తిరుపతిలో బాలాజీ పురుషుల మెడికల్ కళాశాలకు చర్యలు
పద్మావతి మెడికల్ కళాశాలలో విస్తృత పరిశోధనలు
ఎయిమ్స్ స్థాయిలో స్విమ్స్‌ను తీర్చిదిద్దుతాం
వైద్య విద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్
తిరుపతి కార్పొరేషన్ : తిరుపతికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా స్విమ్స్ కేంద్రంగా మెడికల్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర వైద్య విద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తె లిపారు. శ్రీవేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) 6వ స్నాతకోత్సవాన్ని బుధవారం తిరుపతి మహతి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి వస్తారని అన్ని ఏర్పాట్లు చేశారు. వర్షాలతో వాతావరణం అనుకూలించకపోవడంతో సీఎం హాజరుకాలేదు. ఆయన స్థానంలోమంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. వైద్య విద్య పూర్తి చేసుకున్న 288 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 8మందికి బంగారు పతకాలు, ముగ్గురికి మెరిట్ సర్టిఫికెట్లు అందజేశారు.
విలువలతో కూడిన విద్యను అందుకోవాలి..
అత్యుత్తమ విలువలు కలిగిన వైద్య విద్యను క్రమశిక్షణతో అభ్యసించాలని, నేర్చుకున్న విద్యను పదిమందికి పంచినప్పుడే అది సార్థకం అవుతుందని మంత్రి కామినేని అన్నారు. నాది అనుకోకుండా మనది అనుకున్నప్పుడే సంస్థ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఏదైనా ఘటన జరిగితే ఇతరులను నిందించడం కాకుండా, మనలో మనమే ఆత్మవిమర్శ చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. అంతకు ముందు ఆయన ముఖ్యమంత్రి ప్రసంగాన్ని చదివి వినిపించారు.
అనంతరం మంత్రి కామినేనితో పాటు ప్రత్యేక అతిథిగా హాజరైన యూఎస్‌ఏ కార్నల్ యూనివర్సిటీకి చెందిన ప్రఖ్యాత క్యాన్సర్ వైద్యుడు డాక్టర్ దత్తాత్రేయుడు నోరిలను స్విమ్స్ డెరైక్టర్ రవికుమార్ శ్రీవారి జ్ఞాపికలతో ఆత్మీయంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, టీటీడీ బోర్డు సభ్యులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, వీరాంజనేయులు, ఎస్వీయూ వీసీ దామోదర్, స్విమ్స్ రిజిస్ట్రార్ ఆంజనేయులు, డీన్ ప్రసాద్ పాల్గొన్నారు.
స్విమ్స్ కేంద్రంగా మెడికల్ హబ్
Published Thu, Dec 3 2015 1:56 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement