miryala raji reddy
-
'అధిష్టానం నిర్ణయం బాధ కలిగించింది'
కార్యకర్తల అభీష్టం మేరకే భవిష్యత్ నిర్ణయం ‘సాక్షి’తో టీబీజీకేఎస్ నేత మిర్యాల రాజిరెడ్డి రామకృష్ణాపూర్(ఆదిలాబాద్): ‘పొలిటీషియన్‌లా కాకుండా కార్మికులకు నిస్వార్థంగా సేవ చేయాలనే ఆలోచనతోనే ట్రేడ్ యూనియన్‌లో చేరాను.. పారదర్శకంగా సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో హైకమాండ్ నన్ను పక్కనబెట్టడం బాధ కలిగించింది’.. అని టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నేత మిర్యాల రాజిరెడ్డి అన్నారు. టీబీజీకేఎస్ నూతన కమిటీ ప్రకటించిన నేపథ్యంలో సోమవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రశ్న : నూతన కమిటీ ఏర్పాటు క్రమంలో అధిష్టానం మిమ్మల్ని సంప్రదించిందా? జవాబు : సంప్రదించారు. టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీని వాస్‌రెడ్డి నాతో మాట్లాడారు. కొద్దిరోజుల తర్వాత సరైన స్థానంలో నియమిస్తామని చెప్పారు. త్వరలో ఎన్నికలు ఉన్నందున యూనియన్ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. నూతన కమిటీ నియామకంలో అధిష్టానం ఆంతర్యమేమిటీ..? గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కమిటీ మార్పు అనివార్యమని అధిష్టానం భావించింది. గెలుపే లక్ష్యంగా కొన్ని సర్ధుబాట్లు తప్పవని, అందుకే నూతన కమిటీని ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్‌పై ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు..? కొత్తగా ఏ నిర్ణయం తీసుకునేది లేదు. గుర్తింపు ఎన్నికలు జరిగేలోపు సముచిత స్థానం దక్కుతుందనే ఆశిస్తున్నాను. నా అనుచరగణం, నాయకుల కోసం పని చేస్తా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర యూనియన్‌లో చేరేది లేదు. అధిష్టాన నిర్ణయం మీకెలా అనిపించింది.? ఉన్నట్టుండి కమిటీని మార్చడం కొంత బాధ కలిగిన మాట వాస్తవమే. కాకపోతే ముందస్తుగా అధిష్టానం సంప్రదించింది కాబట్టి ఇబ్బందికరంగా భావించడం లేదు. నన్ను నమ్ముకున్న నాయకులకు, క్యాడర్‌కు మాత్రం నిరాశ కలిగించింది. కొత్త యూనియన్ పెట్టే ఆలోచన ఏమైనా ఉందా? అలాంటి ఆలోచనే లేదు. నేను స్వతహాగా సింగరేణి ఉద్యోగిని. ఇంకా ఎనిమిదేళ్ల సర్వీసు ఉంది. కార్మిక క్షేత్రంలోనే ఉంటా.. పొలిటీషియన్‌లా కాకుండా ట్రేడ్ యూనియన్ నాయకుడిలా నిస్వార్థంగా సేవలందిస్తా. ఇతర యూనియన్ల నుంచి పిలుపులు వస్తున్నాయని తెలిసింది..? కొన్ని సంఘాల నుంచి పిలుపులు వస్తున్న మాట వాస్తవమే. నాయకులు సంప్రదింపులు జరుపుతున్నారు. తమ యూనియన్లలోకి రమ్మంటున్నారు. అయినా పెద్దగా ఆసక్తి లేదు. అధిష్టానం చెప్పిన విధంగా టీజీబీకేఎస్లోనే కొనసాగుతాం. కార్మికులను, క్యాడర్‌ను ముందుకు నడిపి యూనియన్ విజయం కోసం పాటుపడతా. మీపై వచ్చిన విమర్శలు మార్పులకు కారణమై ఉంటాయా..? జ: ఇప్పటి దాకా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. నాపై ఎమ్మెల్యేలకు సదాభిప్రాయమే ఉందని మేడం(కవిత) చెప్పారు. పారదర్శకంగా ఉంటానన్న సంకేతాలు అధిష్టానానికి చేరాయి. కాకపోతే ఏవైనా లోపాలుంటే చెబితే సరిచేసుకునే అవకాశం ఉండేది. -
కార్మికవర్గ ప్రయోజనాలే ముఖ్యం
డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ సాధిస్తాం అనుబంధ పరిశ్రమలు, నూతన గనుల ఏర్పాటుకు కృషి పనిచేసే వారికే కమిటీల్లో చోటు కల్పిస్తాం టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి రామకృష్ణాపూర్(ఆదిలాబాద్), న్యూస్‌లైన్ : కార్మికవర్గ ప్రయోజ నాలకే ముఖ్యం.. పని చేసే వారికే కమిటీల్లో చోటు కల్పిస్తామని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి వెల్లడించారు. కార్మికుల్లో ప్రశ్నించే తత్వం రావాలి.. నాయకత్వ లోపాలను ఎత్తిచూపేవారికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. డిపెండెంట్ ఎంప్లాయ్‌మెం ట్ సాధించడంతోపాటు నూతన టెక్నాలజీ ని వినియోగించుకొని అనుబంధ పరిశ్రమ లు, నూతన గనుల స్థాపన ప్రధాన ఎజెండ గా ముందుకు సాగనున్నట్లు పేర్కొన్నారు. యూనియన్ అంతర్గత ఎన్నికలలో విజయం సాధించిన సందర్భంగా ‘న్యూస్‌లైన్’కు ఇచ్చి న ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను వెల్లడించారు. వివరాలు రాజిరెడ్డి మాటల్లోనే.. ప్రశ్న : కార్మికుల తీర్పును మీరెలాఆస్వాదిస్తున్నారు.? జవాబు : తీర్పు ఊహించినదే. కార్మికవర్గం ఎప్పుడూ ధర్మాన్ని, న్యాయాన్ని బలపరుస్తూ వచ్చింది. వారి నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా బాధ్యతను గుర్తెరిగి.. పద్ధతిగా వ్యవహరిస్తాం. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఎలా సాధిస్తారు? డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది న్యాయమైన కోరిక. కార్మికుల పిల్లలకు బొగ్గుబావు ల్లో పనిపై అవగాహన ఉంటుంది. దీనిని సాధించేందుకు కొత్తగా ఏర్పడే ప్రభుత్వంతో చర్చిస్తాం. యాజమాన్యంపై ఒత్తిడి తెస్తాం. అన్ని సంఘాలను కలుపుకొని ఐక్య ఉద్యమా లు నిర్మిస్తాం. అవసరమైతే సమ్మె చేపడతాం. కోల్‌బెల్ట్ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య తీరడానికి కార్యాచరణ ఏమైనా ఉందా..? నూతన టెక్నాలజీని వినియోగించుకొని కొత్త గనుల ఏర్పాటుతోపాటు సంస్థ వినియోగిం చే పరికరాలన్నింటినీ అనుబంధ పరిశ్రమల ద్వారానే ఉత్పత్తి చేసేలా యాజమాన్యం చొరవ చూపాలి. థర్మల్, సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలి. ఇందుకోసం సంస్థపై ఒత్తిడి తీసుకువస్తాం. అప్మెల్తో సంస్థ ఒప్పందాన్ని రద్దు చేయిస్తాం. సకలజనుల సమ్మె నాటి అడ్వాన్స్‌ను మాఫీ చేయిస్తారా..? సకలజనుల సమ్మె కాలం నాటి *25వేల అడ్వాన్స్ మాఫీ కోసం చిత్తశుద్ధితో పోరాడుతాం. కార్మికులు లీవులు పెట్టకుండా, పండుగలకు పోకుండా ఐదున్నర నెలలు నిర్విరామంగా కృషి చేసి సంస్థను కాపాడుకోవడాని కి పాటుపడ్డారు. నాయకుల ఉచిత మస్టర్లను మీరు సమర్థిస్తారా..? ఎట్టిపరిస్థితుల్లో సమర్థించం. కార్మికులతో కలిసి పనిచేసే వారికే కార్యవర్గంలో చోటు కల్పిస్తాం. ఈ క్రమంలో నాయకులకు మస్టర్ల పరంగా కొంత వెసులుబాటు కల్పించాల్సిన అవసరం మేనేజ్మెంట్పై ఉంటుంది. యూనియన్ ఫండ్‌ను కార్మిక సంక్షేమానికి ఎలా వినియోగిస్తారు..? గని ప్రమాదల్లో మృతిచెందిన కార్మికుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడానికి యూనియన్ ఫండ్ నుంచి కొంత వెచ్చించాలనేది నా తపన. కార్మికుడు చనిపోయినప్పు డు దూర ప్రాంతంలో ఉండే వారి పిల్లలు వచ్చే వరకూ శవాన్ని పరిరక్షించడానికి కనీ సం ఫ్రీజర్లు సింగరేణిలో లేవు. మృతదేహా న్ని ఇంటికి తీసుకెళ్లేందుకు సైతం అంబులెన్స్‌లు ఇవ్వడం లేదు. ఈ విషాయాలపై మేనేజ్మెంట్తో మాట్లాడుతూనే యూనియన్ పరంగా అవసరమైన చర్యలు చేపడతాం. హెల్ప్‌లైన్, హెల్ప్ డెస్క్‌ల ఏర్పాటుపై..? ప్రతీ ఏరియాలో హెల్ప్‌లైన్, ఏరియా ఆస్పత్రుల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేస్తాం. గతంలో కేసీఆర్ కూడా ఈ విషయం చెప్పా రు. హెల్ప్‌లైన్‌కు వచ్చే సమస్యలు, సలహాల విషయంలో ఒక టీంను ఏర్పాటు చేసి ఎప్పటి కప్పుడు సమీక్షిస్తాం. మల్లయ్య వర్గాన్ని టీఆర్ఎస్ బలపర్చింది కదా.. పార్టీ విషయంలో మీ వైఖరేంటి? కేసీఆర్ మా లీడర్. ఆయనను తండ్రిగానే భావిస్తున్నా. బహుషా మల్లయ్య వర్గీయులు ఎన్నికల్లో లబ్ధి కోసం టెక్నికల్‌గా ప్రకటన చేయించి ఉంటారు. టీఆర్ఎస్ పార్టీ పట్ల మాది ఎప్పటికీ సాఫ్ట్ కార్నరే. సికాస స్టైల్లో పనిచేస్తామంటున్నారు.. ఎలా..? సికాస స్టైల్ అంటే.. సమస్యను లేవనెత్తడం. పరిష్కారం కోసం దేనినైనా ఎదుర్కోవటం. ముఖ్యంగా కార్మిక వర్గంలో ప్రశ్నించే తత్వం అలవడాలి. అధికారులను నిలదీసే పరిస్థితి రావాలి. అదే విధంగా డబ్బులకోసం నాయకులు పనిచేసినా నిలదీయాలి. ప్రశించే వాళ్ల కు మేము అండగా నిలుస్తాం. -
టీఆర్ఎస్కు షాక్
పార్టీ మద్దతిచ్చిన మల్లయ్య ప్యానల్ ఘోర పరాజయం కార్మికుల్లో వ్యతిరేకతను అంచనా వేయడంలో విఫలం తీర్పుపై పార్టీలో మల్లగుల్లాలు శ్రీరాంపూర్, న్యూస్‌లైన్ : సింగరేణిలో టీఆర్ఎస్కు షాక్ తగిలింది. సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌లో కెం గర్ల మల్లయ్య, మిర్యాల రాజిరెడ్డి ప్యానల్ల మధ్య ఆదివా రం జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతిచ్చిన కెంగర్ల మల్లయ్య ప్యానల్ ఘోర పరాజయం చవిచూడటం పార్టీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. రాజిరెడ్డి ప్యానల్ 4,592 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందింది. రెండు గ్రూపుల మధ్య వివాదాన్ని పరిష్కరించడంలో విఫలం అయిన పార్టీ ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలనే దానిలో కూడా విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. రాజిరెడ్డి వర్గం కూడా మొదటి నుంచి కేసీఆర్ ఫొటో పెట్టుకొని గులాబీ కండువా కప్పుకొనే ప్రచారం మొదలు పెట్టింది. ఎన్నికలు కొద్ది రోజులు ఉండగా టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, నల్లాల ఓదెలు, ఎంపీ వివేక్‌లు కలిసి కెంగర్ల మల్లయ్య ప్యానల్‌కే టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. కొందరు కాంగ్రెస్ భావజాలం గల వ్యక్తులు రాజిరెడ్డి వర్గంతో కలిసి టీబీజీకేఎస్‌ను విచ్చిన్నం చేయడానికి కుట్ర చేస్తున్నాయని, రాజిరెడ్డికి టీఆర్ఎస్కు ఎలాంటి సంబంధం లేదని ప్రచారం చేశారు. నల్లాల ఓదెలు అయితే గనులకు వద్దకు వెళ్లి మరి ప్రచారం చేశారు. కార్మికుల వ్యతిరేకతను గుర్తించక.. జాతీయ సంఘాలను కాదని తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ను కార్మికులు, తెలంగాణ వాదులు గెలిపించారు. గెలిచిన తరువాత మల్లయ్య వర్గం నేతలపై కార్మికుల్లో వస్తున్న వ్యతిరేకతను పార్టీ గుర్తించలేకపోయింది. ఫిట్ స్థాయి నుంచి మొదలు కొని డివిజన్, కేంద్ర కమిటీ నేతలపై తీవ్ర వ్యతిరేక పవనాలు వీచాయి. అవినీతి ఆరోపణలు, కార్మికుల సమస్యలు పట్టించుకోకపోవడం, యాజమాన్యానికి సహకరించారనే ఆరోపణలున్నాయి. ఈ పరిణామాలతో కార్మికులు మల్లయ్య నాయత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దీన్ని పార్టీ గుర్తించలేదు. దీంతో పార్టీ మద్దతిచ్చినా కాార్మికుల ఆగ్రహం ముందు అది చిన్నదైంది. కాగా, సింగరేణి విస్తరించిన నాలుగు జిల్లాల్లో ఈ ఎన్నికలు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో సింగరేణి కార్మికులు ఇచ్చిన ఈ విలక్షణ తీర్పు మున్ముందు ఎలాంటి ప్రభావం చూపుతున్నది చూడాలి. రాజిరెడ్డి ఎటువైపు..? పార్టీ సంబంధం లేదని చెప్పినా కూడా రాజిరెడ్డి వర్గం నేతలు కేసీఆర్ ఫొటోనే పెట్టుకొని గెలిచిన తరువాత ఆయన నాయకత్వంలోనే పని చేస్తామంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు అన్నట్లుగానే పార్టీకి అనుబంధంగా పని చేస్తారా స్వయం ప్రతిపత్తిగా ఉంటారా అన్నది చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే రాజిరెడ్డిని వెనుకుండి నడిపించిన ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి స్వయంగా ఈ ప్యానల్ నేతలతో కలిసి గెలుపుపత్రం పట్టుకొని కేసీఆర్ వద్దకు వెళ్లి వాస్తవ పరిస్థితిని వివరిస్తారని విశ్వాసనీయ సమాచారం. ఏది ఏమైనా పార్టీ ఎవరికీ మద్దతివ్వకుండా ఉంటే బాగుండేదని పలువురు భావిస్తున్నారు.