మీడియాలో ప్రచారం కోసం కాదు..
ప్రభుత్వాస్పత్రిలో మంత్రి కామినేని ‘ఆస్పత్రి నిద్ర’
లబ్బీపేట : ‘రాజకీయ నాయకులు అలాగే మాట్లాడుతుంటారు.. కానీ అచరణలో మాత్రం ఏమీ చేయరు...’ అనే భావన ప్రజల్లో ఉందని, దాన్ని తొలగించేందుకే తాను ‘ఆస్పత్రి నిద్ర’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. తాను ప్రచారం కోసం ఈ కార్యక్రమం చేపట్టలేదని, కేవలం మార్పు కోసమేనని చెప్పారు. తాను ఒక్కరోజు వచ్చినంత మాత్రాన ఒకేసారి మార్పు వస్తుందని అనుకోవద్దని, ఈ రోజు ఆస్పత్రి ఎలా ఉందో.. ప్రతి రోజూ అలాగే ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. తనతోపాటు అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలను జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రుల్లో ఈ కార్యక్రమం చేపట్టాలని కోరినట్లు తెలిపారు. ముందుగా ప్రకటించిన ప్రకారం మంత్రి కామినేని శ్రీనివాస్ ఆదివారం రాత్రి నగరంలోని ప్రభుత్వాస్పత్రిలో ‘ఆస్పత్రి నిద్ర’ చేపట్టారు. రాత్రి 9.10 గంటలకు ఆయన ఆస్పత్రికి వచ్చారు. తొలుత క్యాజువాలిటీని పరిశీలించారు. అనంతరం సమావేశ మందిరంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనతో మనం వైద్యపరంగా ఎంతో నష్టపోయామని చెప్పారు. ప్రభుత్వాస్పత్రిలో సేవలు కూడా అంతంతమాత్రంగానే ఉన్న తరుణంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటికి కొంత మార్పు వచ్చిందని, మరింత మెరుగైన సేవలు అందించేందుకు వైద్యులు సీరియస్‌గా పని చేయాల్సి ఉందన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులకు, ప్రభుత్వ వైద్యులకు ఏమీ తేడా లేదన్నారు. ప్రభుత్వ వైద్యులే మెరుగైన సేవలు అందించగలరని ఆయన చెప్పారు. వైద్యులు, సిబ్బందిలో కొంతవరకు మార్పు వచ్చిందని, పారిశుధ్యం కూడా మెరుగుపడిందని పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఆరు గంటలకు ఆస్పత్రిలో అన్ని వార్డులు పరిశీలించి సమస్యలు తెలుసుకుంటానని మంత్రి చెప్పారు. ఆస్పత్రిలో రేడియోగ్రాఫర్లు, సీటీ టెక్నిషియన్లు లేని విషయాన్ని విలేకరులు మంత్రి వద్ద ప్రస్తావించగా.... కాంట్రాక్టు పద్ధతిలో నియమించేందుకు కృషిచేస్తానని తెలిపారు.
మంత్రి రాకతో ముస్తాబు
మంత్రి రాకను దృష్టిలో పెట్టుకుని క్యాజువాలిటీని ముస్తాబు చేశారు. రూమ్ స్ప్రేలు చేశారు. అయితే ఈ విషయాన్ని మంత్రి కూడా గుర్తించారు. తాను వస్తున్నానని ఈ విధంగా చేశారని, ఇదే పరిశుభ్రతను రోజూ పాటించాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా మంత్రి కోసం ప్రత్యేకంగా కొనుగోలు చేసిన డబుల్‌కాట్ బెడ్‌పై నిద్రించలేదు. ఆస్పత్రిలోని బెడ్ తెప్పించుకుని దానిపై నిద్రకు ఉపక్రమించారు.
మార్పు కోసమే...
Published Mon, Feb 23 2015 12:53 AM | Last Updated on Sat, Sep 2 2017 9:44 PM
Advertisement
Advertisement