Stockholm International Peace Research Institute World Military Budget - Sakshi
Sakshi News home page

ప్రపంచ మిలటరీ బడ్జెట్‌.. 2,00,000 కోట్ల పైనే

Published Mon, Jan 30 2023 4:04 AM | Last Updated on Mon, Jan 30 2023 9:03 AM

Stockholm International Peace Research Institute World Military Budget - Sakshi

(ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి)
ప్రపంచంలో స్వీయ రక్షణ కోసం వివిధ దేశాలు చేస్తున్న వ్యయం ఏటా పెరుగుతోంది. ఆధునిక యుగంలోనూ మిలటరీ వ్యయం గణనీయంగా పెరుగుతోంది. ప్రపంచ దేశాల రక్షణ బడ్జెట్‌ 2.1 లక్షల కోట్ల డాలర్లకు చేరిందని స్వీడన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ‘స్టాక్‌హోం ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ నివేదిక వెల్లడించింది.

1949 నుంచి వివిధ దేశాల మిలటరీ బడ్జెట్లను విశ్లేషిస్తూ ఈ సంస్థ ఏటా నివేదికలు వెలువరిస్తోంది. మిలటరీ వ్యయం అంటే కేవలం సైన్యాన్ని పోషించడం, మందుగుండు సామగ్రిని సమకూర్చుకోవడమే కాదు.. పరిశోధన–అభివృద్ధి వ్యయం కూడా భాగమే. ప్రపంచ మిలటరీ బడ్జెట్‌ గత ఏడేళ్లుగా పెరుగుతూ 2021–22 ఆర్థిక సంవత్సరానికి 2.1 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇందులో అమెరికా వాటా దాదాపు 38 శాతం. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఈ దేశం 80 వేల కోట్ల డాలర్లు ఖర్చుచేసింది. 

29.3 వేల కోట్ల డాలర్లు వ్యయం చేసిన చైనా రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచ దేశాల మొత్తం మిలటరీ వ్యయంలో చైనా వాటా దాదాపు 14 శాతం. అలాగే, అమెరికా, చైనా దేశాల మిలటరీ వ్యయం.. మొత్తం ప్రపంచ దేశాల మిలటరీ వ్యయం కంటే కాస్త ఎక్కువే. 

చైనా రక్షణ బడ్జెట్‌ భారీగా పెంపు
మిలటరీ బడ్జెన్‌ను గత దశాబ్ద కాలంలో గణనీయంగా పెంచుతున్న దేశం చైనా. 2012లో చేసిన వ్యయంతో పోలిస్తే 2021లో పెట్టిన ఖర్చు రెట్టింపు అయింది. గత 27 ఏళ్లుగా చైనా తన రక్షణ బడ్జెట్‌ను పెంచుకుంటూ పోతోంది. 

► అమెరికా ఒక్క దేశం చేస్తున్న రక్షణ వ్యయాన్ని పరిశీలిస్తే.. టాప్‌–10 దేశాల జాబితాలోని మిగతా 9 దేశాల మొత్తం మిలటరీ వ్యయం కంటే ఈ దేశానిది ఎక్కువే. అలాగే..
► సౌదీ అరేబియా తన మొత్తం జీడీపీలో 6.6 శాతం ఖర్చుచేస్తోంది. రష్యా 4.1 శాతం వ్యయం చేస్తోంది.
► ఇక 7.66 వేల కోట్ల డాలర్ల వ్యయంతో మన దేశం మూడో స్థానంలో నిలిచింది. ప్రపంచ మిలటరీ వ్యయంలో భారత్‌ మిలటరీ వ్యయం 3.6 శాతం. 
► తర్వాత స్థానంలో ఉన్న యూకే 3.2 శాతం వాటాతో 6.84 వేల కోట్ల డాలర్ల వ్యయం చేసింది. 
► 5వ స్థానం రష్యాది. ఈ దేశం 3.1 శాతం వాటాతో 6.59 వేల కోట్ల డాలర్లు సైన్యానికి ఖర్చుచేసింది. 
► ఆరో స్థానంలో ఉన్న ఫ్రాన్స్‌ 2.7 శాతం వాటాతో 5.66 వేల కోట్ల డాలర్లు ఖర్చుపెట్టింది. 
► ఏడో స్థానంలో ఉన్న జర్మనీ కూడా దాదాపు ఫ్రాన్స్‌తో సమానంగా ఖర్చు చేసింది. 
► 8వ స్థానంలో ఉన్న సౌదీ అరేబియా వెచ్చించింది 5.56 వేల కోట్ల డాలర్లు (2.6 శాతం).
► 9వ స్థానంలో 5.4 వేల కోట్ల డాలర్ల (2.6 శాతం) వ్యయంతో జపాన్‌ ఉంది.
► ఇక పదో స్థానంలో ఉన్న దక్షిణ కొరియా 5.02 వేల కోట్ల డాలర్లు వ్యయం చేసి ప్రపంచ మిలటరీ వ్యయంలో 2.4 శాతం వాటా దక్కించుకుంది. 
ఈ 10 దేశాలు మినహా ప్రపంచంలోని మిగతా అన్ని దేశాలు కలిపినా 53.6 వేల కోట్ల డాలర్ల వ్యయంతో వాటి వాటా 25.3 శాతం మాత్రమే. 

ఆంక్షల మంత్రమే నేటి యుద్ధ తంత్రం
ఆధునిక యుగంలో అత్యాధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడం, సైన్యాన్ని పెంచుకోవడమే ఆధునిక యుద్ధ తంత్రం కాదని అగ్రదేశాలు పలుమార్లు నిరూపించాయి. ఆంక్షలు విధించడం, ఎగుమతులు–­దిగుమతులను నియంత్రించడం, అధిక పన్నులు విధించడం, సరఫరాలు నిలిపివేయడం.. చేస్తున్నాయి.

ఉక్రెయిన్‌ మీద రష్యా దండెత్తినప్పుడు.. రష్యా మీద పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. రష్యా నుంచి చమురు కొనవద్దని మన దేశం మీద కూడా ఒత్తిళ్లు వచ్చాయి. ఇక దేశ భద్రతలో సైబర్‌ సెక్యూరిటీ ఇప్పుడు కీలకపాత్ర పోషిస్తోంది. మిలటరీ కంప్యూటర్‌ వ్యవస్థల భద్రతకు అన్ని దేశాలు ప్రాధాన్యతనిస్తున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement