Minister Dr. Kamineni Srinivas
-
ఒక్కరైనా సరిగా పనిచేస్తున్నారా..?
వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందిపై మంత్రి కామినేని ఆగ్రహం విజయవాడ : వైద్య, ఆరోగ్య శాఖలో ఒక్కరైనా సరిగ్గా పనిచేస్తున్నారా? పట్టాలు పొంది, సెలవులు తీసుకుంటుంటే ప్రజలకు వైద్య సేవలు ఎవరందిస్తారు? అని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తంచేశారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రాత్రి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ క్షేత్రస్థాయి పనితీరును ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యతో కలిసి మంత్రి సమీక్షించారు. మంత్రి కామినేని మాట్లాడుతూ రూ.కోట్లు ఖర్చయ్యే పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సు చేయడానికి ప్రభుత్వ సర్వీసులో చేరుతున్న వారిని ఉపేక్షించేదిలేదని పేర్కొన్నారు. వైద్యఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ అనధికారికంగా విధులకు దూరంగా ఉన్న డాక్టర్లను ఉపేక్షించేది లేదన్నారు. కలెక్టర్ బాబు.ఎ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ నాగమల్లేశ్వరి, ఐసీడీఎస్ పీడీ కృష్ణకుమారి పాల్గొన్నారు. . -
స్విమ్స్ కేంద్రంగా మెడికల్ హబ్
తిరుపతిలో బాలాజీ పురుషుల మెడికల్ కళాశాలకు చర్యలు పద్మావతి మెడికల్ కళాశాలలో విస్తృత పరిశోధనలు ఎయిమ్స్ స్థాయిలో స్విమ్స్‌ను తీర్చిదిద్దుతాం వైద్య విద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తిరుపతి కార్పొరేషన్ : తిరుపతికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా స్విమ్స్ కేంద్రంగా మెడికల్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర వైద్య విద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తె లిపారు. శ్రీవేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) 6వ స్నాతకోత్సవాన్ని బుధవారం తిరుపతి మహతి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి వస్తారని అన్ని ఏర్పాట్లు చేశారు. వర్షాలతో వాతావరణం అనుకూలించకపోవడంతో సీఎం హాజరుకాలేదు. ఆయన స్థానంలోమంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. వైద్య విద్య పూర్తి చేసుకున్న 288 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 8మందికి బంగారు పతకాలు, ముగ్గురికి మెరిట్ సర్టిఫికెట్లు అందజేశారు. విలువలతో కూడిన విద్యను అందుకోవాలి.. అత్యుత్తమ విలువలు కలిగిన వైద్య విద్యను క్రమశిక్షణతో అభ్యసించాలని, నేర్చుకున్న విద్యను పదిమందికి పంచినప్పుడే అది సార్థకం అవుతుందని మంత్రి కామినేని అన్నారు. నాది అనుకోకుండా మనది అనుకున్నప్పుడే సంస్థ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఏదైనా ఘటన జరిగితే ఇతరులను నిందించడం కాకుండా, మనలో మనమే ఆత్మవిమర్శ చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. అంతకు ముందు ఆయన ముఖ్యమంత్రి ప్రసంగాన్ని చదివి వినిపించారు. అనంతరం మంత్రి కామినేనితో పాటు ప్రత్యేక అతిథిగా హాజరైన యూఎస్ఏ కార్నల్ యూనివర్సిటీకి చెందిన ప్రఖ్యాత క్యాన్సర్ వైద్యుడు డాక్టర్ దత్తాత్రేయుడు నోరిలను స్విమ్స్ డెరైక్టర్ రవికుమార్ శ్రీవారి జ్ఞాపికలతో ఆత్మీయంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, టీటీడీ బోర్డు సభ్యులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, వీరాంజనేయులు, ఎస్వీయూ వీసీ దామోదర్, స్విమ్స్ రిజిస్ట్రార్ ఆంజనేయులు, డీన్ ప్రసాద్ పాల్గొన్నారు. -
బోగస్ సర్టిఫికెట్లతో ఎంబీబీఎస్ సీట్లు
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): కొంతమంది విద్యార్థులు బోగస్ సర్టిఫికెట్లతో ఎంబీబీఎస్ సీట్లు పొందిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ బుధవారం హెల్త్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇటీవల ముగిసిన మెడికల్ కౌన్సెలింగ్‌లో ఏడుగురు అగ్రకుల అభ్యర్థులు బీసీ బోగస్ సర్టిఫికెట్లతో ఎంబీబీఎస్ సీట్లు పొందారు. వీరిలో ఐదుగురు ఏపీ ఎంసెట్, మరో ఇద్దరు తెలంగాణ ఎంసెట్‌లో ర్యాంకులు పొంది సీట్లు దక్కించుకున్నారు. వారందరూ కర్నూలు జిల్లా కల్లూరు మండలం తహసీల్దార్ శివరాముడు జారీచేసినట్లు ఉన్న కుల ధ్రువపత్రాలు సమర్పించడంతో అనుమానం వచ్చినట్లు మంత్రి తెలిపారు. అనంతపురం, కాకినాడ, కరీంనగర్ జిల్లాల వారు కల్లూరు మండలంలో ఉంటున్నట్లుగా నివాస ధ్రువీకరణ పత్రాలు ఇచ్చినట్లు చెప్పారు. ఈ ఏడుగురిలో ఆరుగురు బాలికలు కావడం విశేషం. వారందరికీ బీసీ వెల్ఫేర్ కమిషన్ ఇచ్చిన జాబితా ప్రకారం హెల్త్ యూనివర్సిటీలో జరిగిన కౌన్సెలింగ్‌లో అధికారులు సీట్లు కేటాయించారు. మిగిలిన కౌన్సెలింగ్ కేంద్రాల్లోనూ ఎవరైనా ఇలా చేరారేమో విచారణ చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. డీజీపీ, ఇంటెలిజన్స్ డీజీ దృష్టికి తీసుకువచ్చామని, సీబీ సీఐడీ విచారణ జరిపి బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులపై క్రిమినల్ కేసులు పెడతామన్నారు. ఈ విషయాన్ని ఎంసీఐ దృష్టికి తీసుకెళ్లి బీసీ విద్యార్థులకు చెందాల్సిన సీట్లు వారికే కేటాయించేలా ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. సదరు తహసీల్దార్ విషయమై కర్నూలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన అవినీతికి పాల్పడుతున్నాడని తెలిసి అక్కడి నుంచి వేరే చోటికి బదిలీచేసినట్లు చెప్పారని వివరించారు. ఇదే విషయమై ప్రస్తుతం వెలుగోడులో తహసీల్దార్‌గా పనిచేస్తున్న శివరాముడును ‘సాక్షి’ వివరణ కోరగా... నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం ఇప్పుడే తెలిసిందన్నారు. తహసీల్దార్‌గా ఇప్పటి వరకు లక్షా 70వేల సర్టిఫికెట్లు జారీ చేశానని, వీటిలో నకిలీలు ఉన్నట్లు తెలియదన్నారు. పరిశీలించిన తర్వాత వివరణ ఇస్తానని చెప్పారు. -
మార్పు కోసమే...
మీడియాలో ప్రచారం కోసం కాదు.. ప్రభుత్వాస్పత్రిలో మంత్రి కామినేని ‘ఆస్పత్రి నిద్ర’ లబ్బీపేట : ‘రాజకీయ నాయకులు అలాగే మాట్లాడుతుంటారు.. కానీ అచరణలో మాత్రం ఏమీ చేయరు...’ అనే భావన ప్రజల్లో ఉందని, దాన్ని తొలగించేందుకే తాను ‘ఆస్పత్రి నిద్ర’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. తాను ప్రచారం కోసం ఈ కార్యక్రమం చేపట్టలేదని, కేవలం మార్పు కోసమేనని చెప్పారు. తాను ఒక్కరోజు వచ్చినంత మాత్రాన ఒకేసారి మార్పు వస్తుందని అనుకోవద్దని, ఈ రోజు ఆస్పత్రి ఎలా ఉందో.. ప్రతి రోజూ అలాగే ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. తనతోపాటు అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలను జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రుల్లో ఈ కార్యక్రమం చేపట్టాలని కోరినట్లు తెలిపారు. ముందుగా ప్రకటించిన ప్రకారం మంత్రి కామినేని శ్రీనివాస్ ఆదివారం రాత్రి నగరంలోని ప్రభుత్వాస్పత్రిలో ‘ఆస్పత్రి నిద్ర’ చేపట్టారు. రాత్రి 9.10 గంటలకు ఆయన ఆస్పత్రికి వచ్చారు. తొలుత క్యాజువాలిటీని పరిశీలించారు. అనంతరం సమావేశ మందిరంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనతో మనం వైద్యపరంగా ఎంతో నష్టపోయామని చెప్పారు. ప్రభుత్వాస్పత్రిలో సేవలు కూడా అంతంతమాత్రంగానే ఉన్న తరుణంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికి కొంత మార్పు వచ్చిందని, మరింత మెరుగైన సేవలు అందించేందుకు వైద్యులు సీరియస్‌గా పని చేయాల్సి ఉందన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులకు, ప్రభుత్వ వైద్యులకు ఏమీ తేడా లేదన్నారు. ప్రభుత్వ వైద్యులే మెరుగైన సేవలు అందించగలరని ఆయన చెప్పారు. వైద్యులు, సిబ్బందిలో కొంతవరకు మార్పు వచ్చిందని, పారిశుధ్యం కూడా మెరుగుపడిందని పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఆరు గంటలకు ఆస్పత్రిలో అన్ని వార్డులు పరిశీలించి సమస్యలు తెలుసుకుంటానని మంత్రి చెప్పారు. ఆస్పత్రిలో రేడియోగ్రాఫర్లు, సీటీ టెక్నిషియన్లు లేని విషయాన్ని విలేకరులు మంత్రి వద్ద ప్రస్తావించగా.... కాంట్రాక్టు పద్ధతిలో నియమించేందుకు కృషిచేస్తానని తెలిపారు. మంత్రి రాకతో ముస్తాబు మంత్రి రాకను దృష్టిలో పెట్టుకుని క్యాజువాలిటీని ముస్తాబు చేశారు. రూమ్ స్ప్రేలు చేశారు. అయితే ఈ విషయాన్ని మంత్రి కూడా గుర్తించారు. తాను వస్తున్నానని ఈ విధంగా చేశారని, ఇదే పరిశుభ్రతను రోజూ పాటించాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా మంత్రి కోసం ప్రత్యేకంగా కొనుగోలు చేసిన డబుల్‌కాట్ బెడ్‌పై నిద్రించలేదు. ఆస్పత్రిలోని బెడ్ తెప్పించుకుని దానిపై నిద్రకు ఉపక్రమించారు.