- స్విమ్స్‌తో పాటు ‘పద్మావతి’ సీట్లూ కడప, కర్నూలు, చిత్తూరు,
- అనంతపురం, నెల్లూరు వారికే.. ఉత్తర్వులు జారీ..
సాక్షి, హైదరాబాద్: శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (స్విమ్స్)లో ఉన్న ఎండీ, ఎంఎస్ పీజీ, సూపర్‌స్పెషాలిటీ సీట్లతో పాటు, ఫిజియో థెరపీ, నర్సింగ్ సీట్లు ఇకపై రాయలసీమకే వర్తింప చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. స్విమ్స్ అనుబంధ కళాశాల పద్మావతి మహిళా వైద్య కళాశాలకు చెందిన ఎంబీబీఎస్ సీట్లు కూడా స్థానికులకే వర్తింపచేయాలని నిర్ణయించారు. ఈమేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
స్విమ్స్‌ను స్టేట్ వైడ్ కళాశాలగా గుర్తించి 2014 ఆగస్ట్ 23న జీవో నెం.120 ఇచ్చారు. దీని ఆధారంగా 85 శాతం సీట్లు 13 జిల్లాలకు చెందిన వారికి, మిగతా 15 శాతం సీట్లు ప్రవాస భారతీయ కోటాగానూ నిర్ణయించారు. దీనిపై రాయలసీమ ప్రాంతానికి చెందిన విద్యార్థులతో పాటు కొన్ని సంఘాలు, హైకోర్టుతో పాటు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి.
స్విమ్స్‌ను ప్రాంతీయ సంస్థగానే పరిగణించాలని న్యాయస్థానాలు తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వం దిగొచ్చింది. 2015 జూన్ 17న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఇప్పటి వరకూ రాష్ట్రస్థాయి సంస్థగా ఉన్న స్విమ్స్‌ను ప్రాంతీయ (రీజనల్) సంస్థగా పరిగణిస్తామని పూనం తెలిపారు. 2016-17 విద్యా సంవత్సరం నుంచి పైన పేర్కొన్న ఐదు జిల్లాల అభ్యర్థులకు 85%సీట్లు స్థానిక కోటాలో ఉంటాయని, మిగతా 15 % సీట్లు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ 1974 (రెగ్యులేషన్ ఆఫ్ అడ్మిషన్స్) ప్రకారం అన్ రిజర్వ్‌డ్ కోటాలో ఉంటాయన్నారు.