అమెరికా రక్షణ బడ్జెట్‌ 45 లక్షల కోట్లు | Senate sends $700 billion defense bill to Trump, funding uncertain | Sakshi
Sakshi News home page

అమెరికా రక్షణ బడ్జెట్‌ 45 లక్షల కోట్లు

Published Sat, Nov 18 2017 2:32 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Senate sends $700 billion defense bill to Trump, funding uncertain - Sakshi - Sakshi

వాషింగ్టన్‌: వచ్చే ఏడాదికి అమెరికా భారీ రక్షణ బడ్జెట్‌ను ప్రకటించింది. నేషనల్‌ డిఫెన్స్‌ ఆథరైజేషన్‌ చట్టం–2018(ఎన్‌డీఏఏ) పేరిట రూపొందించిన 700 బిలియన్‌ డాలర్ల(సుమారు రూ.45.44 లక్షల కోట్లు) ఈ బడ్జెట్‌ను అమెరికా కాంగ్రెస్‌ శుక్రవారం ఆమోదించింది. సైనిక, భద్రత సాయం పొందడానికి ఇందులో పాకిస్తాన్‌పై కఠిన ఆంక్షలు విధించారు.

అదే సమయంలో భారత్‌తో రక్షణ సహకారాన్ని మరింత విస్తృతం చేసుకోవాలని ప్రతిపాదించారు.  ఈ బిల్లుకు అమెరికా పార్లమెంట్‌లోని ఉభయ సభలు ప్రతినిధుల సభ, సెనేట్‌ మూజువాణి ఓటుతో పచ్చజెండా ఊపాయి. ఇటీవలే దేశాధ్యక్షుడు ట్రంప్‌ ప్రతిపాదించిన దక్షిణాసియా వ్యూహానికి  ఇందులో చోటు కల్పించారు. తదుపరి దశలో ట్రంప్‌ సంతకం చేసిన తర్వాత∙ఈ బిల్లు చట్టరూపం దాల్చుతుంది. అతి త్వరలోనే ఆ ప్రక్రియ కూడా పూర్తయ్యే అవకాశాలున్నాయి.

ఆ హోదా భారత్‌కే ప్రత్యేకం
భారత్‌కు అమెరికా కల్పించిన ‘ప్రధాన రక్షణ భాగస్వామి’ హోదాపై ఉమ్మడి నిర్వచనం ఇవ్వాలని విదేశాంగ, రక్షణ శాఖ మంత్రులను బిల్లు కోరింది. ప్రస్తుత లక్ష్యాలు, ఆశయాల ఆధారంగా భారత్‌తో రక్షణ సంబంధాల బలోపేతానికి ముందుచూపుతో కూడిన వ్యూహాన్ని సిద్ధం చేయాలని పెంటగాన్‌కు సూచించింది. దాని ప్రకారం...ఉభయ దేశాలు అఫ్గానిస్తాన్‌తో కలసి పనిచేసి ఆ ప్రాంతంలో శాంతి, సుస్థిరత నెలకొల్పడానికి కృషిచేయాలి. అఫ్గాన్‌లో మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడులు పెట్టడం, విపత్తు సాయం లాంటివి  అందులో ఉంటాయి. 2017 రక్షణ బడ్జెట్‌లోనే భారత్‌కు అమెరికా ప్రధాన రక్షణ భాగస్వామి హోదా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ గౌరవం భారత్‌కే ప్రత్యేకమని, దీని వల్ల రెండు దేశాల మధ్య రక్షణ వ్యాపారం, సాంకేతిక సహకారం అమెరికా మిత్ర దేశాలతో సమాన స్థాయికి చేరుతుందని కాంగ్రెస్‌ సభ్యులు అభిప్రాయపడ్డారు.  

సర్టిఫికెట్‌ ఇస్తేనే నిధులు
ఈ బిల్లు ప్రకారం సంకీర్ణ మద్దతు ఫండ్‌ (సీఎస్‌ఎఫ్‌) కింద పాక్‌కు అమెరికా 350 మిలియన్‌ డాలర్ల(సుమారు రూ.2,272 కోట్లు) సాయం అందించనుంది. ఈ సాయం పొందాలంటే ఉగ్రసంస్థ హక్కానీ నెట్‌వర్క్‌పై పాక్‌ కఠిన చర్యలు తీసుకుంటోందని అమెరికా రక్షణ  మంత్రి సర్టిఫికెట్‌ ఇవ్వాలి. అమెరికా గత రక్షణ మంత్రులు పాక్‌కు ఆ సర్టిఫికెట్‌ ఇవ్వలేదు. ఉగ్ర సంస్థలపై ఆ దేశం చర్యలు తీసుకోవడం అమెరికాకు ముఖ్యమని ఈ బిల్లుతో పాటు ఆమోదం పొందిన అనుబంధ కాన్ఫరెన్స్‌ రిపోర్టు పేర్కొంది. నిధులను పాక్‌ ఉగ్ర కార్యకలాపాలకు వాడకుండా పరిశీలిస్తూ ఉండాలని కోరింది. నిధులను బలూచీ, సింధి లాంటి మైనారిటీలపై వేధింపులకు పాల్పడటానికి వాడొద్దు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement