గుర్తింపు పోరు..
గుర్తింపు పోరు..
Published Sat, Aug 20 2016 12:12 PM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
సింగరేణిలో ఎన్నికల హడావుడి
23న సంఘాలతో సీఎల్‌సీ సమావేశం
కార్మిక సంఘాలకు చేతినిండా పని
మంచిర్యాల సిటీ : సింగరేణి బొగ్గుగని కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలకు కార్మిక శాఖ సన్నద్ధమవుతోంది. ఐదో గుర్తింపు సంఘం కాలపరిమితి జూన్ 29న ముగిసింది. ఆరో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు చీఫ్ లేబర్ కమిషనర్ (సీఎల్‌సీ) ఈ నెల 23న రిజిస్ట్రేషన్ ఉన్న కార్మిక సంఘాలతో కొత్తగూడెంలో సమావేశం కానున్నారు. కాలపరిమితి ముగిసి సుమారు రెండు నెలలు గడుస్తుండగా.. ఎన్నికలను ఎప్పుడు ఎదుర్కొందామా అని ఎదురు చూస్తున్న కార్మిక సంఘాలకు చేతినిండా పని దొరికింది. సంఘాలకు సంబంధించి.. ప్రభుత్వ పరంగా ఉండే ధ్రువీకరణ పత్రాలతో సమావేశానికి ప్రథమశ్రేణి నాయకులు సన్నద్ధం అవుతున్నారు. పారిశ్రామిక శాంతి కోసం సింగరేణిలో మొట్టమొదటిసారిగా 14 సెప్టెంబర్ 1998న ప్రభుత్వ పరంగా కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఆర్టీసీ కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు ముగిశాయి. ఆ ఎన్నికల్లో గుర్తింపు సంఘంగా టీఆర్‌ఎస్ అనుబంధ సంఘం టీఎంయూ భారీ మెజార్టీతో గెలిచింది. అధికార పార్టీకి ప్రస్తుతం రాష్టంలో ఎక్కడ కూడా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. సింగరేణిలో మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో ప్రభుత్వంలో కదలిక వచ్చిందని చెప్పవచ్చు. అధికార పార్టీకి చెందిన సింగరేణి కార్మిక సంఘం టీబీజీకేఎస్‌కు పూర్తి స్థాయిలో కమిటీని గురువారం ప్రకటించారు. దీంతో సింగరేణిలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది.
ఎన్నికలు..
1998కి పూర్వం సింగరేణి సంస్థలో సుమారు 98 కార్మిక సంఘాలు ఉండేవి. వీటిలో ప్రతి సంఘం కార్మిక శ్రేయస్సు కంటే వారి మనుగడకే ప్రాధాన్యం ఇస్తూ చీటికి మాటికి ప్రతీ చిన్న సమస్యను భూతద్దంలో చూస్తూ వారి ఉనికిని కాపాడుకోవడానకి సమ్మెకు వెళ్లడం జరిగేది. అధిక సంఖ్యలో కార్మిక సంఘాలు ఉండడం వల్ల ఏ సంఘానికి కార్మికులు అండగా ఉంటున్నారో తెలిసేది కాదు. ఏ సంఘాన్ని కార్మికులు ఆమోదిస్తున్నారో కూడా అంతుపట్టేది కాదు. 1991-92 ఆర్థిక సంవత్సరంలో సింగరేణిలో రికార్డు స్థాయిలో 475 సమ్మెలు జరిగాయి. దీని వల్ల పారిశ్రామిక శాంతికి విఘాతం కలిగి సంస్థ అభివృద్ధి కుంటుపడింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కార్మిక సంఘాలకు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించక తప్పలేదు. భారతదేశ బొగ్గు పరిశ్రమ చరిత్రలోనే మొదటిసారిగా 14 సెప్టెంబర్ 1998న సీక్రెట్ బ్యాలెట్ ద్వార కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్ల వల్ల సంస్థలో కచ్చితమైన నిబంధలు అమలు కావడంతో 2002-03 ఆర్థిక సంవత్సరంలో సమ్మెల సంఖ్య 35కు చేరుకుని.. నేడు సమ్మెలు ఎరుగని సింగరేణిగా గుర్తింపు సాధించింది.
సంఘాలు..
ఒకప్పుడు సింగరేణిలో వందకు చేరువలో సం ఘాలు ఉండగా.. నేడు వాటిని వేళ్లమీద లెక్కించవచ్చు. కార్మిక ఓట్ల ద్వార గెలిచిన సంఘం.. సింగరేణి గుర్తింపు సంఘంగా నమోదవుతుంది. ఏరి యాలో గెలిచిన సంఘాన్ని ప్రాతినిధ్య సంఘంగా పిలుస్తారు. కార్మికులు రెండు ఓట్లు వేస్తారు. ఎన్నికల పుణ్యమాని సింగరేణిలో ప్రస్తుతం ఐదు జాతీయ సంఘాలతోపాటు టీబీజీకేఎస్, టీఎన్‌టీయూసీ, ఐఎఫ్‌టీయూ, ఏఐసీటీయూ, ఎస్‌జీకేఎస్ మాత్రమే ఉన్నారుు. వీటిలో టీఎన్‌టీయూసీ, ఎస్‌జీకేఎస్, ఏఐసీటీయూ ప్రభావం కేవలం ఎన్నికల సమయంలోనే కనిపిస్తోంది. క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించడంతో కార్మికుల్లో సంస్థపై కలిగిన అవగాహన, ప్రభుత్వం, యాజమాన్యంపై పెరిగిన విశ్వాసంతో సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. దీంతో కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి ప్రాతినిధ్య, గుర్తింపు సంఘాలపై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో సమ్మెలు తగ్గి, కార్మిక సంఘాల ప్రభావం కనుమరుగైందని చెప్పవచ్చు.
గుర్తింపు సంఘం ఎన్నికల వివరాలు....
ఎన్నికలు ఎన్నిక జరిగింది కాలపరిమితి కాలం
1వ 14-09-1998 14-09-1998 15-09-2000 2ఏళ్లు
2వ 11-02-2001 11-02-2001 12-02-2003 2ఏళ్లు
3వ 09-05-2003 09-05-2003 10-05-2007 4ఏళ్లు
4వ 10-08-2007 10-08-2007 11-08-2011 4ఏళ్లు
5వ 28-06-2012 28-06-2012 29-06-2016 4ఏళ్లు
6వ ఆరోసారి నిర్వహించే ఎన్నికల తేదీని ప్రకటించాల్సి ఉంది....
Advertisement