మాది ప్రజల పక్షం
మౌలిక సదుపాయాల కల్పనే ప్రధాన లక్ష్యం
మేయర్ పీఠంపై ఫలితాల అనంతరమే నిర్ణయం
గతంలో భాగస్వామ్య పద్ధతిలో అధికారం చేపట్టాం
బీఫ్‌తో మతానికి ముడి పెట్టొద్దు
పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధిస్తాం
‘సాక్షి’తో ఎంఐఎం ఎమ్మెల్సీ సయ్యద్ జాఫ్రీ
‘మేం ప్రజల పక్షం..ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే మా పార్టీ లక్ష్యం. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుస్తాం. మేయర్ పీఠం విషయంలో మాకు స్పష్టత ఉంది. భాగస్వామ్య పద్ధతిలోనే ముందుకు వెళ్తాం..దీనిపై ఎన్నికల ఫలితాల అనంతరమే నిర్ణయం ఉంటుంది’ అంటున్నారు ఎంఐఎం పార్టీలో కీలక నేత, ఎమ్మెల్సీ సయ్యద్ అమీన్ ఉల్ హసన్ జాఫ్రీ. మజ్లిస్ పార్టీలో తెరవెనుక వ్యూహకర్తగా...పార్టీ అధినేతకు విధేయుడిగా గుర్తింపు పొందిన జాఫ్రీ వృత్తిరీత్యా జర్నలిస్టు. పార్టీ పెద్దలకు సలహాలు, సూచనలు ఇవ్వడం... ఎత్తుగడలు, వ్యూహ ప్రతి వ్యూహాలు నెరప డంలో ఆయన దిట్ట. ఎన్నికల సమయంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ తీసుకునే నిర్ణయాల్లో ముఖ్య భూమిక పోషించే జాఫ్రీ.. గ్రేటర్ ఎన్నికల వేళ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు...
- సాక్షి, సిటీబ్యూరో
మజ్లిస్ పార్టీ రాజకీయ చరిత్రలో తొలిసారిగా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. పలు హామీలు గుప్పించింది...కారణమేంటి?
మజ్లిస్ పార్టీ ‘మా పనే- మాకు గుర్తింపు’ అనే సిద్ధాంతానికి కట్టుబడి ఉంది. సాధారణ ఎన్నికల సమయంలో మేనిఫెస్టో రూపొందించలేదు. కానీ మేనిఫెస్టో విడుదల చేయడం కొత్తేమీ కాదు. 2002 మున్సిపల్ ఎన్నికల్లో దివంగత నేత సలావుద్దీన్ హైదరాబాద్ యాక్షన్ ప్లాన్ పేరిట డాక్యుమెంట్‌ను విడుదల చేశాం. 2009 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం గ్రేటర్ హైదరాబాద్ యాక్షన్ ప్లాన్ డాక్యుమెంట్‌ను విడుదల చేశాం. ఈసారి విడుదల చేసిన డాక్యుమెంట్లో ప్రజలకు మౌలిక సదుపాయల కల్పన, స్వచ్ఛమైన తాగు నీరు. రోడ్డు, రవాణ సౌకర్యాలపై స్పష్టమైన ప్రణాళికను ప్రకటించాం. అదేవిధంగా గత మూడేళ్ల కాలంలో మజ్లిస్ హయాంలో చేపట్టిన అభివృద్ధిపై సైతం ఒక డాక్యుమెంట్‌ను విడుదల చేశాం.
‘షహర్ హమారా.. మేయర్ హమారా’ అనే నినాదంతో ఎన్నికల బరిలో దిగారు. కేవలం 60 స్థానాల్లోనే పోటీ చేస్తున్నారు. మేయర్ పీఠం ఎలా సాధ్యం?
జీహెచ్ఎంసీలో పరిమితమైన స్ధానాల్లో పోటీ చేస్తున్నప్పటికీ అన్నింటిలో విజయం సాధిస్తాం. గతంలో మూడు పర్యాయాలు సింగిల్ లార్జెస్ట్ పార్టీ మజ్లిస్ పార్టీయే. 1986లో 100 డివిజన్లకు గాను 38 స్థానాల్లో విజయం సాధించాం. మెజార్టీ లేకున్నా ఐదేళ్లపాటు అధికార పగ్గాలు చేపట్టాం. 2002లో పాలక పగ్గాలు చేపట్టకున్నా.. స్టాండింగ్ కమిటీ ద్వారా పాలనను కంట్రోల్ చేయగలిగాం. గత పర్యాయం కూడా మెజార్టీ లేకున్నా మూడేళ్ల పాటు పరిపాలించాం. మేయర్ పీఠం అనేది సింగిల్ పార్టీతో సాధ్యం కాదు. రెండు పార్టీల భాగస్వామ్యం తప్పనిసరి. ఈ విషయంలో స్పష్టంగా ఉన్నాం. మా వ్యూహాలు మాకున్నాయి.
‘జై భీమ్.. జైమీమ్’ అనే నినాదంతో ఈ ఎన్నికల బరిలో దిగారు. కానీ...బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తగిన సీట్లు కేటాయించలేదు. గత 2009 ఎన్నికల్లో 20 సీట్లు కేటాయిస్తే ఈసారి 10 సీట్లు మాత్రమే కేటాయించారు... కారణం?
పరిమిత స్థానాల్లోనే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తగిన ప్రాధాన్యం కల్పించాం. జనరల్ స్థానాలు, పాతబస్తీలో సైతం మైనార్టీయేతరులకు సీట్లు కేటాయించాం. మహిళలకు కూడా పెద్దపీట వేశాం. దళితుడిని మేయర్‌ను చేసిన ఘనత మజ్లిస్ పార్టీదే.
ఈసారి సిట్టింగ్ కార్పొరేటర్లకు చాలా వరకు సీట్లు కేటాయించలేదు. అభ్యర్థుల ఎంపిక చాలా రహస్యంగా జరిగింది. కనీసం మీడియాకు సైతం వెల్లడించలేదు. కారణం?
డివిజన్ల డీలిమిటేషన్, రిజర్వేషన్ల తారుమారు, మహిళలకు 50 శాతం సీట్ల కేటాయింపు తదితర అంశాలతో కొందరు సిట్టింగ్‌లకు టికెట్లు ఇవ్వలేకపోయాం. కేవలం 9 మంది సిట్టింగ్ కార్పొరేటర్లు, ఒక మాజీ కార్పొరేటర్, ఒక కో-ఆప్షన్ సభ్యురాలికి మాత్రమే తిరిగి అవకాశం కల్పించాం. మా పార్టీలో అసంతృప్తి అనేది ఉండదు. పరిస్థితులను బట్టి అవకాశాలు ఇవ్వడం ఆనవాయితీ. సమయాభావంతో ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేశాం.
కాంగ్రెస్, టీడీపీతో సహా అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా మజ్లిస్‌ను మతతత్వ పార్టీగా అభివర్ణిస్తోంది. మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత మీ పార్టీని విమర్శిస్తుండగా.. సీఎం కేసీఆర్ మాత్రం ‘ఎంఐఎం మాకు మిత్రపక్షమే’ అంటున్నారు.. దీనిపై మీ పార్టీ వైఖరేంటి?
మజ్లిస్ సెక్యులర్ పార్టీ. మైనార్టీలతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ హక్కుల కోసం గళం విప్పుతుంది. కాంగ్రెస్, టీడీపీ పక్షాలు గతంలో మజ్లిస్ పార్టీతో కలిసి పనిచేసినప్పుడు మతతత్వం కనిపించలేదా? పొత్తు లేనప్పుడే మతతత్వం కనిపిస్తోందా.? బీజేపీ మాదిరిగా సంఘ్ పరివార్ అనుబంధాలు మా పార్టీకి లేవు. 2014 ఎన్నికలతోనే కాంగ్రెస్ పార్టీ వాష్ ఔట్ ఆయింది. టీడీపీ-బీజేపీ కూటమి పూర్తిగా బలహీన పడింది. టీఆర్ఎస్తో వైరం లేకున్నా..తాము పోటీ చేసే స్థానాల్లో విన్నర్‌గా మజ్లిస్, రన్నర్‌గా టీఆర్ఎస్ నిలవడం ఖాయం.
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో బీఫ్ ప్రస్తావన తేవడానికి కారణమేంటి ?
ప్రస్తుతం గోవధ నిషేధ చట్టం అమల్లో ఉంది. మహారాష్ట్రలో బీజేపీ- శివసేనలు అధికారంలో ఉన్నకారణంగా స్థానిక సంస్థల జనరల్ బాడీ సమావేశాల్లో సైతం తీర్మానాలు చేసి బీఫ్‌పై నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు.. కొన్ని పండుగల సందర్భంగా బీఫ్ విక్రయాలను నిషేధిస్తున్నారు. బీఫ్‌తో మతానికి ముడి పెట్టొద్దు. బీఫ్ తినేవాళ్లలో ముస్లింలతో పాటు హిందువులూ ఉన్నారు. ఒకవేళ జీహెచ్ఎంసీలో టీడీపీ-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే బీఫ్‌పై తీర్మానాలుచేసే అవకాశాలు లేకపోలేదు. అందుకే ప్రచారంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం.
రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై మీ వైఖరి ఏమిటి?
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి చేయాలి. కొంత సమయం పట్టవచ్చు. అభివృద్ధికి పూర్తి స్థాయి సహకారాలు అందిస్తాం. ముఖ్యంగా ప్రజలకు మౌలిక సదుపాయల కల్పనకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం.
కేంద్ర ప్రభుత్వ పనితీరు.. మోదీ విదేశీ పర్యటన లపై మీ కామెంట్..?
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై సవతి తండ్రి ప్రేమను చూపిస్తోంది. కేంద్ర పథకాలలో నిధుల వాటా తగ్గించింది. ఐసీడీఎస్, సర్వశిక్షా అభ్యాస్ తదితర పథకాలకు పూర్తిస్థాయిలో నిధులు నిలిపివేసి రాష్ట్ర ప్రభుత్వంపై భారం మోపింది. పన్నుల వాటా పెంచింది. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలకే పరిమితమయ్యారు. అభివృద్ధి కాగితాలపై తప్ప ఆచరణలో కనిపించడం లేదు.
గ్రేటర్ ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తారు.? మేయర్ పీఠం విషయంలో ఏ పార్టీకి మద్దతిస్తారు?
జీహెచ్ఎంసీలో గట్టి పట్టు ఉన్న డివిజన్లలో పోటీకి దిగాం. అన్నింటిలో విజయం సాధిస్తాం. ఫలితాల అనంతరం ఎవరేమిటో స్పష్టమవుతుంది. ఫలితాల అనంతరం ఏర్పడే రాజకీయ పరిణామాలను బట్టే మేయర్ పీఠంపై నిర్ణయం ఉంటుంది. మెజార్టీ లేకుండా ఇతరుల మద్దతుతో పాలక పగ్గాలు చేపట్టిన చరిత్ర మజ్లిస్‌కు ఉంది. అదే పునరావృతం అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.