సహజ వాయువుకు జూలై 1 నుంచి కొత్త రేట్లు!
త్వరలో నిర్ణయం తీసుకోనున్న కొత్త కేబినెట్
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసే సహజవాయువు రేట్ల పెంపు, కొత్త ధరలను ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం. మోడీ కొత్త సర్కారు కొలువుదీరిన నేపథ్యంలో కేబినెట్ త్వరలోనే ఇందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని పెట్రోలియం శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు గురువారం వెల్లడించారు. వాస్తవానికి రంగరాజన్ కమిటీ ఫార్ములా ప్రకారం రిలయన్స్ కేజీ-డీ6 సహా ఇతర కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న దేశీ గ్యాస్ రేటును ఇప్పుడున్న 4.2 డాలర్ల(ఒక్కో యూనిట్‌కి) నుంచి దాదాపు రెట్టింపు స్థాయిలో 8.3 డాలర్లకు పెంచుతూ యూపీఏ ప్రభుత్వం గతేడాదే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
ఈ కొత్త రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ పెంపు వాయిదా పడింది. ఇప్పుడు ఎన్నికలు పూర్తయి కొత్త సర్కారు కూడా రావడంతో కొత్త రేట్ల అమలు అనివార్యం కానుంది. మార్చి 31తో కాంట్రాక్టు గడువు ముగిసినప్పటికీ... పాత రేటు ప్రకారమే గ్యాస్‌ను విక్రయిస్తున్న రిలయన్స్‌కు జూలై 1 నుంచి కొత్త రేట్ల అమలు ఉండొచ్చని తాము చెప్పామని.. ఈ నేపథ్యంలో అంతకుముందే కేబినెట్ ఆమోదముద్ర వేయాల్సి ఉందన్నారు.
అయితే, రంగరాజన్ కమిటీ ఫార్ములాపై తమకు ఒక స్పష్టత వచ్చాకే కొత్త రేటును చమురు శాఖ మళ్లీ ప్రకటిస్తుందని.. దీన్ని కూడా కేబినెట్ ఆమోదించాకే వర్తింపజేస్తామని ఆ అధికారి చెప్పారు. త్వరలో చమురు, గ్యాస్ రంగానికి సంబంధించి వివరాలను ప్రధాని నరేంద్ర మోడీకి చమురు శాఖ తెలియజేయనుంది. ఆతర్వాత గ్యాస్ ధరల విధానంపై స్పష్టమైన దిశానిర్దేశం ఉండొచ్చని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.