- ఆంద్రప్రదేశ్ తీరుపై కేంద్రం అసంతృప్తి
- సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు కేంద్ర ఇంధనశాఖ ఆదేశం
- గ్రీన్ ఎనర్జీ కారిడార్‌కు రూ.1,350 కోట్లు మంజూరు
- రాష్ట్రానికిచ్చే సోలార్ పంపుసెట్లు 4,000 నుంచి 8,000 కు పెంపు
- వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ నుంచి అదనంగా లక్ష మిలియన్ టన్నుల బొగ్గు
- ‘నిరంతర విద్యుత్’పై ఏపీ అధికారులతో కేంద్ర అధికారుల సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ‘ఇంతకీ మీ రాష్ట్రంలో నిరంతర విద్యుత్ పథకాన్ని ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తున్నారు? అసలు అమలు చేసే వీలుందా? వెనకడుగు వేయడానికి కారణాలు ఏంటి? సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండానే ముందుకొస్తే ఎలా? దీనివల్ల కేంద్రం అబాసుపాలవ్వదా?’ అంటూ ఆంధ్రప్రదేశ్ ఇంధన అధికారులపై కేంద్ర విద్యుత్ అధికారులు అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలిసింది. నిరంతర విద్యుత్ సరఫరా అంశంపై గురువారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమానికి ఏపీ నుంచి రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి అజయ్‌జైన్, కోల్ డెరైక్టర్ ప్రభాకర్‌రావు హాజరయ్యారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్.ఎన్.చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంప్రదాయేతేర ఇంధన వనరులు, పునరుత్పాదన బొగ్గు మంత్రిత్వశాఖ, ఆర్థిక, పెట్రోలియం శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా.. రాష్ట్రంలో నిరంతర విద్యుత్‌ను అమలు చేయకపోవడం, దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయడంపై కేంద్ర అధికారులు కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. పథకం పేరుతో నిధులు కోరుతున్నారే తప్ప, ఇది కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుందనే ప్రచారం చేయకపోవడం ఏమిటని ప్రశ్నించినట్టు చెప్తున్నారు.
ఈ అంశంపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శిని కేంద్రం ఆదేశించినట్టు సమాచారం. కేంద్రం ఈ పథకాన్ని వెల్లడించిన అతి కొద్ది సమయంలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకంలోకి తమ రాష్ట్రాన్ని చేర్చాలని కోరారు. ఆయన ఒత్తిడి మేరకు సెప్టెంబర్‌లోనే ఆర్భాటంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందాలు జరిగాయి. అక్టోబర్ 2వ తేదీ నుంచి పథకాన్ని అధికారికంగా వెల్లడిస్తామని బాబు స్వయంగా చెప్పారు.
గ్రీన్ ఎనర్జీ కారిడార్‌కు రూ. 1,350 కోట్లు
ఏపీలో నిరంతర విద్యుత్ పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం మరికొన్ని రాయితీలను ప్రకటించింది. సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధికి జాతీయ హరిత ఇంధన నిధి కింద రాష్ట్రంలోని గ్రీన్ ఎనర్జీ కారిడార్‌కు రూ. 1,350 కోట్లు మంజూరు చేస్తున్నట్టు వెల్లడించింది. సోలార్ పంపుసెట్లను 4,000 నుంచి 8,000 కు పెంచింది. సమావేశ వివరాలను స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి మీడియాకు వివరిస్తూ.. రాష్ట్రంలో 20 ఏళ్ళ కిందట ఏర్పాటురేసిన ఎన్‌టీపీసీ, ఆర్‌టీపీపీలను ఆధునీకరించాలని కేంద్రం దృష్టికి తెచ్చామన్నారు.
థర్మల్ విద్యుత్ కేంద్రాలకు మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి బొగ్గు తగ్గిందనే విషయాన్నీ కేంద్ర ఇంధన శాఖకు తెలిపామని.. వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ నుంచి అదనంగా లక్ష మిలియన్ టన్నుల బొగ్గు ఇచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసిందని వివరించారు. ఏపీలో విద్యుత్ పంపిణీ, సరఫరా నష్టాలపై ఈ సమావేశంలో అజయ్‌జైన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.