పార్టీ మద్దతిచ్చిన మల్లయ్య ప్యానల్ ఘోర పరాజయం
కార్మికుల్లో వ్యతిరేకతను అంచనా వేయడంలో విఫలం
తీర్పుపై పార్టీలో మల్లగుల్లాలు
శ్రీరాంపూర్, న్యూస్‌లైన్ : సింగరేణిలో టీఆర్‌ఎస్‌కు షాక్ తగిలింది. సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌లో కెం గర్ల మల్లయ్య, మిర్యాల రాజిరెడ్డి ప్యానల్ల మధ్య ఆదివా రం జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మద్దతిచ్చిన కెంగర్ల మల్లయ్య ప్యానల్ ఘోర పరాజయం చవిచూడటం పార్టీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. రాజిరెడ్డి ప్యానల్ 4,592 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందింది. రెండు గ్రూపుల మధ్య వివాదాన్ని పరిష్కరించడంలో విఫలం అయిన పార్టీ ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలనే దానిలో కూడా విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. రాజిరెడ్డి వర్గం కూడా మొదటి నుంచి కేసీఆర్ ఫొటో పెట్టుకొని గులాబీ కండువా కప్పుకొనే ప్రచారం మొదలు పెట్టింది. ఎన్నికలు కొద్ది రోజులు ఉండగా టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, నల్లాల ఓదెలు, ఎంపీ వివేక్‌లు కలిసి కెంగర్ల మల్లయ్య ప్యానల్‌కే టీఆర్‌ఎస్ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. కొందరు కాంగ్రెస్ భావజాలం గల వ్యక్తులు రాజిరెడ్డి వర్గంతో కలిసి టీబీజీకేఎస్‌ను విచ్చిన్నం చేయడానికి కుట్ర చేస్తున్నాయని, రాజిరెడ్డికి టీఆర్‌ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదని ప్రచారం చేశారు. నల్లాల ఓదెలు అయితే గనులకు వద్దకు వెళ్లి మరి ప్రచారం చేశారు.
కార్మికుల వ్యతిరేకతను గుర్తించక..
జాతీయ సంఘాలను కాదని తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ను కార్మికులు, తెలంగాణ వాదులు గెలిపించారు. గెలిచిన తరువాత మల్లయ్య వర్గం నేతలపై కార్మికుల్లో వస్తున్న వ్యతిరేకతను పార్టీ గుర్తించలేకపోయింది. ఫిట్ స్థాయి నుంచి మొదలు కొని డివిజన్, కేంద్ర కమిటీ నేతలపై తీవ్ర వ్యతిరేక పవనాలు వీచాయి. అవినీతి ఆరోపణలు, కార్మికుల సమస్యలు పట్టించుకోకపోవడం, యాజమాన్యానికి సహకరించారనే ఆరోపణలున్నాయి. ఈ పరిణామాలతో కార్మికులు మల్లయ్య నాయత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దీన్ని పార్టీ గుర్తించలేదు. దీంతో పార్టీ మద్దతిచ్చినా కాార్మికుల ఆగ్రహం ముందు అది చిన్నదైంది. కాగా, సింగరేణి విస్తరించిన నాలుగు జిల్లాల్లో ఈ ఎన్నికలు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో సింగరేణి కార్మికులు ఇచ్చిన ఈ విలక్షణ తీర్పు మున్ముందు ఎలాంటి ప్రభావం చూపుతున్నది చూడాలి.
రాజిరెడ్డి ఎటువైపు..?
పార్టీ సంబంధం లేదని చెప్పినా కూడా రాజిరెడ్డి వర్గం నేతలు కేసీఆర్ ఫొటోనే పెట్టుకొని గెలిచిన తరువాత ఆయన నాయకత్వంలోనే పని చేస్తామంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు అన్నట్లుగానే పార్టీకి అనుబంధంగా పని చేస్తారా స్వయం ప్రతిపత్తిగా ఉంటారా అన్నది చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే రాజిరెడ్డిని వెనుకుండి నడిపించిన ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి స్వయంగా ఈ ప్యానల్ నేతలతో కలిసి గెలుపుపత్రం పట్టుకొని కేసీఆర్ వద్దకు వెళ్లి వాస్తవ పరిస్థితిని వివరిస్తారని విశ్వాసనీయ సమాచారం. ఏది ఏమైనా పార్టీ ఎవరికీ మద్దతివ్వకుండా ఉంటే బాగుండేదని పలువురు భావిస్తున్నారు.
టీఆర్‌ఎస్‌కు షాక్
Published Tue, Feb 25 2014 1:21 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
Advertisement
Advertisement