Minimum alternate tax
-
ఎఫ్ఐఐలకు ‘మ్యాట్’ లేనట్టే!
జస్టిస్ షా సిఫార్సులకు కేంద్రం ఆమోదం - ఆదాయ పన్ను చట్టంలో సవరణలూ చేస్తాం - ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడి న్యూఢిల్లీ: వివాదాస్పదంగా మారిన ‘కనీస ప్రత్యామ్నాయ పన్ను’ (మ్యాట్) విషయంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లకు (ఎఫ్ఐఐ) ఊరట లభించనుంది. ఎఫ్ఐఐలపై మ్యాట్ విధించరాదంటూ జస్టిస్ ఏపీ షా కమిటీ చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదించినట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం వెల్లడించారు. దీనికి సంబంధించి ఆదాయ పన్ను చట్టాల్లో తగు సవరణలను చేస్తామని, ఇది పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే (నవంబర్/డిసెంబర్) జరగొచ్చని ఆయన తెలియజేశారు. ఈ లోగా ఎఫ్ఐఐలపై మ్యాట్ కేసుల విచారణ పక్కన పెట్టాలంటూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) క్షేత్ర స్థాయి అధికారులను ఆదేశిస్తుందని చెప్పారు. 2015 ఏప్రిల్ తర్వాత మాదిరే... అంతకు మునుపు ఎఫ్ఐఐలు ఆర్జించిన క్యాపిటల్ గెయిన్స్‌పై కూడా మ్యాట్ ఉండబోదని జైట్లీ స్పష్టం చేశారు. కొందరు ఎఫ్ఐఐలు దీనిపై కోర్టులో పోరాడుతున్నప్పటికీ... అది తేలటానికి సుదీర్ఘ కాలం పట్టేసే అవకాశం ఉన్నందున, సమస్య సత్వర పరిష్కారం కోసం ప్రత్యామ్నాయ మార్గంగా కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. ఇదీ వివాదం.... 2015 కన్నా ముందు ఆర్జించిన లాభాలపై రూ.603 కోట్ల పైబడి మ్యాట్ చెల్లించాలంటూ 68 మంది ఎఫ్ఐఐలకు ఆదాయ పన్ను శాఖ నోటీసులివ్వటంతో వివాదం మొదలైంది. విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్లలో భారీగా పెట్టుబడులు పెడుతుంటారు. గతేడాది విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ స్టాక్ మార్కెట్లలో దాదాపు 20 బిలియన్ డాలర్లు, బాండ్లలో సుమారు 28 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశారు. 1980 దశకం ఆఖరు నుంచి ఇన్ఫ్రా, విద్యుత్ రంగాలకు చెందినవి తప్ప మిగతా అన్ని కంపెనీలపై ప్రభుత్వం మ్యాట్ విధిస్తోంది. అయితే, ఇది భారతీయ కంపెనీలకే తప్ప తమకు వర్తించదనే భావనతో విదేశీ ఇన్వెస్టర్లు ఈ పన్ను చెల్లించటం లేదు. కానీ ఒక్కసారిగా కోట్ల మేర మ్యాట్ కట్టాలంటూ నోటీసులు వచ్చేసరికి ఉలిక్కిపడిన ఎఫ్ఐఐలు వీటిని సవాలు చేశారు. ఇదే అంశంపై 2010లో మారిషస్‌కి చెందిన క్యాజిల్‌టన్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ విషయంలో మ్యాట్ చెల్లించనక్కర్లేదని చెప్పిన అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్స్ (ఏఏఆర్)... 2012లో మరో కేసులో మాత్రం విదేశీ కంపెనీలకూ మ్యాట్ వర్తిస్తుందని ఉత్తర్వులిచ్చింది. దీంతో గందరగోళం నెలకొంది. మరోవైపు, మ్యాట్ నోటీసుల దరిమిలా ఎఫ్ఐఐలు పెట్టుబడులు ఉపసంహరించుకోవడం మొదలు పెట్టడంతో స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు ఎఫ్ఐఐలకు మ్యాట్ వర్తిస్తుందా, లేదా అన్న అంశాన్ని అధ్యయనం చేసేందుకు కేంద్రం జస్టిస్ ఏపీ షా కమిటీని నియమించింది. ఇది జూలై 24న కేంద్రానికి సిఫార్సుల నివేదిక సమర్పించింది. వీటికే కేంద్రం ఆమోదం తెలిపింది. -
నష్టాల్లోంచి.. లాభాల్లోకి
- మైనస్ 207 నుంచి ప్లస్ వందకు సెన్సెక్స్ - 26,687 పాయింట్లకు చేరిక - 33 పాయింట్ల లాభంతో 8,047కు నిఫ్టీ ట్రేడింగ్ చివర్లో బ్యాంక్, వాహన షేర్లలో కొనుగోళ్ల కారణంగా మంగళవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్) బకాయిల వసూళ్ల కోసం బలవంతపు ప్రయత్నాలు చేయబోమని, ఈ విషయంలో సుప్రీం కోర్టు ఉత్తర్వుల కోసం వేచి చూస్తామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్(సీబీడీటీ) చెప్పడం మార్కెట్లపై ప్రభావాన్ని చూపించింది. రోజంతా నష్టాల్లోనే సాగిన బీఎస్ఎస్ సెన్సెక్స్ చివర్లో స్మార్ట్‌గా రికవరీ అయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 100 పాయింట్ల లాభంతో 26,687 పాయింట్ల వద్ద, నిఫ్టీ 33 పాయింట్ల లాభంతో 8,047 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్, వాహన, ఎఫ్ఎంసీజీ షేర్లలో షార్ట్ కవరింగ్ కారణంగా స్టాక్ మార్కెట్ లాభాల బాట పట్టింది. వర్షాలు సగటు కంటే మెరుగ్గానే కురుస్తుండడం, మే వాణిజ్య లోటు మూడు నెలల కనిస్టానికి తగ్గడం వంటి అంశాలు సెంటిమెంట్‌కు మరింత జోష్‌నిచ్చాయి. 350 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ వరుసగా రెండు ట్రేడింగ్ సెషన్లలో స్టాక్ మార్కెట్ లాభపడడంతో మంగళవారం ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేశారు. గ్రీస్ రుణ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవడం స్టాక్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ ఒక దశలో 207 పాయింట్లు నష్టపోయింది. ఇంట్రాడేలో 26,380 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వత ఎంపిక చేసిన షేర్లలో కొనుగోళ్ల కారణంగా 26,731 పాయింట్ల గరిష్ట స్థాయిని చేరింది. 350 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరకు వంద పాయింట్ల లాభంతో ముగిసింది.