నష్టాల్లోంచి.. లాభాల్లోకి
- మైనస్ 207 నుంచి ప్లస్ వందకు సెన్సెక్స్
- 26,687 పాయింట్లకు చేరిక
- 33 పాయింట్ల లాభంతో 8,047కు నిఫ్టీ
ట్రేడింగ్ చివర్లో బ్యాంక్, వాహన షేర్లలో కొనుగోళ్ల కారణంగా మంగళవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్) బకాయిల వసూళ్ల కోసం బలవంతపు ప్రయత్నాలు చేయబోమని, ఈ విషయంలో సుప్రీం కోర్టు ఉత్తర్వుల కోసం వేచి చూస్తామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్(సీబీడీటీ) చెప్పడం మార్కెట్లపై ప్రభావాన్ని చూపించింది.
రోజంతా నష్టాల్లోనే సాగిన బీఎస్‌ఎస్ సెన్సెక్స్ చివర్లో స్మార్ట్‌గా రికవరీ అయింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 100 పాయింట్ల లాభంతో 26,687 పాయింట్ల వద్ద, నిఫ్టీ 33 పాయింట్ల లాభంతో 8,047 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్, వాహన, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో షార్ట్ కవరింగ్ కారణంగా స్టాక్ మార్కెట్ లాభాల బాట పట్టింది. వర్షాలు సగటు కంటే మెరుగ్గానే కురుస్తుండడం, మే వాణిజ్య లోటు మూడు నెలల కనిస్టానికి తగ్గడం వంటి అంశాలు సెంటిమెంట్‌కు మరింత జోష్‌నిచ్చాయి.
350 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్
వరుసగా రెండు ట్రేడింగ్ సెషన్లలో స్టాక్ మార్కెట్ లాభపడడంతో మంగళవారం ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేశారు. గ్రీస్ రుణ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవడం స్టాక్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ ఒక దశలో 207 పాయింట్లు నష్టపోయింది. ఇంట్రాడేలో 26,380 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వత ఎంపిక చేసిన షేర్లలో కొనుగోళ్ల కారణంగా 26,731 పాయింట్ల గరిష్ట స్థాయిని చేరింది. 350 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్ చివరకు వంద పాయింట్ల లాభంతో ముగిసింది.