గోరింటాకు తంటా..!
మెహందీ పెట్టుకోలేదని పెళ్లికి నిరాకరణ
పోలీసుల అదుపులో వరుడు
పంజగుట్ట: వధువు గోరింటాకు పెట్టుకోలేదన్న కోపంతో వరుడు పెళ్లికి నిరాకరించాడు. ఈనెల 8న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంజగుట్ట పోలీసుల కథనం ప్రకారం.. కంచన్‌బాగ్ ఉమర్ కాలనీలో నివాసముంటున్న మీర్ మసూద్ అలీ(32) దుబాయ్‌లో పనిచేస్తున్నాడు. ఇతనికి గతంలో వివాహమైంది. భార్యతో గొడవలు రావడంతో విడాకులు తీసుకున్నాడు. ఎంఎస్ మక్తాకు చెందిన ఎండీ గౌస్ పాషా కుమార్తె(23)తో రెండో వివాహం చేసేందుకు పెద్దలు నిర్ణయించారు .
ఈనెల 8న వివాహం చేసేందుకు ఇరు కుటుంబాలు సిద్ధమయ్యాయి. పెళ్లి సమయంలో వరుడికి ఇవ్వాల్సిన సామగ్రి మొత్తం ముందుగానే ఇచ్చేశారు. 7వ తేదీ రాత్రి మసూద్ అలీ బంధువులు వధువును పెళ్లి కూతురును చేసేందుకు గౌస్ పాషా ఇంటికి వచ్చారు. అప్పటికి ఆమె మెహందీ పెట్టుకోకపోవడాన్ని గమనించిన వారు ఆగ్రహం వ్యక్తం చేసి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని వరుడికి చెప్పారు. తాను పెళ్లి చేసుకోవడంలేదని గౌస్‌కు ఫోన్ చేశాడు అలీ. తెల్లవారితే జరగాల్సిన పెళ్లి ఆగిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.
బంధువులందరికీ పెళ్లి కార్డులు పంచామని, ఈ సమయంలో వివాహం రద్దు చేసుకోవద్దని ప్రాధేయపడ్డా వరుడు వినిపించుకోలేదు. బాధితులు చేసేది లేక ఖైరతాబాద్ కార్పొరేటర్ మహ్మద్ షరీఫ్ సహాయంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సోమవారం వరుడు మసూద్ అలీని అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు.