ఇంత దారుణంగా ఉంటే మీరేం చేస్తున్నారు?
ఢిల్లీలో కాలుష్యం తీవ్రస్థాయిలో ఉంది. పీఎం2.5 రేణువులు అత్యధికంగా ఉన్నాయి. దాంతో కళ్ల ముందు ఏముందో కూడా కనపడని పరిస్థితి. ఈ కారణంగా పాఠశాలలకు మూడు రోజులు సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రాల ప్రభుత్వాలపై మండిపడింది. ఢిల్లీ కాలుష్యం అంశంపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అనిల్ దవే అధ్యక్షతన సమావేశం జరిగింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ప్రభుత్వాలు ఢిల్లీ కాలుష్యానికి కారణమని ఎన్జీటీ విమర్శించింది.
ఇప్పటివరకు కాలుష్య నియంత్రణకు మీరేం చేశారని కేంద్రంతో పాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలను ఎన్జీటీ ప్రశ్నించింది. రోడ్ల మీద దుమ్మును తగ్గించడానికి నీళ్లు చల్లడం మొదలుపెట్టారా లేదా అని, హెలికాప్టర్ల ద్వారా నీళ్లు చల్లాలన్న ప్రతిపాదన ఏమైందని ప్రశ్నలు సంధించింది. ఎన్జీటీ ఉత్తర్వులను ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకోడానికి ఏం చేశారని నిలదీసింది. పంజాబ్లో 70% భూముల్లో పంటలు కాల్చేస్తుంటే ఢిల్లీ ప్రభుత్వం ఏం చేస్తోందని అడిగింది. కాలుష్యాన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై లేదా.. కార్పొరేషన్లు ఏం చేస్తున్నాయని ప్రశ్నించింది. ఇంతకుముందు రోడ్లను శుభ్రం చేయడానికి మిషన్లు వాడాలని చెప్పిన విషయాన్ని గుర్తుచేసి, ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని తెలిపింది.
ఢిల్లీలో కాలుష్యానికి ప్రధాన కారణం దుమ్మేనని, రాష్ట్రాల వారీగా పర్యావరణ పరిరక్షణ క్యాలెండర్లను రూపొందించాల్సి ఉందిన కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అనిల్ దవే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించే వరకు ఏ సమస్య అయినా పరిష్కారం కాదని, ఎప్పటికప్పుడు రోడ్లపై నీళ్లు చల్లించడం లాంటి చర్యలు వెంటనే చేపట్టాలని చెప్పారు. ఈ విషయంలో ఒకరిపై ఒకరు తప్పులు తోసుకోవడం సరికాదని, ప్రజలు ఊపిరి పీల్పచుకునేందుకు వీలుగా గాలి కాలుష్యం లేకుండా చూడాలని దవే తెలిపారు. ఢిల్లీ కాలుష్యంలో 80 శాతం వరకు ఇక్కడే తయారవుతోందని, మిగిలిన 20 శాతం మాత్రమే పొరుగు రాష్ట్రాలలో పంటలు కాల్చడం వల్ల వస్తోందని స్పష్టం చేశారు.