంచ మిలటరీ వ్యయంలో 2.4 శాతం వాటా దక్కించుకుంది. ఈ 10 దేశాలు మినహా ప్రపంచంలోని మిగతా అన్ని దేశాలు కలిపినా 53.6 వేల కోట్ల డాలర్ల వ్యయంతో వాటి వాటా 25.3 శాతం మాత్రమే. ఆంక్షల మంత్రమే నేటి యుద్ధ తంత్రం ఆధునిక యుగంలో అత్యాధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడం, సైన్యాన్ని పెంచుకోవడమే ఆధునిక యుద్ధ తంత్రం కాదని అగ్రదేశాలు పలుమార్లు నిరూపించాయి. ఆంక్షలు విధించడం, ఎగుమతులు–దిగుమతులను నియంత్రించడం, అధిక పన్నులు విధించడం, సరఫరాలు నిలిపివేయడం.. చేస్తున్నాయి. ఉక్రెయిన్ మీద రష్యా దండెత్తినప్పుడు.. రష్యా మీద పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. రష్యా నుంచి చమురు కొనవద్దని మన దేశం మీద కూడా ఒత్తిళ్లు వచ్చాయి. ఇక దేశ భద్రతలో సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు కీలకపాత్ర పోషిస్తోంది. మిలటరీ కంప్యూటర్ వ్యవస్థల భద్రతకు అన్ని దేశాలు ప్రాధాన్యతనిస్తున్నాయి. -
ప్రపంచ సైనిక బడ్జెట్ 2 ట్రిలియన్ డాలర్లు
లండన్: ప్రపంచదేశాలు సైనికపరంగా చేస్తున్న వ్యయం మొట్టమొదటిసారిగా ఏకంగా 2 లక్షల కోట్ల డాలర్లను మించిపోయింది. స్వీడన్‌కు చెందిన సంస్థ స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిప్రి) ఈ మేరకు వెల్లడించింది. ఈ ఖర్చులో అమెరికా, చైనా, భారత్ టాప్ త్రీ స్థానాల్లో ఉన్నట్లు నివేదికలో వెల్లడించింది. ‘‘2021లో ప్రపంచ సైనిక వ్యయం 0.7% పెరిగి 2,113 బిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో 62% వాటా అమెరికా, చైనా, భారత్, యూకే, రష్యాలదే. అమెరికా, చైనా వాటాయే ఏకంగా 52%! 2021లో అమెరికా 801 బిలియన్ డాలర్లు, చైనా 293 బిలియన్ డాలర్లు, భారత్ 76.6 బిలియన్ డాలర్లు రక్షణపై వెచ్చించాయి. ఆసియా–ఓసియానియా ప్రాంత దేశాల సైనిక వ్యయం 586 బిలియన్ డాలర్లు. ఇందులో భారత్–చైనాల వాటాయే ఏకంగా 63%! అయితే ఇది 2020 కంటే 1.4% తక్కువ’’ అని వెల్లడించింది. -
అమెరికా రక్షణ బడ్జెట్ 49 లక్షల కోట్లు
వాషింగ్టన్: రక్షణ రంగంలో భారత్‌తో భాగస్వామ్యం బలోపేతం కావాలని అమెరికా కాంగ్రెస్ కోరింది. అమెరికా కాంగ్రెస్ 2019 సంవత్సరానికి గాను 716 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 49 లక్షల కోట్లు) రక్షణ బడ్జెట్‌ను ఆమోదించింది. ఈ బిల్లు అధ్యక్షుడు ట్రంప్ ఆమోదం పొందాక చట్టంగా రూపుదాల్చనుంది. బిల్లు ప్రకారం..రక్షణశాఖకు చెందిన క్షిపణి వ్యవస్థలతోపాటు వైమానిక, తీర ప్రాంత దళాలను నవీకరించనుంది. ఈ బిల్లు చట్టంగా మారితే శత్రుదేశాలతో ఆయుధ ఒప్పందాలు చేసుకునే దేశాలపై అమెరికా విధించే ఆంక్షల నుంచి భారత్‌కు ఊరట లభించనుంది. భారత్ వంటి ప్రాధాన్య దేశాలను ఆంక్షల నుంచి మినహాయించాలని కాంగ్రెస్ కోరింది. ఇటీవల 4.5 బిలియన్ డాలర్ల విలువైన ఎస్–400 క్షిపణులను రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో అమెరికా కాంగ్రెస్ తీర్మానంతో భారత్‌కు ఊరట లభించినట్లయింది. భారత్‌కు రక్షణ భాగస్వామి హోదా భారత్ సైనిక బలగాలతో వ్యూహాత్మక భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉందని ట్రంప్ యంత్రాంగాన్ని కాంగ్రెస్ కోరింది. ‘ఇండియా, జపాన్, ఆస్ట్రేలియాలతో ప్రాంతీయ భద్రత, రక్షణ అంశాల్లో మైత్రి బలపడాలి. భారత్ రక్షణ సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి, వ్యూహాత్మక కార్యక్రమాలు చేపట్టడానికి వీలుకల్పించే ‘మేజర్ డిఫెన్స్ పార్టనర్’ హోదాను భారత్‌కు ఇచ్చేందుకు గల అవకాశాలను అన్వేషించాలి’ అని పేర్కొంది. పాక్‌కు సాయంలో భారీ కోత అమెరికా తాజా రక్షణ రంగ బడ్జెట్లో పాకిస్తాన్‌కు 150 మిలియన్ డాలర్లు(వెయ్యి కోట్ల రూపాయలు) మాత్రమే ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకారం తెలిపింది. మునుపెన్నడూ కూడా ఇంత తక్కువ సాయాన్ని పాక్ అందుకోలేదు. అయితే, ఈ సాయం అందించినందుకు గాను ఎలాంటి షరతులు, నిబంధనలను విధించలేదు. -
కిల్లర్ రోబోలపై చర్చలు
జెనీవా: మానవ ప్రమేయం లేకుండానే శత్రువుల్ని గుర్తించి హతమార్చే రోబోల వినియోగంపై చర్చించేందుకు, నిబంధనల్ని రూపొందించేందుకు ఐక్యరాజ్యసమితి(ఐరాస)కు చెందిన ఓ కమిటీ శుక్రవారం అంగీకారం తెలిపింది. ఐదు రోజుల పాటు ‘కిల్లర్ రోబో’ల వినియోగంపై సాగిన ఈ సమావేశంలో ఈ రోబోల్ని నిషేధించాలని పలు దేశాలు డిమాండ్ చేశాయి. ఈ రోబోల వినియోగంలో కొంతైనా మానవప్రమేయం ఉండాలన్నాయి. సైనిక బడ్జెట్‌తో పాటు సాంకేతికత తక్కువగా ఉన్న 22 దేశాలు ఈ మేరకు స్పందించాయి. ఈ సమావేశం నిబంధనల రూపకల్పనలో తొలి అడుగు అని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలు యుద్ధ రంగంలో రోబోల వాడకంలో మానవ ప్రమేయం కచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీలో ఆయుధ విభాగం చీఫ్ కత్లీన్ లాల్యాండ్ తెలిపారు. ఈ రోబోలు సామూహిక జనహనన ఆయుధాలని విమర్శించారు. కిల్లర్ రోబోల వినియోగంపై వచ్చే ఏడాది మళ్లీ సమావేశమయ్యేందుకు పలు దేశాలు అంగీకరించాయి. -
భారత్ కంటే చైనా రక్షణ బడ్జెట్ మూడురెట్లు ఎక్కువ
గడిచిన కొన్ని దశాబ్దాలుగా చైనా తన రక్షణ బడ్జెట్‌ను గణనీయంగా పెంచుకుంటూ పోతోంది. ప్రస్తుతం అది భారత రక్షణ బడ్జెట్ కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని అమెరికా నిఘా సంస్థ పెంటగాన్ తెలిపింది. చైనా ఇలా బడ్జెట్ పెంచుకుంటూ పోవడం అమెరికా భద్రతకు కూడా ముప్పుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. అధికారికంగా చూసినా గత సంవత్సరపు చైనా రక్షణ బడ్జెట్ రూ. 8,683 లక్షల కోట్లు కాగా, భారత రక్షణ బడ్జెట్ మాత్రం రూ. 2,434 లక్షల కోట్లేనని పెంటగాన్ తన వార్షిక నివేదికలో తెలిపింది. రక్షణ బడ్జెట్ పెంచుకోవడమే కాదు.. ఆయుధాల ఎగుమతిలో కూడా చైనా ముందే ఉంది. ఆ దేశం నుంచి అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశాల్లో పాకిస్థాన్ ముందుంది. సంప్రదాయ ఆయుధాల కొనుగోలుకు పాకిస్థాన్ ప్రధానంగా చైనామీదే ఆధారపడుతోందని పెంటగాన్ చెప్పింది. రాబోయే ఏళ్లలో చైనా ఆయుధ ఎగుమతులు మరింత పెరుగుతాయని, అక్కడి స్వదేశీ రక్షణ పరిశ్రమ రోజురోజుకూ ఎదుగుతోందని చెబుతున్నారు.