Ministry of Energy
-
పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల్లో ఏపీ నం.1
సాక్షి,అమరావతి: విద్యుత్ రంగంలో సంస్కరణలు, వినూత్న సాంకేతికతలతో దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్ మరో ఘనత సాధించింది. భవిష్యత్‌లో రాష్ట్రానికి విద్యుత్ కొరత రాకుండా చేసేందుకు పంప్డ్ స్టోరేజ్ హైడ్రోపవర్ ప్రాజెక్టు (పీఎస్పీ)ల ఏర్పాటుకు శ్రీకారం చుట్డి అమలు చేయడమే కాకుండా దేశంలోనే పీఎస్పీ సామర్థ్యంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏపీ తరువాతి స్థానాల్లో రాజస్థాన్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలున్నట్టు తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం దేశం మొత్తం మీద 2030–31 నాటికి 18.8 గిగావాట్ల సామర్థ్యం ఉన్న పీఎస్పీల అవసరం ఉందని కేంద్ర ఇంధన శాఖ అంచనా వేసింది. రాష్ట్రంలో వేరియబుల్ రెన్యూవబుల్ ఎనర్జీ (వీఆర్‌ఈ)ని బ్యాలెన్స్ చేయడానికి, పీక్ అవర్ డిమాండ్‌ను చేరుకోవడానికి ప్రభుత్వం పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం ఏపీ పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ పాలసీ 2022ని రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు, ప్రోత్సాహంతో ఇతర రాష్ట్రాలకంటే మిన్నగా ఏపీలో పీఎస్పీల ఏర్పాటు జరుగుతోంది. ఇప్పటికే 32,400 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన పీఎస్పీల ఏర్పాటుకు 29 సైట్ల కోసం టెక్నో కమర్షియల్ ఫీజిబిలిటీ రిపోర్ట్ (టీసీఎఫ్‌ఆర్)లను సిద్ధం చేసింది. రాష్ట్రంలో మొత్తం 37 స్థానాల్లో 42,370 మెగావాట్ల సామర్థ్యం గల పీఎస్పీల నిర్మాణానికి స్థలాలను గుర్తించింది. మొత్తం 16,180 మెగావాట్ల సామర్థ్యం గల పీఎస్పీలు వివిధ డెవలపర్లకు కేటాయించింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఎగువ సీలేరులో 1,350 మెగావాట్ల సామర్థ్యంతో పీఎస్పీ నిర్మాణానికి కేంద్ర విద్యుత్ మండలి (సీఈఏ) అనుమతి కూడా ఇచ్చింది. ప్రైవేటు రంగంలో ఉమ్మడి కర్నూలు జిల్లా పిన్నాపురంలో గ్రీన్ కో గ్రూప్ 1,680 మెగావాట్ల ప్రాజెక్టు నిర్మిస్తోంది. ఒకే చోట మూడు రకాల (జల, పవన, సౌర) విద్యుత్ ఉత్పత్తి చేసి, నిల్వ చేసే ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక శక్తి నిల్వ ప్రాజెక్టుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు ఇదే. తాజాగా రాష్ట్రంలో 1,950 వేల మెగావాట్ల సామర్ధ్యం గల రెండు పీఎస్పీల స్థాపనకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌హెచ్‌పీసీతో ఏపీ జెన్కో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండు సంస్థల సమాన భాగస్వామ్యంతో 2,750 మెగావాట్ల సామర్థ్యం గల మరో మూడు ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. పీఎస్పీ అంటే ఇదీ.. పంప్డ్ స్టోరేజ్ హైడ్రోపవర్ అనేది ఒక రకమైన జల విద్యుత్ శక్తి నిల్వ ప్రాజెక్టు. దీనిని వేర్వేరు ఎత్తులలో ఉన్న రెండు నీటి రిజర్వాయర్లపై నిర్మిస్తారు. ఈ ప్లాంట్లు సంప్రదాయ జల విద్యుత్ ప్లాంట్లలానే పనిచేస్తాయి. వీటికి అదనంగా అదే నీటిని మళ్లీ మళ్లీ ఉపయోగించుకునే సామర్థ్యం ఉంటుంది. అంతేకాదు పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లలో పగటిపూట చార్జింగ్ సౌర ఫలకల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. రాత్రి వేళ జలాశయం ద్వారా ఎగువ రిజర్వాయర్ నుంచి దిగువ రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయడం వల్ల టర్బైన్ కిందకి కదిలి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఒక సారి నిర్మించిన ప్రాజెక్టు ఎనభై ఏళ్ల వరకూ పనిచేస్తుంది. 1890 కాలంలో ఇటలీ, స్విట్జర్లాండ్‌లో మొదలైన పీఎస్పీ సాంకేతికత 1930లో యునైటెడ్ స్టేట్స్లో అడుగుపెట్టింది. ఇప్పుడిది ప్రపంచమంతా విస్తరించింది. తాజాగా మన దేశంలో పీఎస్పీల స్థాపనలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా అవతరించింది. -
కొత్త విద్యుత్ ప్రాజెక్టులకు లక్ష ఎకరాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంధన ఎగుమతి విధానాన్ని (ఎక్స్పోర్ట్ పాలసీ) దృష్టిలో ఉంచుకుని 1,00,611.85 ఎకరాలను గుర్తించినట్టు సంప్రదాయేతర, పునరుత్పాదక వనరుల సంస్థ (నెడ్‌క్యాప్) ఎండీ రమణారెడ్డి తెలిపారు. ఈ భూమిని ఎకరా ఏడాదికి రూ.31 వేలకే లీజుకిస్తామన్నారు. రెండేళ్లకోసారి 5 శాతం లీజు పెంచుతామని చెప్పారు. ఈ మేరకు ‘సాక్షి’కి వివరించారు. ► ఏపీలో 4 వేల మెగావాట్ల సౌరశక్తి ప్లాంట్లు నెలకొల్పేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెకీ), 5 వేల మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు జాతీయ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (ఎన్టీపీసీ)లు ఆసక్తి చూపుతున్నాయి. ► డెవలపర్ ఏ ప్రాంతంలోనైనా ప్లాంటు పెట్టుకోవచ్చని, ఆన్లైన్లోనే నెడ్‌క్యాప్ పరిశీలించి అనుమతిస్తుంది. పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ అల్ట్రా మెగా రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ పార్కులను ప్రతిపాదించిందన్నారు. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో 3 నుంచి 5 వేల మెగావాట్ల సామర్థ్యం గల పార్కులను సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో త్వరలోనే 24 వేల మెగావాట్లు సోలార్, విండ్ ఉత్పత్తి జరుగుతుందని, ఫలితంగా చౌక విద్యుత్ లభించేందుకు ఏపీ కేంద్రం కాబోతోంది. -
హైట్ పెంచితే హిట్!
‘మర’ల ఎత్తు 100 మీటర్లకు పెంచితే మరింత పవన విద్యుత్ ♦ రాష్ట్రంలో 4,244 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తికి అవకాశాలు ♦ మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉత్పత్తికి వీలు ♦ జాతీయ పవన విద్యుత్ సంస్థ నివేదిక ♦ పవన విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు త్వరలో కొత్త విధానం సాక్షి, హైదరాబాద్: గాలి మరల ఎత్తును 100 మీటర్లకు పెంచితే తెలంగాణలో 4,244 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తికి ఆస్కారముందని జాతీయ పవన విద్యుత్ సంస్థ (ఎన్ఐ డబ్ల్యూఈ) అధ్యయనంలో తేలింది. కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఈ) ఆదేశాలతో దేశంలో పవన విద్యుదుత్పత్తికి ఉన్న అవకాశాలపై శాస్త్రీయ అధ్యయనం జరిపిన ఈ సంస్థ, ఇటీవల తన నివేదికను ప్రచురించింది. 100 మీటర్ల ఎత్తులో గాలి మరల ఏర్పాటు ద్వారా దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాల పరిధిలో ఏకంగా 3,02,251 మెగావాట్ల పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని ఈ నివేదిక పేర్కొంది. 2022 నాటికి దేశంలో పవన విద్యుదుత్పత్తి 66,000 మెగావాట్ల లక్ష్యాన్ని అందుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. నిర్ణీత వేగంతో గాలులు వీచే ప్రాంతాల్లో మాత్రమే పవన విద్యుత్ ఉత్పత్తికి అవకాశముంది. తీర ప్రాంతాలైతే పవన విద్యుదుత్పత్తికి అత్యంత అనుకూలం. తీర ప్రాంతాలు లేని.. వేగంగా గాలులు వీచని ప్రాంతాల్లో సంప్రదాయ పద్ధతిలో 50 మీటర్ల ఎత్తులో గాలి మరలను ఏర్పాటు చేస్తే లక్ష్యం మేరకు పవన విద్యుదుత్పత్తికి అవకాశం లేదు. ఈ నేపథ్యంలో గాలి మరల ఎత్తును 100 మీటర్లకు పెంచితే లక్ష్యానికి ఎన్నో రేట్లు ఎక్కువగా పవన విద్యుదుత్పత్తికి అవకాశముందని జాతీయ పవన విద్యుత్ సంస్థ తన నివేదికలో స్పష్టం చేసింది. కేంద్ర ఇంధన శాఖ నుంచి ఈ నివేదిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. దీని ఆధారంగానే రాష్ట్రంలో పవన విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందిస్తోంది. సాగు భూముల్లో విద్యుత్ పంట రాష్ట్రంలో మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలు మాత్రమే పవన విద్యుదుత్పత్తికి అనుకూలంగా ఉన్నాయి. రాష్ట్రంలో 4,244 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తికి అవకాశం ఉండగా, సాగుభూముల్లో 3,348 మెగావాట్లు, బీడు భూముల్లో 887 మెగావాట్లు, అటవీ భూముల్లో తొమ్మిది మెగావాట్ల ఉత్పత్తికి అవకాశముంది. తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే 371 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకోవచ్చని ఈ నివేదిక సూచించింది. చదరపు కిలోమీటర్ పరిధిలో ఆరు మెగావాట్ల వరకు విద్యుదుత్పత్తికి వీలుంటుందని తెలుస్తోంది. ఏపీలో 44,229 మెగావాట్ల పవన విద్యుత్‌కు అవకాశాలు పవన విద్యుదుత్పత్తికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యంత అనుకూలంగా ఉందని ఆ నివేదిక ద్వారా తెలుస్తోంది. 100 మీటర్ల ఎత్తులో గాలిమరల ఏర్పాటు ద్వారా ఏపీలో ఏకంగా 44,229 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తికి అవకాశముంది. సముద్ర తీర ప్రాంతం విస్తారంగా ఉండటం, రాష్ట్రం మీదుగా అత్యంత వేగంగా గాలులు వీస్తుండటం వల్ల ఏపీలో పవన విద్యుదుత్పత్తికి అనుకూల వాతావరణం ఉంది. ఇక్కడి బీడు భూముల్లోనే 22,525 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తికి అవకాశం ఉండగా, సాగుభూముల్లో 20,538 మెగావాట్లు, అటవీ భూముల్లో 1,165 మెగావాట్ల వరకు విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు.