'అధిష్టానం నిర్ణయం బాధ కలిగించింది'
'అధిష్టానం నిర్ణయం బాధ కలిగించింది'
Published Tue, Aug 23 2016 12:33 PM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
కార్యకర్తల అభీష్టం మేరకే భవిష్యత్ నిర్ణయం
‘సాక్షి’తో టీబీజీకేఎస్ నేత మిర్యాల రాజిరెడ్డి
రామకృష్ణాపూర్(ఆదిలాబాద్): ‘పొలిటీషియన్‌లా కాకుండా కార్మికులకు నిస్వార్థంగా సేవ చేయాలనే ఆలోచనతోనే ట్రేడ్ యూనియన్‌లో చేరాను.. పారదర్శకంగా సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో హైకమాండ్ నన్ను పక్కనబెట్టడం బాధ కలిగించింది’.. అని టీఆర్‌ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నేత మిర్యాల రాజిరెడ్డి అన్నారు. టీబీజీకేఎస్ నూతన కమిటీ ప్రకటించిన నేపథ్యంలో సోమవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
ప్రశ్న : నూతన కమిటీ ఏర్పాటు క్రమంలో అధిష్టానం మిమ్మల్ని సంప్రదించిందా?
జవాబు : సంప్రదించారు. టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీని వాస్‌రెడ్డి నాతో మాట్లాడారు. కొద్దిరోజుల తర్వాత సరైన స్థానంలో నియమిస్తామని చెప్పారు. త్వరలో ఎన్నికలు ఉన్నందున యూనియన్ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.
నూతన కమిటీ నియామకంలో అధిష్టానం ఆంతర్యమేమిటీ..?
గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కమిటీ మార్పు అనివార్యమని అధిష్టానం భావించింది. గెలుపే లక్ష్యంగా కొన్ని సర్ధుబాట్లు తప్పవని, అందుకే నూతన కమిటీని ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు.
భవిష్యత్‌పై ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు..?
కొత్తగా ఏ నిర్ణయం తీసుకునేది లేదు. గుర్తింపు ఎన్నికలు జరిగేలోపు సముచిత స్థానం దక్కుతుందనే ఆశిస్తున్నాను. నా అనుచరగణం, నాయకుల కోసం పని చేస్తా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర యూనియన్‌లో చేరేది లేదు.
అధిష్టాన నిర్ణయం మీకెలా అనిపించింది.?
ఉన్నట్టుండి కమిటీని మార్చడం కొంత బాధ కలిగిన మాట వాస్తవమే. కాకపోతే ముందస్తుగా అధిష్టానం సంప్రదించింది కాబట్టి ఇబ్బందికరంగా భావించడం లేదు. నన్ను నమ్ముకున్న నాయకులకు, క్యాడర్‌కు మాత్రం నిరాశ కలిగించింది.
కొత్త యూనియన్ పెట్టే ఆలోచన ఏమైనా ఉందా?
అలాంటి ఆలోచనే లేదు. నేను స్వతహాగా సింగరేణి ఉద్యోగిని. ఇంకా ఎనిమిదేళ్ల సర్వీసు ఉంది. కార్మిక క్షేత్రంలోనే ఉంటా.. పొలిటీషియన్‌లా కాకుండా ట్రేడ్ యూనియన్ నాయకుడిలా నిస్వార్థంగా సేవలందిస్తా.
ఇతర యూనియన్ల నుంచి పిలుపులు వస్తున్నాయని తెలిసింది..?
కొన్ని సంఘాల నుంచి పిలుపులు వస్తున్న మాట వాస్తవమే. నాయకులు సంప్రదింపులు జరుపుతున్నారు. తమ యూనియన్లలోకి రమ్మంటున్నారు. అయినా పెద్దగా ఆసక్తి లేదు. అధిష్టానం చెప్పిన విధంగా టీజీబీకేఎస్‌లోనే కొనసాగుతాం. కార్మికులను, క్యాడర్‌ను ముందుకు నడిపి యూనియన్ విజయం కోసం పాటుపడతా.
మీపై వచ్చిన విమర్శలు మార్పులకు కారణమై ఉంటాయా..?
జ: ఇప్పటి దాకా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. నాపై ఎమ్మెల్యేలకు సదాభిప్రాయమే ఉందని మేడం(కవిత) చెప్పారు. పారదర్శకంగా ఉంటానన్న సంకేతాలు అధిష్టానానికి చేరాయి. కాకపోతే ఏవైనా లోపాలుంటే చెబితే సరిచేసుకునే అవకాశం ఉండేది.
Advertisement