ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరణ
- ఆస్పత్రుల ప్రతినిధులతో మంత్రి లక్ష్మారెడ్డి చర్చలు సఫలం
- నెల రోజుల్లో బకాయిల చెల్లింపునకు సర్కారు సంసిద్ధత
- ప్యాకేజీలు, ఎంవోయూ సమీక్షకు కమిటీ
- ఆస్పత్రుల తీరుపై మంత్రి అసంతృప్తి
- మళ్లీ ఇలా చేస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్ : ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరిస్తున్నట్లు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు ప్రకటించాయి. పెండింగ్‌లో ఉన్న బిల్లులను నెల రోజుల్లో చెల్లిస్తామని.. ప్యాకే జీ, ఎంవోయూలకు సంబంధించి సమీక్షిం చేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీ వేస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో ఆసుపత్రులు వెనక్కి తగ్గాయి. దీనిపై సోమవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో చర్చించిన ఆసుపత్రుల ప్రతినిధులు.. అనంతరం ప్రత్యేకంగా సమావేశమై ఆరోగ్యశ్రీ సేవల పునరుద్ధరణకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో నాలుగైదు రోజులుగా నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
ఆస్పత్రుల తీరుపై అసంతృప్తి...
చర్చల సందర్భంగా ఆస్పత్రుల తీరుపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలి సింది. తరచుగా వైద్య సేవలు నిలిపివేయడం సమంజసం కాదని ఆయన ఆస్పత్రుల ప్రతినిధులను మందలించినట్లు సమాచార ం. భవిష్యత్తులో మళ్లీ ఇలా చేస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు తగ్గినట్లు తెలిసింది. ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీలో నిమ్స్ డెరైక్టర్ మనోహర్, ఆరోగ్యశ్రీ సీఈవో చంద్రశేఖర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల తరఫున డాక్టర్ భాస్కర్‌రావు, ప్రైవేటు ఆసుపత్రుల తరఫున డాక్టర్ నర్సింగరావు, డాక్టర్ సురేశ్‌గౌడ్ ఉంటారు. ఇక నెల రోజుల్లో పెండింగ్ బిల్లులు చెల్లిస్తామన్న అంశంపై లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల ప్రతినిధులు కోరగా మంత్రి నిరాకరించినట్లు తెలిసింది.
ప్రభుత్వ ఆసుపత్రులకేనా?
ఆరోగ్యశ్రీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయిస్తోంది. అందులో 70శాతం వరకు నిధులు ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులకే చేరుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చాలని వైద్య ఆరోగ్య శాఖ యోచిస్తోంది. 2016-17 బడ్జె ట్లో ఆరోగ్యశ్రీకి రూ.464 కోట్లు కేటాయించా రు. వీటిలోనూ 70 శాతం దాకా ప్రైవేటు ఆసుపత్రులకే వెళ్లే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీని ప్రైవేటు ఆసుపత్రుల్లో కాకుండా ప్రభుత్వ ఆసుపత్రులకే పరిమితం చేసే అంశాన్ని సర్కారు సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే అధికంగా శస్త్రచికిత్సలు చేసేలా చూడాలని అధికారులకు సూచించింది. ఇటీవల ఎముకలకు (ఆర్థోపెడిక్) సంబంధించిన శస్త్రచికిత్సలను ఆరోగ్యశ్రీ నుంచి తొలగించాలని సర్కారు నిర్ణయించి, అంతర్గత ఉత్తర్వులూ ఇచ్చింది. కానీ నిరసన రావడంతో వెనక్కి తీసుకుంది.