విదేశీ పెట్టుబడులకు దీపావళి ధమాకా | Foreign investment to the Diwali Dhamaka | Sakshi
Sakshi News home page

విదేశీ పెట్టుబడులకు దీపావళి ధమాకా

Published Wed, Nov 11 2015 1:03 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM

విదేశీ పెట్టుబడులకు దీపావళి ధమాకా - Sakshi

విదేశీ పెట్టుబడులకు దీపావళి ధమాకా

15 రంగాల్లో ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపు
న్యూస్ చానళ్లలో 49 శాతం దాకా అనుమతి
డీటీహెచ్, కేబుల్ నెట్‌వర్క్‌లో 100 శాతానికి పెంపు

 
న్యూఢిల్లీ: కీలక సంస్కరణల అమలు దిశగా కేంద్రం.. పౌర విమానయానం, బ్యాంకింగ్, రిటైల్, న్యూస్ చానళ్లు మొదలైన 15 రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సడలించింది.  ఎఫ్‌డీఐ అనుమతుల ప్రక్రియను కూడా సరళతరం చేసింది. డీటీహెచ్, కేబుల్ నెట్‌వర్క్, 5 ప్లాంటేషన్ పంటల సాగులో (కాఫీ, రబ్బరు, యాలకులు మొదలైనవి) 100 శాతం ఎఫ్‌డీఐలను కేంద్రం అనుమతించింది. ఇక న్యూస్, కరెంట్ అఫైర్స్ టీవీ చానళ్లలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచింది. రక్షణ రంగం, సింగిల్ బ్రాండ్ రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐ నిబంధనలను సడలించింది. డ్యూటీ ఫ్రీ షాప్స్, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్‌నర్‌షిప్స్ (ఎల్‌ఎల్‌పీ)ల్లో ఆటోమేటిక్ పద్ధతిలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమ ప్రభుత్వం సంస్కరణల అమలుకు కట్టుబడి ఉందనడానికి ఇది నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.

ఆర్థిక ప్రగతి బాటలో దూసుకెడుతున్న భారత్‌కు ఎదురు ఉండదని, దేశంలోని అపార అవకాశాలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సంస్కరణలనేవి నిరంతరం కొనసాగే ప్రక్రియని, వీటికి అంతం అనేది ఉండదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు.మరోవైపు, ఎఫ్‌డీఐ విధానాన్ని సరళతరం చేయడమనేది వ్యాపారాల నిర్వహణకు అనువైన పరిస్థితులు కల్పించడంలో భాగమేనని, ఇవి మరిన్ని పెట్టుబడుల రాకకు ఊతమివ్వగలవని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ తెలిపారు.  తక్షణం అమల్లోకి వచ్చే ఈ నిర్ణయాలు.. ఇన్వెస్టర్లకు దీపావళి కానుకగా ఆయన అభివర్ణించారు. ఇటు బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ పరాజయం పాలైన అనంతరం, అటు బ్రిటన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ రేపటి పర్యటనకు ముందు ప్రభుత్వం ఈ సంస్కరణలు ప్రకటించడం గ మనార్హం.

ప్రాంతీయ ఎయిర్‌లైన్స్‌కు తోడ్పాటు..
చిన్న పట్టణాలకూ ఎయిర్ కనెక్టివిటీని పెంచే దిశగా ప్రాంతీయ విమానయాన సంస్థల్లో 49% దాకా ఎఫ్‌డీఐలు ఆటోమేటిక్ పద్ధతిలో రావొచ్చు. ఇప్పటిదాకా ఇందుకోసం ముందస్తుగా ప్రభుత్వ అనుమతి కావాల్సి వచ్చేది. ప్రస్తుతం ఎయిర్‌కోస్టా, ట్రూ జెట్, ఎయిర్ పెగాసస్ సంస్థలు ప్రాంతీయంగా సర్వీసులు అందిస్తున్నాయి. మరోవైపు, నాన్-షెడ్యూల్డ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్, గ్రౌండ్ హాండ్లింగ్ సర్వీసుల విభాగంలో ఎఫ్‌డీఐ పరిమితులను 74% నుంచి 100%కి పెంచారు.
 
మరిన్ని విశేషాలు..
నిర్మాణ రంగంలో కనీస మూలధన నిబంధనలు, ఫ్లోర్ ఏరియా నియంత్రణలు తొలగించారు. అలాగే విదేశీ సంస్థలు సులభతరంగా వైదొలిగేందుకు వీలుగా నిబంధనలు సడలించారు. పూర్తయిన టౌన్‌షిప్స్, మాల్స్/షాపింగ్ కాంప్లెక్సులు మొదలైన వాటి నిర్వహణ ప్రాజెక్టుల్లోకి ఆటోమేటిక్ మార్గంలో వంద శాతం ఎఫ్‌డీఐలకు అనుమతించారు. నిర్దిష్ట నిబంధనలకు లోబడి విదేశీ ఇన్వెస్టరు.. ప్రాజెక్టు పూర్తి కావడానికి ముందే వైదొలగవచ్చు.

రక్షణ రంగంలో 49% దాకా ఎఫ్‌డీఐలకు ఆటోమేటిక్ పద్ధతిలో అనుమతి ఉంటుంది. అంతకు మించితే ఎఫ్‌ఐపీబీ ఆమోదం పొందాలి. గతంలో ఇందుకోసం క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. {బాడ్‌కాస్ట్ రంగంలో డీటీహెచ్, టెలిపోర్టులు, మొబైల్ టీవీ, కేబుల్ నెట్‌వర్క్‌లలో 100 శాతం ఎఫ్‌డీఐలకు ఓకే. ఇందులో 49 శాతం దాకా పెట్టుబడులు ఆటోమేటిక్ పద్ధతిలో రావచ్చు. అంతకు మించితే ఎఫ్‌ఐపీబీ అనుమతులు అవసరం అవుతాయి.రిటైల్ రంగంలో దేశీ సంస్థలు ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా అనుమతులు తీసుకోనక్కర్లేకుండా తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను నేరుగా హోల్‌సేల్, రిటైల్, ఆన్‌లైన్ మార్గాల్లో విక్రయించుకోవచ్చు. దేశీ బ్రాండ్స్ యాజమాన్యం భారతీయుల చేతుల్లోనే ఉండాలి. ఇక సింగిల్ బ్రాండ్ రిటైల్‌కొస్తే.. సందర్భాన్ని బట్టి వీటిని సడలిస్తారు.విదేశీ పెట్టుబడులు ఆటోమేటిక్ పద్ధతిలో అనుమతించిన రంగాల కంపెనీల్లో విదేశీ ఇన్వెస్టర్లకు యాజమాన్య అధికారాల బదిలీకి ప్రత్యేకంగా ప్రభుత్వ అనుమతి అక్కర్లేదు.
 
 ఎఫ్‌ఐపీబీకి మరిన్ని అధికారాలు..
 విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపీబీ) సుమారు రూ. 5,000 కోట్ల దాకా ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు ఆమోదమిచ్చేలా అధికారం కల్పించినట్లు వాణిజ్య శాఖ తెలిపింది. ఇప్పటిదాకా ఈ పరిమితి రూ. 3,000 కోట్ల దాకా మాత్రమే ఉంది. అటు ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి ప్రభుత్వం పెంచింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement