
జెనీవా: భారత ఈ కామర్స్ రంగ నియంత్రణ కోసం నిబంధనలను రూపొందించే పని జరుగుతోందని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ తెలిపారు. ఈ కామర్స్ రంగం 2020 నాటికి 120 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుతుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఈ కామర్స్ రంగం ఏటా 51 శాతం మేర వృద్ధి చెందుతున్నప్పటికీ, డిజిటల్ మార్కెట్లకు సంబంధించిన చట్టాలను ఇంకా రూపొందించాల్సి ఉందన్నారు. వాణిజ్యం, అభివృద్ధిపై జెనీవాలో జరిగిన మూడో ఇంటర్ గవర్నమెంటల్ నిపుణుల బృందం సమావేశంలో పాశ్వాన్ మాట్లాడారు.
అంతర్జాతీయ సరఫరా చైన్‌ల అవతరణ, వాణిజ్య అడ్డంకులు తగ్గిపోవడం, అంతర్జాతీయ వాణిజ్యం పెరగడం, ఈ కామర్స్ వేగవంతమైన విస్తరణతో కొత్త తరహా అనైతిక వ్యాపార ధోరణులకు ముప్పు పెరిగిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వినియోగదారుల రక్షణ కోసం డైరెక్ట్ సెల్లింగ్ నియంత్రణకు మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసిందని, ఈ కామర్స్ రంగానికి నిబంధనలను తీసుకొచ్చే పని జరుగుతోందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment