MIS
-
కశ్మీర్ : ఆపిల్ రైతులపై దాడులు; సంబంధాలే ముఖ్యం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో నిత్యం జరిగే ఉగ్రదాడులతో ప్రజలు భయంభయంగా బతుకున్నారు. ఇక రైతుల కష్టాలు సరేసరి. తాము పండించిన పంటను మార్కెట్‌కు తరలించి అమ్మకునేందుకు ఆపిల్ రైతులు, సరఫరాదారులు ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. ఇటీవల దక్షిణ కశ్మీర్‌లోని సోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆపిల్ పంట ట్రాన్స్‌పోర్టు చేస్తున్న ఓ ట్రక్కుపై ఉగ్రవాదులు దాడిచేసి ఇద్దరు కాశ్మీరీయేతర ట్రక్కు డ్రైవర్లను కాల్చి చంపారు. మరో రెండు ట్రక్కులను ఉగ్రవాదులు తగులబెట్టారు. అక్టోబర్ 14న రాజస్తాన్‌కు చెందిన ట్రక్కు డ్రైవర్లను కాల్చి చంపారు. దీంతో కశ్మీర్‌కు వాహనాల్ని పంపేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. బయటి రాష్ట్రాలకు ఆపిల్ పంటను రవాణా చేసే క్రమంలో దాడులు జరుగుతున్న నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ పరిపాలన అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్కెటింగ్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (ఎంఐఎస్) ఆపిల్ రైతుల నుంచి గిట్టుబాటు ధరకు పంటను కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు. బయటి రాష్ట్రాల్లో అమ్ముకుంటే వచ్చేదానికన్నా ఎక్కువ ధర చెల్లించిమరీ కొనుగోలు చేస్తామని అన్నారు. అయితే, ఈ విధానంపై రైతులు, వ్యాపారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర రాష్ట్రాల వ్యక్తులతో సంవత్సరాల నుంచి ఉన్న తమ వ్యాపార సంబంధాలు దెబ్బతింటాయని అంటున్నారు. ఎంఐఎస్ స్కీమ్‌పైగులాంనబీ అనే రైతు మాట్లాడుతూ.. ‘సంప్రదాయ మార్కెటింగ్ విధానంలోనే ఇటీవల 15 కిలోల ఆపిల్ పెట్టెను కశ్మీర్ నుంచి ఢిల్లీకి సరఫరా చేశాను. దాదాపు రూ.700 నుంచి రూ. 800 వరకు లాభం వచ్చింది. కానీ ఎంఐఎస్ స్కీమ్ ద్వారా సరఫరా చేస్తే రూ.1000 వచ్చేవి. అయితే, నాకది ఇష్టం లేదు. బయటి రాష్ట్రాల ప్రజలు, వ్యాపారులతో చాలా ఏళ్లుగా ఉన్న సంబంధాలే మాకు ముఖ్యం. డబ్బులు ప్రధానం కాదు. పంజాబ్ లేదా దక్షిణ భారతదేశంలోని వ్యాపారులతో కశ్మీర్ వ్యాపారుల సంబంధాలను విచ్ఛిన్నం చేయడం మాకు ఇష్టం లేదు’అన్నాడు. -
ఆయిల్ పామ్ కు ఎంఐఎస్ భేష్
స్వాగతించిన ఓపీడీపీఏ హైదరాబాద్: పామాయిల్ రైతులకు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్(ఎంఐఎస్)ను వర్తింపజేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ద ఆయిల్ పామ్ డెవలపర్స్ అండ్ ప్రాసెసర్స్ అసోసియేషన్(ఓపీడీపీఏ) పేర్కొంది. ఆయిల్ పామ్ ఫ్రెచ్ ఫ్రూట్ బంచెస్(ఎఫ్‌ఎఫ్‌బీ)కి టన్నుకు ఎంఐఎస్‌గా రూ.7,888ను కేంద్రం నిర్ణయించింది. గత ఏడాది కాలంలో ముడి చమురు ధరలు బాగా తగ్గాయని, ఇది ఆయిల్ పామ్ పరిశ్రమ, రైతులపై తీవ్రమైన ప్రభావం చూపించిందని ఓపీడీపీఏ అధ్యక్షుడు సంజయ్ గోయెంకా చెప్పారు. సమస్యల నుంచి గట్టెక్కెందుకు కనీస మద్దతు ధర(ఎంఐఎస్) లేదా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్(ఎంఐఎస్) కావాలని కోరామని పేర్కొన్నారు. కేంద్రం ఎంఐఎస్‌ను ప్రకటించడం రైతులకు, పరిశ్రమకు పెద్ద ఊరట అని వివరించారు. భారత్‌లో ఉత్పత్తయ్యే పామాయిల్లో 90 శాతం వాటా తెలంగాణ, ఏపీలదేనని, ఈ చర్య ఈ రెండు రాష్ట్రాల రైతులకు ప్రయోజనం కలిగిస్తుందని పేర్కొన్నారు.