Minister Paswan
-
ఈ కామర్స్ నియంత్రణకు నిబంధనలు
జెనీవా: భారత ఈ కామర్స్ రంగ నియంత్రణ కోసం నిబంధనలను రూపొందించే పని జరుగుతోందని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ తెలిపారు. ఈ కామర్స్ రంగం 2020 నాటికి 120 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుతుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఈ కామర్స్ రంగం ఏటా 51 శాతం మేర వృద్ధి చెందుతున్నప్పటికీ, డిజిటల్ మార్కెట్లకు సంబంధించిన చట్టాలను ఇంకా రూపొందించాల్సి ఉందన్నారు. వాణిజ్యం, అభివృద్ధిపై జెనీవాలో జరిగిన మూడో ఇంటర్ గవర్నమెంటల్ నిపుణుల బృందం సమావేశంలో పాశ్వాన్ మాట్లాడారు. అంతర్జాతీయ సరఫరా చైన్ల అవతరణ, వాణిజ్య అడ్డంకులు తగ్గిపోవడం, అంతర్జాతీయ వాణిజ్యం పెరగడం, ఈ కామర్స్ వేగవంతమైన విస్తరణతో కొత్త తరహా అనైతిక వ్యాపార ధోరణులకు ముప్పు పెరిగిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వినియోగదారుల రక్షణ కోసం డైరెక్ట్ సెల్లింగ్ నియంత్రణకు మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసిందని, ఈ కామర్స్ రంగానికి నిబంధనలను తీసుకొచ్చే పని జరుగుతోందని చెప్పారు. -
పార్లమెంటు సమాచారం
► సభాకార్యక్రమాలకు తరచూ ఆటంకం కలిగించే ఎంపీల సభ్యత్వాన్ని రద్దుచేయాలనే ప్రైవేటు బిల్లును టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ► స్వలింగ సంపర్కం నేరం కాదనే భారత శిక్షాస్మృతిలోని 377 సెక్షన్లో సవరణలు చేయాలంటూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పెట్టిన బిల్లును లోక్‌సభ తిరస్కరించింది. ► విమాన ప్రయాణికులకు పరిహారాన్ని పెంచే బిల్లుకు పార్లమెంటు ఆమోదించింది. ► పొగాకు ఉత్పత్తులపై పుర్రె గుర్తు పరిమాణాన్ని తగ్గించాలని పార్లమెంటు ప్యానల్ ఉభయ సభలకు సూచించింది. దేశంలో 27.5 కోట్ల మంది పొగాకు ఉత్తత్తులను వినియోగిస్తున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. 21 లక్షల మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులున్నారని చెప్పింది. ► భారతదేశంలోని 20 విద్యాసంస్థలు ప్రపంచ స్థాయిలో ఉండేలా సహాయం చేయనున్నట్లు స్మృతి ఇరానీ తెలిపారు. ► మార్చి 2019 కల్లా అన్ని రేషన్ షాపులను డిజిటలైజ్ చేస్తామని కేంద్ర వ్యవసాయ మంత్రి పాశ్వాన్ తెలిపారు. ► యూరియాకు వేప పూత ఉండాలన్న ప్రభుత్వ నిబంధన కారణంగా యూరియా వినియోగం తగ్గిందని కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ ఆహిర్ తెలిపారు.