సహస్రాబ్ది లక్ష్యాల్లో భారత్ ముందంజ!
ఐరాస మిలీనియం డెవలప్మెంట్ గోల్స్- 2015లో వెల్లడి
న్యూఢిల్లీ: సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలను (మిలీనియం డెవలప్మెంట్ గోల్స్) చేరుకోవడంలో భారత్ అద్భుత ప్రగతి సాధించిందని ఐక్యరాజ్యసమితి ఒక నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా పేదరికం సగానికి తగ్గింపు, లింగ సమానత్వం అంశాల్లో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించిందని కొనియాడింది. కానీ, సహస్రాబ్ది మొత్తం లక్ష్యాల్లో మాత్రం భారత్ అనుకున్న స్థాయిలో లేదని తెలిపింది. ఆహార భద్రత, ఆకలి చావులు, బరువు తక్కువ చిన్నారుల, పోషకాహార లోపం విషయంలో భారత్ అనుకున్న లక్ష్యానికి దూరంలో ఉందని నివేదికలో వెల్లడైంది. 2015 లోపు నిర్దేశించుకున్న లక్ష్యాలైన పేదరికం సగానికి తగ్గింపు, లింగ సమానత్వం, ప్రాథమిక విద్యలో చిన్నారుల సంఖ్య పెరుగుదల అంశాల్లో భారత్ అనుకున్న లక్ష్యాలను చేరుకుందని వెల్లడించింది. ఈ నివేదికను ఆర్థిక వేత్త, నీతి ఆయోగ్ సభ్యుడు బిబేక్ దె బ్రోయ్, యూఎన్ ఈఎస్సీఏపీ సంస్థ అధిపతి రిబెక్కా తవరెస్ తదితరులు మంగళవారమిక్కడ విడుదల చేశారు.
ప్రాథమిక విద్యలో భారత్ భేష్
చిన్నారులకు ప్రాథమిక విద్యను అందించడంలో భారత్ మంచి పురోగతిని సాధించిందని ఐరాస ఒక నివేదికలో వెల్లడించింది. అయితే మాధ్యమిక విద్య అందించే విషయంలో మాత్రం ఇంకా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా భారత్లోనే బడికి రాని పిల్లల సంఖ్య అత్యధికంగా ఉన్నట్లు తెలిపింది. ఐరాస అనుబంధ యునెస్కో, ఎడ్యుకేషనల్ గ్లోబల్ మానిటరింగ్ రిపోర్ట్(ఈఎఫ్ఆర్ జీఎంఆర్) సంయుక్తంగా అధ్యయనం చేసి ప్రపంచంలో 12.4 కోట్ల మంది ఇంకా బడి ముఖాన్ని చూడటమే లేదని వె ల్లడించాయి. 2011లో నమోదైన గణాంకాల ప్రకారం భారత్లో 1.6 కోట్ల మంది మాధ్యమిక, ప్రాథమికోన్నత విద్యకు దూరమయ్యారని పేర్కొన్నాయి.
పొగాకు ఉత్పత్తులపై ‘పన్ను’పీకండి
పొగాకు ఉత్పత్తులపై పన్నులు భారీగా పెంచడం వల్ల వాటి వినియోగం తగ్గుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) పేర్కొంది. ఈ దిశగా అన్ని దేశాలు కృషి చేయాలని విజ్ఞప్తి చేసింది. 2012-14 లో అధిక ఆదాయం కోసం భారత్ పొగాకు ఉత్పత్తులపై పన్నులు పెంచడంతో వాటి వినియోగం స్వల్పంగా తగ్గిందని తెలిపింది. గ్లోబల్ టొబాకో ఎపిడమిక్- 2015 నివేదికను డబ్ల్యూహెచ్వో మనీలాలో విడుదల చేసింది.