ఎఫ్‌ఐఐలకు ‘మ్యాట్’ లేనట్టే! | Justice Shaw recommended Approved the center | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఐఐలకు ‘మ్యాట్’ లేనట్టే!

Published Wed, Sep 2 2015 12:28 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM

ఎఫ్‌ఐఐలకు ‘మ్యాట్’ లేనట్టే! - Sakshi

ఎఫ్‌ఐఐలకు ‘మ్యాట్’ లేనట్టే!

జస్టిస్ షా సిఫార్సులకు కేంద్రం ఆమోదం
- ఆదాయ పన్ను చట్టంలో సవరణలూ చేస్తాం
- ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడి
న్యూఢిల్లీ:
వివాదాస్పదంగా మారిన ‘కనీస ప్రత్యామ్నాయ పన్ను’ (మ్యాట్) విషయంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లకు (ఎఫ్‌ఐఐ) ఊరట లభించనుంది. ఎఫ్‌ఐఐలపై మ్యాట్ విధించరాదంటూ జస్టిస్ ఏపీ షా కమిటీ చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదించినట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం వెల్లడించారు. దీనికి సంబంధించి ఆదాయ పన్ను చట్టాల్లో తగు సవరణలను చేస్తామని, ఇది పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే (నవంబర్/డిసెంబర్) జరగొచ్చని ఆయన తెలియజేశారు.

ఈ లోగా ఎఫ్‌ఐఐలపై మ్యాట్ కేసుల విచారణ పక్కన పెట్టాలంటూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) క్షేత్ర స్థాయి అధికారులను ఆదేశిస్తుందని చెప్పారు. 2015 ఏప్రిల్ తర్వాత మాదిరే... అంతకు మునుపు ఎఫ్‌ఐఐలు ఆర్జించిన క్యాపిటల్ గెయిన్స్‌పై కూడా మ్యాట్ ఉండబోదని జైట్లీ స్పష్టం చేశారు. కొందరు ఎఫ్‌ఐఐలు దీనిపై కోర్టులో పోరాడుతున్నప్పటికీ... అది తేలటానికి సుదీర్ఘ కాలం పట్టేసే అవకాశం ఉన్నందున, సమస్య సత్వర పరిష్కారం కోసం ప్రత్యామ్నాయ మార్గంగా కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.
 
ఇదీ వివాదం....
2015 కన్నా ముందు ఆర్జించిన లాభాలపై రూ.603 కోట్ల పైబడి మ్యాట్ చెల్లించాలంటూ 68 మంది ఎఫ్‌ఐఐలకు ఆదాయ పన్ను శాఖ నోటీసులివ్వటంతో వివాదం మొదలైంది. విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్లలో భారీగా పెట్టుబడులు పెడుతుంటారు. గతేడాది విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ స్టాక్ మార్కెట్లలో దాదాపు 20 బిలియన్ డాలర్లు, బాండ్లలో సుమారు 28 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశారు. 1980 దశకం ఆఖరు నుంచి ఇన్‌ఫ్రా, విద్యుత్ రంగాలకు చెందినవి తప్ప మిగతా అన్ని కంపెనీలపై ప్రభుత్వం మ్యాట్ విధిస్తోంది. అయితే, ఇది భారతీయ కంపెనీలకే తప్ప తమకు వర్తించదనే భావనతో విదేశీ ఇన్వెస్టర్లు ఈ పన్ను చెల్లించటం లేదు.

కానీ ఒక్కసారిగా కోట్ల మేర మ్యాట్ కట్టాలంటూ నోటీసులు వచ్చేసరికి ఉలిక్కిపడిన ఎఫ్‌ఐఐలు వీటిని సవాలు చేశారు. ఇదే అంశంపై 2010లో మారిషస్‌కి చెందిన క్యాజిల్‌టన్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ విషయంలో మ్యాట్ చెల్లించనక్కర్లేదని చెప్పిన అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్స్ (ఏఏఆర్)... 2012లో మరో కేసులో మాత్రం విదేశీ కంపెనీలకూ మ్యాట్ వర్తిస్తుందని ఉత్తర్వులిచ్చింది. దీంతో గందరగోళం నెలకొంది. మరోవైపు, మ్యాట్ నోటీసుల దరిమిలా ఎఫ్‌ఐఐలు పెట్టుబడులు ఉపసంహరించుకోవడం మొదలు పెట్టడంతో స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు ఎఫ్‌ఐఐలకు మ్యాట్ వర్తిస్తుందా, లేదా అన్న అంశాన్ని అధ్యయనం చేసేందుకు కేంద్రం జస్టిస్ ఏపీ షా కమిటీని నియమించింది. ఇది జూలై 24న కేంద్రానికి సిఫార్సుల నివేదిక సమర్పించింది. వీటికే కేంద్రం ఆమోదం తెలిపింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement