Ministry of Petroleum
-
పీఎస్‌యూల ఆదాయాలు పెంచుతాం
ముంబై: ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)ల ఆదాయాలు పెంచేందుకు ప్రణాళికలు వేసినట్లు ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కె.కరాద్ తాజాగా స్పష్టం చేశారు. అంతేకాకుండా డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియ ద్వారా ఉద్యోగాల సృష్టి జరుగుతున్నట్లు పేర్కొన్నారు. దేశీయంగా పీఎస్‌యూలు 14 లక్షల మందికి ఉపాధి కలి్పంచినట్లు తెలియజేశారు. డిజిన్వెస్ట్‌మెంట్ అంటే కంపెనీలు నష్టాలు నమోదు చేస్తున్నట్లుకాదని వ్యాఖ్యానించారు. పీఎస్‌యూల ఆదాయం పెంపు, ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం విభిన్నతరహా ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ ఇండియా నిర్వహించిన వర్చువల్ సదస్సులో తెలియజేశారు. ఇటీవల మానిటైజేషన్ ప్రక్రియ ద్వారా ప్రభుత్వం రూ. 6 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రణాళికలు ప్రకటించినట్లు ప్రస్తావించారు. గత నెలలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రోడ్లు, విద్యుత్, రైల్వేలుసహా పలు రంగాలకు చెందిన మౌలిక ఆస్తులకు సంబంధించి జాతీయ మానిటైజేషన్ పైప్‌లైన్(ఎన్ఎంపీ)ను ప్రకటించిన విషయం విదితమే. సంపద సృష్టి పెట్రోలియం, సహజవాయు శాఖ సెక్రటరీ తరుణ్ కపూర్ సైతం పీఎస్‌యూలు ఉద్యోగ కల్పన చేస్తున్నట్లు సదస్సులో పేర్కొన్నారు. దేశానికి సంపదను సృష్టించడమే కాకుండా వాటాదారులకు డివిడెండ్లను పంచుతున్నట్లు ప్రస్తావించారు. దేశాభివృద్ధిలో ప్రభుత్వ రంగ కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలియజేశారు. ఇది కొనసాగుతుందని చెప్పారు. మానవ వనరుల శిక్షణకు పీఎస్‌యూలు ఉపయోగపడుతున్నట్లు పేర్కొన్నారు. ఉదాహరణకు ఓఎన్జీసీలో పనిచేసిన నిపుణులు తదుపరి కంపెనీని వీడి ప్రైవేట్ రంగంలో ఉపాధి పొందుతున్నట్లు వెల్లడించారు. -
గ్యాస్ వినియోగదారులకు శుభవార్త..! ఇకపై..
న్యూ ఢిల్లీ: ఎల్పీజీ సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో గ్యాస్ వినియోగదారులు ఇకపై తమకు నచ్చిన డిస్ట్రిబ్యూటర్ నుంచి రిఫిల్ సిలిండర్లను పొందవచ్చునని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ గురువారం రోజున ప్రకటన చేసింది. కాగా ఈ సదుపాయాన్ని ప్రస్తుతం చండీగఢ్, కోయంబత్తూర్, గుర్గావ్, పూణే, రాంచీ నగరాలల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనుంది. త్వరలోనే ఈ సదుపాయం దేశవ్యాప్తంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలైన బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఒసీలతో జతకట్టి రాష్ట్రాలలో 21,000 ఇప్పటివరకు ఎల్పిజి కేంద్రాలను తెరిచినట్లు సీఎస్సీ ఎస్పీవీ డైరక్టర్ దినేష్ త్యాగి ఒక ప్రకటనలో తెలిపారు.అంతేకాకుండా దేశవ్యాప్తంగా మార్చి 2022 నాటికి గ్రామీణ, పట్టణ ప్రాంతాలపై దృష్టి సారించి సుమారు ఒక లక్ష ఎల్పీజీ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పై భారీ ఆఫర్ -
500 రూపాయల కోట్లు కనీసం ఉండాలి..
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ఇంధన విక్రయాల లైసెన్సు నిబంధనలకు సంబంధించి కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ వివరణనిచ్చింది. రిటైల్, బల్క్ కొనుగోలుదారులకు ఈ రెండింటినీ విక్రయించేందుకు లైసెన్సు కావాలంటే దరఖాస్తు చేసుకునే సమయానికి కనీసం రూ. 500 కోట్లు నికర విలువ ఉండాలని పేర్కొంది. బల్క్ లేదా రిటైల్ వినియోగదారులకు (ఏదో ఒక వర్గానికి మాత్రమే) పెట్రోల్, డీజిల్ విక్రయ లైసెన్సు పొందాలంటే కనీసం రూ. 250 కోట్ల నికర విలువ ఉండాలని తెలిపింది. గతేడాది ప్రకటించిన ఇంధన లైసెన్సింగ్ విధానంపై కేంద్రం ఈ మేరకు స్పష్టతనిచ్చింది. దేశీయంగా ఇంధన రంగంలో పోటీని ప్రోత్సహించేందుకు విక్రయాల నిబంధనలను సడలిస్తూ ప్రభుత్వం గతేడాది నిర్ణయం తీసుకుంది. చమురుయేతర సంస్థలను కూడా ఈ విభాగంలోకి అనుమతించింది. తద్వారా ప్రైవేట్, విదేశీ సంస్థలు కూడా ఇందులో ప్రవేశించేందుకు వీలు లభించినట్లయింది. గత నిబంధనల ప్రకారం భారత్‌లో ఇంధన రిటైలింగ్ లైసెన్స్ పొందాలంటే సదరు సంస్థ హైడ్రోకార్బన్ల అన్వేషణ ఉత్పత్తి, రిఫైనింగ్, పైప్లైన్లు లేదా ధ్రువీకృత సహజ వాయువు టెర్మినల్స్ మొదలైన వాటిలో రూ. 2,000 కోట్లు ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చేది. -
నిరంతర విద్యుత్ ఎప్పుడిస్తారు?
ఆంద్రప్రదేశ్ తీరుపై కేంద్రం అసంతృప్తి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు కేంద్ర ఇంధనశాఖ ఆదేశం గ్రీన్ ఎనర్జీ కారిడార్‌కు రూ.1,350 కోట్లు మంజూరు రాష్ట్రానికిచ్చే సోలార్ పంపుసెట్లు 4,000 నుంచి 8,000 కు పెంపు వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ నుంచి అదనంగా లక్ష మిలియన్ టన్నుల బొగ్గు ‘నిరంతర విద్యుత్’పై ఏపీ అధికారులతో కేంద్ర అధికారుల సమీక్ష సాక్షి, హైదరాబాద్: ‘ఇంతకీ మీ రాష్ట్రంలో నిరంతర విద్యుత్ పథకాన్ని ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తున్నారు? అసలు అమలు చేసే వీలుందా? వెనకడుగు వేయడానికి కారణాలు ఏంటి? సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండానే ముందుకొస్తే ఎలా? దీనివల్ల కేంద్రం అబాసుపాలవ్వదా?’ అంటూ ఆంధ్రప్రదేశ్ ఇంధన అధికారులపై కేంద్ర విద్యుత్ అధికారులు అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలిసింది. నిరంతర విద్యుత్ సరఫరా అంశంపై గురువారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ నుంచి రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి అజయ్‌జైన్, కోల్ డెరైక్టర్ ప్రభాకర్‌రావు హాజరయ్యారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్.ఎన్.చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంప్రదాయేతేర ఇంధన వనరులు, పునరుత్పాదన బొగ్గు మంత్రిత్వశాఖ, ఆర్థిక, పెట్రోలియం శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో నిరంతర విద్యుత్‌ను అమలు చేయకపోవడం, దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయడంపై కేంద్ర అధికారులు కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. పథకం పేరుతో నిధులు కోరుతున్నారే తప్ప, ఇది కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుందనే ప్రచారం చేయకపోవడం ఏమిటని ప్రశ్నించినట్టు చెప్తున్నారు. ఈ అంశంపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శిని కేంద్రం ఆదేశించినట్టు సమాచారం. కేంద్రం ఈ పథకాన్ని వెల్లడించిన అతి కొద్ది సమయంలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకంలోకి తమ రాష్ట్రాన్ని చేర్చాలని కోరారు. ఆయన ఒత్తిడి మేరకు సెప్టెంబర్‌లోనే ఆర్భాటంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందాలు జరిగాయి. అక్టోబర్ 2వ తేదీ నుంచి పథకాన్ని అధికారికంగా వెల్లడిస్తామని బాబు స్వయంగా చెప్పారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్‌కు రూ. 1,350 కోట్లు ఏపీలో నిరంతర విద్యుత్ పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం మరికొన్ని రాయితీలను ప్రకటించింది. సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధికి జాతీయ హరిత ఇంధన నిధి కింద రాష్ట్రంలోని గ్రీన్ ఎనర్జీ కారిడార్‌కు రూ. 1,350 కోట్లు మంజూరు చేస్తున్నట్టు వెల్లడించింది. సోలార్ పంపుసెట్లను 4,000 నుంచి 8,000 కు పెంచింది. సమావేశ వివరాలను స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి మీడియాకు వివరిస్తూ.. రాష్ట్రంలో 20 ఏళ్ళ కిందట ఏర్పాటురేసిన ఎన్టీపీసీ, ఆర్‌టీపీపీలను ఆధునీకరించాలని కేంద్రం దృష్టికి తెచ్చామన్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి బొగ్గు తగ్గిందనే విషయాన్నీ కేంద్ర ఇంధన శాఖకు తెలిపామని.. వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ నుంచి అదనంగా లక్ష మిలియన్ టన్నుల బొగ్గు ఇచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసిందని వివరించారు. ఏపీలో విద్యుత్ పంపిణీ, సరఫరా నష్టాలపై ఈ సమావేశంలో అజయ్‌జైన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. -
సహజ వాయువుకు జూలై 1 నుంచి కొత్త రేట్లు!
త్వరలో నిర్ణయం తీసుకోనున్న కొత్త కేబినెట్ న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసే సహజవాయువు రేట్ల పెంపు, కొత్త ధరలను ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం. మోడీ కొత్త సర్కారు కొలువుదీరిన నేపథ్యంలో కేబినెట్ త్వరలోనే ఇందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని పెట్రోలియం శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు గురువారం వెల్లడించారు. వాస్తవానికి రంగరాజన్ కమిటీ ఫార్ములా ప్రకారం రిలయన్స్ కేజీ-డీ6 సహా ఇతర కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న దేశీ గ్యాస్ రేటును ఇప్పుడున్న 4.2 డాలర్ల(ఒక్కో యూనిట్‌కి) నుంచి దాదాపు రెట్టింపు స్థాయిలో 8.3 డాలర్లకు పెంచుతూ యూపీఏ ప్రభుత్వం గతేడాదే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ కొత్త రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ పెంపు వాయిదా పడింది. ఇప్పుడు ఎన్నికలు పూర్తయి కొత్త సర్కారు కూడా రావడంతో కొత్త రేట్ల అమలు అనివార్యం కానుంది. మార్చి 31తో కాంట్రాక్టు గడువు ముగిసినప్పటికీ... పాత రేటు ప్రకారమే గ్యాస్‌ను విక్రయిస్తున్న రిలయన్స్‌కు జూలై 1 నుంచి కొత్త రేట్ల అమలు ఉండొచ్చని తాము చెప్పామని.. ఈ నేపథ్యంలో అంతకుముందే కేబినెట్ ఆమోదముద్ర వేయాల్సి ఉందన్నారు. అయితే, రంగరాజన్ కమిటీ ఫార్ములాపై తమకు ఒక స్పష్టత వచ్చాకే కొత్త రేటును చమురు శాఖ మళ్లీ ప్రకటిస్తుందని.. దీన్ని కూడా కేబినెట్ ఆమోదించాకే వర్తింపజేస్తామని ఆ అధికారి చెప్పారు. త్వరలో చమురు, గ్యాస్ రంగానికి సంబంధించి వివరాలను ప్రధాని నరేంద్ర మోడీకి చమురు శాఖ తెలియజేయనుంది. ఆతర్వాత గ్యాస్ ధరల విధానంపై స్పష్టమైన దిశానిర్దేశం ఉండొచ్చని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.