మంత్రి ఏరాసు ఇల్లు ముట్టడి
డోన్, చిత్తూరు, న్యూస్‌లైన్: మంత్రులకు సమైక్య సెగ తగిలింది. కర్నూ లు జిల్లా డోన్‌లో జేఏసీ నాయకులు గురువారం రాష్ట్రమంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ఇంటిని ముట్టడించగా, కేంద్రమంత్రి కిల్లి కృపారాణి తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నారు. రాష్ట్ర న్యాయశాఖమంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి డోన్‌లోని స్వగృహంలో ఉన్నారనే సమాచారం తెలుసుకున్న జేఏసీ నాయకులు పెద్ద ఎత్తున ఆయన తరలివచ్చారు. ఇంటిని ముట్టడించి మంత్రి ఏరాసు డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీం తో ఆయన బయటకు వచ్చి మంత్రి పదవికి రాజీనామా చేశానని తెలి పారు. రాజీనామా చేస్తే ప్రొటోకాల్ ఎందుకని, ఇంతమంది పోలీసులు ఎందుకని సమైక్యవాదులు నిలదీశారు.
విభజన అనివార్యమైతే ప్రజ ల్లోకి వచ్చి పోరాడతానని మంత్రి చెప్పడంతో శాంతించి వెనుదిరిగారు. వేలూరులోని స్వర్ణదేవాలయాన్ని సందర్శించిన కేంద్రమంత్రి కిల్లి కృపారాణి సమైక్యవాదుల ఆందోళన నేపథ్యంలో తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నారు. మంత్రి చిత్తూరు మీదుగా తిరుపతికి చేరుకుని అక్కడ అధికారులతో సమావేశమై, తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు లో హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే ఈ సమాచారం తెలుసుకున్న ఎన్జీవోలు చిత్తూరు కలెక్టరేట్ ముందు ఆమెను అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. సాయంత్రం 5.45 గంటల వరకు స్వర్ణదేవాలయంలోనే వేచి ఉన్న మంత్రి తిరుపతి పర్యటన రద్దుచేసుకుని అక్కడి నుంచి చెన్నై మీదుగా హైదరాబాద్ వెళ్లారు. దీంతో ఆగ్రహించిన ఎన్జీవోలు కలెక్టరేట్ ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించారు.