బాలుని బలిగొన్న క్వారీ
విజయనగరం: ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో ఓ చిన్నారి సరదాగా ఆడుకుందామని వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా భోగాపురం మండలం రామచంద్రపేట గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. వివరాలు...మిరాకిల్ సాఫ్ట్ వేర్ కంపెనీ గ్రామంలో ఓ కంకరరాయి క్వారీని నిర్వహిస్తోంది. ఇదిలాఉండగా అదే గ్రామానికి చెందిన 3 వ తరగతి విద్యార్థి దుక్క రమేష్(8) ఆదివారం స్నేహితులతో కలసి ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ క్వారీలోకి పడిపోవడంతో మృతి చెందాడు. ఇదే క్వారీలో ఇంతకుముందు ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తూ పడిపోయి మృతి చెందారు. తాజా ఘటనతో గ్రామస్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రమేష్ మృతదేహాన్ని క్వారీ ముందు ఉంచి వారు ఆందోళనకు దిగారు. క్వారీని మూసి వేయాలని లేదా మృతి చెందిన బాలుడి కుటుంబానికి పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
(భోగాపురం)