కొత్త రేషన్ కార్డుకు ఓకే
సాక్షి, చెన్నై: మైలాపూర్‌లో పౌరసరఫరాల విభాగం కార్యాలయాన్ని మంత్రి కామరాజ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ఉన్న సరుకుల నిల్వ, పంపిణీ గురించి ఆరా తీశారు. కార్డుదారులను ప్రశ్నించారు. ఏదేని సమస్యలు ఉంటే వినతి పత్రంగా సమర్పించాలని సూచించారు. కాసేపు అక్కడే ఉండి మరీ వినతి పత్రాల్ని ఆయన స్వీకరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, రేషన్ కార్డుల్లో ఏదేని సవరణలు, చిరునామాల మార్పు వంటి ప్రక్రియలు త్వరితగతిన ముగించి, లబ్ధిదారులకు అందజేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ఆలస్యమయ్యే కొద్దీ కార్డు దారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
కుటుంబ కార్డు కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. తొమ్మిది లక్షల మందికి త్వరలో కార్డులు పంపిణీ చేయనున్నామన్నారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించడం, స్వయంగా దరఖాస్తుదారుల ఇళ్ల వద్దకు వెళ్లి మరీ విచారించి, పకడ్బందీ ఏర్పాట్లతో కొత్త రేషన్ కార్డుల మంజూరు చేస్తామన్నారు. కొత్త రేషన్ కార్డులు 60 రోజుల్లోపు మంజూరు చేయనున్నట్లు వివరించారు. 8,82,740 మంది దరఖాస్తు చేసుకుని ఉన్నారని, మరి కొద్ది రోజుల్లో వీరికి కొత్త కార్డులు పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఫిర్యాదులు: చెన్నైలోని వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుని ఉన్నామన్నారు.
నగరంలో 1,723 రేషన్ దుకాణాలు ఉన్నాయని వివరించారు. నగరంలో 21,46,627 రేషన్ కార్డుదారులు ఉన్నారని గుర్తు చేశారు. వీరికి ఏదేని సమస్యలు తలెత్తినా, రేషన్ సరకు లు సక్రమంగా అందకున్నా 9445464748, 729900 8002 నెంబర్లకు ఎస్ఎంఎస్ల ద్వారా ఫిర్యాదు చేయొచ్చని ప్రకటించారు. అంబత్తూరు, థౌజండ్‌లైట్స్, సైదా పేట ల్లోని కార్యాలయాల్ని రూ.2.5 కోట్ల వ్యయం తో ఆధునీకరించినట్లు వివరించారు. ప్రతినెలా మొదటి శని వారం, రెండో శుక్రవారం ఫిర్యాదుల స్వీకరణ శిబి రాల్ని నిర్వహిస్తున్నామన్నారు. కొన్నేళ్ల నుంచి కొత్త కార్డులు మంజూరు చేయనందున, మంత్రి చేసిన ప్రకటనతో దరఖాస్తుదారుల్లో ఆనందం నెలకొంది.